close

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముందు నుంచే ముందడుగు!

ఇంజినీరింగ్‌ నాలుగేళ్ల ప్రణాళిక

ఏటా లక్షల మంది ఇంజినీర్లు మార్కెట్‌లోకి వచ్చేస్తున్నారు. దీంతో ఉద్యోగాలకు పోటీ ఎక్కువైపోతోంది. ఈ పరిస్థితుల్లో విజయం సాధించాలంటే ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం నుంచే కెరియర్‌ను మలచుకోవాలి. డిగ్రీ చేతికొచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే దెబ్బతింటారు. అందుకే ప్రారంభం నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటర్మీడియట్‌ వరకూ చదువులు ఒక పద్ధతిలో సాగితే ఇంజినీరింగ్‌ది మరో స్థాయిలో ఉంటుంది. ఇంటర్మీడియట్‌ లక్ష్యం మంచి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉత్తమ బ్రాంచిలో సీటు సంపాదించడమైతే, ఇంజినీరింగ్‌ది కొన్నేళ్ల భవిష్యత్తు. అందుకే మొదటి ఏడాది నుంచే ప్రణాళికతో క్రమబద్ధంగా, అదనపు నైపుణ్యాలు, మెలకువలను జోడించుకుంటూ ముందుకుసాగాలి. డిగ్రీ పట్టా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఉద్యోగం సంపాదించాలన్నా, ఉన్నత విద్యకు వెళ్లాలన్నా కొన్ని అదనపు అంశాలు అవసరమవుతాయి. వీటిని మూడో ఏడాదిలోనో, చదువు పూర్తయిన తర్వాతో ప్రారంభిద్దామనుకుంటే సమయం మించిపోతుంది.అందుకే ఏ ఏడాది ఏం చేయాలో ముందే తెలుసుకోవడం చాలా అవసరం.

2018 నుంచి దేశం మొత్తం బీటెక్‌ను ఒకే సరళిలో అందిస్తున్నారు. ఏఐసీటీఈ ఉద్యోగ సంసిద్ధతకు అవసరమైన మార్పులు చేసి బీటెక్‌ కోర్సులకు పదును పెట్టింది. ఉత్తీర్ణత పర్సెంటేజీల్లో కాకుండా గ్రేడ్‌ల రూపంలో ఇస్తారు. సాధారణంగా 10కి 6.5 కన్నా ఎక్కువ గ్రేడు ఉన్నవారు ఉద్యోగాలకు అర్హత పొందుతారు. థియరీ తగ్గించి, ప్రాక్టికల్స్‌కి ప్రాధాన్యమిచ్చారు. చదువుతోపాటు ఇతర అభిరుచులను అభ్యసించడానికీ సమయమిచ్చారు. యూజీసీ చొరవతో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లకు సులువుగా దరఖాస్తు చేసుకునేలా ఇంటర్న్‌శాల అనే వెబ్‌పోర్టల్‌తో ఒప్పందం చేసుకుంది.మొదటి సంవత్సరం: ఆప్టిట్యూడ్‌, లాంగ్వేజీలు

ఇంటర్‌లో చదివిన భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలే ఇంజినీరింగ్‌లోనూ ఉంటాయి. కాకపోతే ఇంటర్‌ కంటే ఎక్కువ స్థాయిలో వీటిని చదువుతారు. సిలబస్‌లోనూ బ్రాంచిని బట్టి కొంత మార్పు ఉంటుంది. ఈ సబ్జెక్టులతోపాటు అన్ని బ్రాంచిలకీ అవసరమైన సీ లాంగ్వేజీ కూడా ఉంటుంది. బోధన పద్ధతిలోనూ తేడా ఉంటుంది. ఇంజినీరింగ్‌లో స్వయంగా నేర్చుకోవాలి.

అదనంగా: కంపెనీలు, నియామక సంస్థలు విద్యార్థుల ఇంగ్లిష్‌ ప్రావీణ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. పరిశ్రమల్లో ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ రంగంలో కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారికి అధికారిక, అనధికారిక, పాక్షిక అధికారిక సమాచార పద్ధతుల పట్ల సమగ్రమైన అవగాహన చాలా అవసరం. వీటితోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధవహించాలి. బాడీ లాంగ్వేజీపైనా నియంత్రణ అలవాటు చేసుకోవాలి. ఉద్యోగాలకూ, ఉన్నత విద్యకూ ఎక్కువగా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తుంటారు. తక్కువ వనరులతో ఎక్కువ ప్రయోజనాలు కలిగించే టెక్నాలజీ అభివృద్ధి ఇంజినీరింగ్‌ లక్ష్యం. ఈ ఆలోచనా ధోరణిని, సమస్యా పరిష్కార నైపుణ్యాలను ఆప్టిట్యూడ్‌ పరీక్షల్లో పరిశీలిస్తారు. వీటిపై పట్టు పెంచుకోడానికి ప్రయత్నించాలి.
బ్రాంచితో సంబంధం లేకుండా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ మెలకువలు నేర్చుకోవాలి. విశ్వవిద్యాలయ సిలబస్‌ ప్రకారం ఉన్న సీi ప్రోగ్రామింగ్‌ మౌలికాంశాలకే పరిమితం కాకుండా వివిధ ప్రోగ్రామ్‌లపైనా దృష్టిపెట్టాలి. కనీసం రెండు ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు నేర్చుకోవాలి. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు సిలబస్‌లో భాగంగా రెండుకన్నా ఎక్కువ లాంగ్వేజ్‌లు ఉంటాయి. వీరు సిలబస్‌లో లేని, ఉద్యోగ అవకాశాలు కొంచెం త్వరగా అందించే, ఎక్కువ డిమాండ్‌ ఉన్నవాటిని గుర్తించి నేర్చుకోవాలి. పైతాన్‌, రూబి వంటి వాటితోపాటు జాంగో ్బద్చీౖ-్ణ్న్శ వంటి వెబ్‌సైట్‌ల అభివృద్ధికి అవసరమయ్యే టూల్స్‌ నేర్చుకోవడం మేలు. లాంగ్వేజ్‌ నేర్చుకున్నాక దానిని ఉపయోగిస్తూ సొంతంగా ప్రాజెక్ట్‌ చేస్తే దానిపై మరింత పట్టు పెంచుకోవచ్చు.చక్కటి అవగాహనతో ప్రయాణం

ఇంజినీరింగ్‌ మొదటి ఏడాదిలో ఉన్నప్పుడు కళాశాల సబ్జెక్టులకు తప్ప వేరే అంశాలకు ప్రాధాన్యమివ్వలేదు. మొదటి ఏడాది పూర్తయ్యాక అప్పటికే ఉద్యోగంలో చేరిన సీనియర్లతో మాట్లాడాను. ఆ తర్వాతే భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై అవగాహన వచ్చింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవ్వాలన్నది నా కల. రెండో ఏడాది ప్రారంభం నుంచి ఏం చేస్తే నా లక్ష్యాన్ని చేరతాను అన్నదానిపై పూర్తిగా దృష్టిపెట్టాను. మొదట్లో చాలా సందేహాలొచ్చాయి. ఫ్యాకల్టీ సాయం తీసుకున్నాను. మా కళాశాల ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ సాయంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం సాధన చేశాను. నా సాధన, నేర్చుకున్న నైపుణ్యాలు, కళాశాల తోడ్పాటుతోనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవ్వాలన్న నా కల నెరవేరింది. కాబట్టి, ముందు నుంచే స్పష్టమైన అవగాహనతో ప్రయాణాన్ని ప్రారంభించాలి. అప్పుడే సమయం అందుబాటులో ఉంటుంది. నేర్చుకోవడానికీ, ప్రయోగాలకీ అవకాశం ఉంటుంది. అవకాశాలు అందరికీ వస్తాయి. వాటిని గుర్తించి, అందుకోవడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది.

- జస్విన్‌ టి జోసెఫ్‌, ఏస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల

 

 

రెండో సంవత్సరం: సబ్జెక్టులపై పట్టు, టూల్స్‌

బ్రాంచికి సంబంధించిన సబ్జెక్టులు ఈ ఏడాది నుంచే మొదలవుతాయి. వీటి ఆధారంగా అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్టులు ఆపై సంవత్సరాల్లో ఉంటాయి. సీనియర్లు, అధ్యాపకుల సాయంతో వివిధ సబ్జెక్టుల అంతర సంబంధాలను తెలుసుకుని ఒక ఛాయాచిత్రం రూపంలో వేసుకుని పెట్టుకోవాలి. దీని ద్వారా చదివే సబ్జెక్టులు, వాటి అవసరాలపట్ల మంచి అవగాహన ఏర్పడుతుంది. ఈ ఏడాది సబ్జెక్టులతోపాటు, ఆ బ్రాంచికి సంబంధించిన ఒకటి, రెండు టూల్స్‌ నేర్చుకోవాలి.
ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచి వారు మల్లిసిమ్‌ అనే సాఫ్ట్‌వేర్‌, మ్యూట్‌ల్యాబ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీ, పీసీబీ తయారీ వంటి ప్రాథమికస్థాయి మెలకువలను అదనంగా నేర్చుకోవచ్చు. సివిల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఆటోక్యాడ్‌ ప్యాకేజీ నేర్చుకుంటే చాలా ఉపయోగం. ఎలక్ట్రికల్‌ విద్యార్థులు ఈసీఈ వారు చేసేవాటికే ప్రాధాన్యమివ్వవచ్చు. సీఎస్‌ఈ, ఐటీ వారు సీ++, వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌ టూల్స్‌, స్క్రిప్టింగ్‌ టూల్స్‌/ యానిమేషన్‌ టూల్‌ వంటివి నేర్చుకోవచ్చు. ఒక క్రమమైన పద్ధతిలో, ప్రణాళిక ప్రకారం నేర్చుకోవాలి. తర్వాత ప్రాజెక్ట్‌ చేయాలి. అప్పుడే పరిజ్ఞానాన్ని అనువర్తించడంపై అవగాహన వస్తుంది.


మూడో సంవత్సరం: ఆవిష్కరణలపై అవగాహన

బీటెక్‌లోని సబ్జెక్టులతోపాటు మొదటి రెండేళ్లలో నేర్చుకున్న నైపుణ్యాలను మెరుగుదిద్దుకోవాలి. దీంతోపాటు తమ రంగంలో వస్తున్న మార్పులు, అభివృద్ధి, నూతన ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలి. కొత్త టెక్నాలజీలు, వాటికి ఉన్న అవకాశాలు, వాటినిచ్చే సంస్థల గురించి సమాచారం సేకరించుకోవాలి.అభిరుచుల మేరకు తగిన శిక్షణ తీసుకోవాలి.
ఉదాహరణకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, రోబోటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వర్‌, సేల్స్‌ఫోర్స్‌, డెవ్‌ఆప్స్‌, ఆండ్రాయిడ్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌, వర్చువల్‌ రియాలిటీ వంటి అధునాతన టెక్నాలజీలలో నచ్చినవాటిలో శిక్షణ తీసుకోవచ్చు. వీటిని ఏ బ్రాంచికి చెందినవారైనా నేర్చుకోవచ్చు. అలాగే తమ తమ శాఖలకు సంబంధించిన నైపుణ్యాలపైనా దృష్టిపెట్టాలి. 3డీ యానిమేషన్‌, క్రియో ఆన్‌సిస్‌ వంటి టూల్స్‌ మెకానికల్‌ రంగం వారికి ఉపయోగం. కంప్యుటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌, 3డీ ప్రింటింగ్‌, నానోటెక్నాలజీలు వీరికి మంచివే. ఈసీఈ, ఈఈఈ వారు సిమ్యులేషన్‌, మ్యాట్‌ల్యాబ్‌, మైక్రోకంట్రోలర్స్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ రంగంలో అవసరమయ్యే నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ కూడా మంచిదే.నాలుగో సంవత్సరం: పోటీల్లో భాగస్వామ్యం


ముందు మూడేళ్లలో నేర్చుకున్న మెలకువలను ఉపయోగించే, ప్రతిభను ప్రదర్శించే సమయమిది. ఉద్యోగం చేయాలనుకునేవారు వివిధ హ్యాకథాన్‌, టాలెంట్‌ హంట్‌ వంటి ప్రతిభా పోటీల్లో పాల్గొనాలి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఐబీఎం వంటి ఐటి దిగ్గజాలతోపాటు కాగ్నిజెంట్‌, టీసీఎస్‌, విప్రో, ఎల్‌ అండ్‌ టీ వంటి ప్రముఖ సంస్థలూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించి వాటిలో ప్రతిభను ప్రదర్శించిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. ప్రాంగణ, ప్రాంగణేతర నియామకాల్లోనూ పాల్గొనాలి. వీటిల్లో విజయం సాధించాలంటే నిరంతర అభ్యాసం తప్పనిసరి. అలాగే ఎంత నేర్చుకున్నా దానిని అనువర్తింపజేసే అవకాశమున్న ప్రాజెక్టులు చేయకపోతే వృథానే. దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాజెక్టు కూడా ఈ ఏడాదిలోనే ఉంటుంది. అలాగే మాక్‌ ఇంటర్వ్యూలనూ సాధన చేయాలి.తర్వాత ఏంటి.. స్పష్టత అవసరం

నీలమేఘశ్యామ్‌ దేశాయ్‌

బీటెక్‌ తరువాత ఏం చేయాలన్నదానిపై స్పష్టత మొదటి ఏడాది నుంచే ఉండాలి. మూడు లేదా నాలుగో ఏడాదిలో చూద్దామనుకోవడం కరెక్ట్‌ కాదు. విదేశీ విద్య లక్ష్యం అయితే.. ఏ దేశం? అక్కడి ప్రముఖ యూనివర్సిటీలు, ఫీజు రాయితీలు, ఉపకారవేతనాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుకోవాలి. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలో కూడా చూసుకోవాలి. కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు రిసెర్చ్‌, ఇంటర్న్‌షిప్‌లు వంటి అంశాలకూ ప్రాముఖ్యాన్నిస్తాయి. అలాగే చేయాలనుకునే ఉన్నతవిద్యకు సంబంధించి ఆశిస్తున్న ప్రీరిక్విజిట్‌ టెస్ట్‌లు- జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌, వాటి చెల్లుబాటు వంటి వాటిపైనా అవగాహన పెంచుకోవాలి. సన్నద్ధత ప్రారంభించాలి. వీటన్నింటినీ చివరి సంవత్సరాల్లో పూర్తి చేయడం కష్టంతో కూడుకున్న పని. మనదేశంలోనే ఉన్నతవిద్యను అభ్యసించాలనుకుంటే.. ఏ కోర్సు? అందుబాటులో ఉన్న ప్రముఖ సంస్థలు, వాటి ప్రవేశపరీక్షలు, సిలబస్‌, సంబంధిత రంగంలో ఉన్న ప్రత్యేకతలు వంటి అంశాలను చూసుకోవాలి. వీటిపై సొంతంగా రిసెర్చ్‌ చేసుకోవడం మంచిది.
మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు