close

తాజా వార్తలు

టీమిండియా కొత్త గురువు ఎవరో..?

టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపికకు రంగం సన్నద్ధమవుతోంది. కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ ఈ నెల 16న ప్రధాన కోచ్‌ పదవికి ఇంటర్వ్యూలు చేపట్టనుంది. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి, టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌కు మాత్రమే తుది జాబితాలో స్థానం దక్కింది. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో వీరికి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ముంబయికి రాలేని వాళ్లు స్కైప్‌ ద్వారా కపిల్‌ కమిటీతో మాట్లాడతారు. ప్రెజెంటేషన్‌ ఇస్తారు. కోహ్లీ కోరుకున్నట్లు రవిశాస్త్రికే కమిటీ జెండా ఊపుతుందో లేక కొత్త గురువుకు బాధ్యతలు కట్టబెడుతుందో అన్న అంశం ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ప్రధాన కోచ్‌ సహా అన్ని పదవులకూ కలిపి బీసీసీఐకి 2 వేల దాకా దరఖాస్తులు రావడమూ మరో విశేషం. ఈ సంగతి అలా ఉంచితే.. తుది జాబితాలో నిలిచిన ఆ ఆరుగురు పూర్వాపరాలు పరిశీలిద్దాం..

‘ఆటను ఆస్వాదించండి. ఆనందించండి. స్వేచ్ఛగా ఉండండి’ అనేదే శాస్త్రి తత్వం. సారథి విరాట్‌దీ అదే విధానం కావడంతో ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఏర్పడింది. ఆటగాళ్ల విషయంలో శాస్త్రి ప్రత్యేకించి శిక్షణేమీ ఇవ్వరు. సూచనలూ చేయరు. కేవలం మానసికంగా బలవంతుల్ని చేసి వారిలో సానుకూల దృక్పథాన్ని అలవాటు చేయడమే నా పని అంటారు శాస్త్రి. 

రవి‘శాస్త్రి’యం.. 

టీమిండియాకు 2017, జులై 13 పూర్తిస్థాయిలో కోచింగ్‌ బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి దృక్పథం పూర్తి వైవిధ్యం. జట్టు ఎలా ఆడుతున్నా అసలు ఆందోళన దరిచేరనీయడు. జట్టును బలంగా నమ్ముతాడు. వారి నిర్ణయాలను గౌరవిస్తూ ఈ రెండేళ్ల కాంట్రాక్టులో కోచ్‌గా శాస్త్రి ఎంతో విజయవంతమయ్యారు. అంతకు ముందు డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసమని భారత్‌ మొదట శ్రీలంకకు వెళ్లింది. అక్కడ టీమిండియాదే విజయం. తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ల్లోనూ మనదే గెలుపు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌ ఓడిపోగా, వన్డే సిరీస్‌లో 5-1తో విజయం సాధించింది టీమిండియా. తర్వాత ఇంగ్లాండ్‌లో టెస్టు, వన్డే సిరీస్‌ రెండింట ఓడినా.. అదే ఏడాది డిసెంబర్‌ చివర్లో ఆస్ట్రేలియాపై 2-0తో టెస్టు సిరీస్‌ను నెగ్గి ఆసీస్‌ను వారి గడ్డపైనే ఓడించిన జట్టుగా కోహ్లీసేన రికార్డు సృష్టించింది. ఈ పరంపరలో ఆసియా కప్‌ కూడా మనదే. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి మినహా లీగ్‌లోనూ మనదే అగ్రస్థానం. ఇలా వరుస విజయాలు, టెస్టుల్లో అగ్రస్థానం.. వంటి అంశాలతో జట్టులో గొప్పగా స్థైర్యం నింపిన రవిభాయ్‌కే మళ్లీ నా ఓటు అంటూ ఇటీవల సారథి కోహ్లీ అన్నాడు. ప్రస్తుత పరిణామాలు కూడా అతనికే అనుకూలంగా ఉన్నాయి. మరి నిబంధనల ప్రకారం, కపిల్‌ నేతృత్వంలోని సీఏసీ కూడా శాస్త్రికే పచ్చజెండా ఊపుతుందో లేదో చూడాలి. 

‘మూడ్‌’ మార్చుతాడా..
టామ్‌ మూడీ.. ఐపీఎల్‌ ద్వారా భారత అభిమానులకు సుపరిచితమైన పేరు. 80ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ మాజీ ఆల్‌రౌండర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌లే ఆడినా.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మంచి ప్రదర్శనతో అలరించాడు. 2001లో క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత వ్యాఖ్యాతగా, తర్వాత కోచ్‌గా అడుగులు వేశాడు. 2005లో శ్రీలంక జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 2007 ప్రపంచకప్‌లో ఆ జట్టు ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌ ముందుగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు కోచ్‌గా పనిచేశాడు. 2013-19 మధ్య కాలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌గా పగ్గాలు అందుకున్నాడు. ఈ ఆరేళ్ల కాలంలో సన్‌రైజర్స్‌ ఐదుసార్లు క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించగా, 2016లో టైటిల్‌ అందుకుంది. బౌలింగ్‌ వనరులనే ప్రధాన ఆయుధంగా మార్చుకొని ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ను టామ్‌ గొప్పగా తీర్చిదిద్దాడు. ఆటగాళ్లలో నిత్యం స్ఫూర్తి నింపుతూ జట్టును విజయాల బాట పట్టించాడు. డేవిడ్‌ వార్నర్‌ మినహా జట్టులో చెప్పుకొదగ్గ బ్యాట్స్‌మెన్‌ లేకపోయినప్పటికీ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే అద్భుతాలు సృష్టించాడు. ఇలా ఐపీఎల్‌తో భారతీయతకు అలవాటు పడిన టామ్‌ ప్రస్తుతం రవిశాస్త్రికి ప్రధాన పోటీదారుగా రేసులో నిలిచాడు. మరి తన స్ఫూర్తిదాయకమైన దృక్పథంతో ఇంటర్వ్యూలో కపిల్‌ బృందాన్ని మూడీ మెప్పిస్తాడో లేదో చూడాలి. 

‘కివీస్‌’ హెసన్‌.. 
22 ఏళ్లకే కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన హెసన్‌ చాలావరకు విజయవంతమయ్యాడు. ఆరంభంలో దేశవాళీ జట్లకు కోచ్‌గా పనిచేసి 2012లో న్యూజిలాండ్‌ జాతీయ జట్టు ప్రధాన కోచ్‌గా పగ్గాలు అందుకున్నాడు. ఏకంగా ఆరేళ్లపాటు సేవలందించాడు. 2015 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరినప్పుడు ఆయనే ప్రధాన కోచ్‌. టెస్టు క్రికెట్‌లోనూ కివీస్‌ను గొప్పగా తీర్చిదిద్దాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు మూడో స్థానానికి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. యువ ఆటగాళ్లను నిత్యం ప్రోత్సహిస్తూ వారికి ఎక్కువ అవకాశాలిస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేలా తోడ్పాటునందించాడు. 2019 ప్రపంచకప్‌ వరకూ న్యూజిలాండ్‌ కోచ్‌గా హెసన్‌కే కాంట్రాక్ట్‌ ఉంది. కానీ, వ్యక్తిగత కారణాలతో 2018 జూన్‌లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రధాన కోచ్‌గా పదవి చేపట్టాడు. కానీ, పంజాబ్‌ను ప్లేఆఫ్స్‌ దాకా తీసుకెళ్లలేకపోయాడు. టీమిండియా కోచ్‌గా పనిచేయాలని ఉద్దేశంతో పంజాబ్‌తో కాంట్రాక్ట్‌ ఇంకా ఉన్నప్పటికీ ఈ నెల 8న రాజీనామా చేశాడు. పాకిస్థాన్‌ ప్రధాన కోచ్‌ పదవికి కూడా హెసన్‌ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.

‘సిమన్స్‌’కు ఛాన్స్‌ ఉందా‌..
వెస్టిండీస్‌కు చెందిన సిమన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 26 టెస్టులు, 143 వన్డేలాడాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ ఇతనికి మెరుగైన రికార్డే ఉంది. 2002లో క్రికెట్‌కు రిటైర్మెంట్‌ చెప్పాక ఈ మాజీ ఆల్‌రౌండర్‌ 2004లో జింబాబ్వే జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. తర్వాత ఐర్లాండ్‌ కోచ్‌గా సిమన్స్‌ సేవలందించాడు. ఇతని శిక్షణా సమయంలోనే 2007 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో ఆ జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. అదే టోర్నీలో సూపర్‌-8 దశలో బంగ్లాదేశ్‌కు కూడా షాకిచ్చి ఆకట్టుకుంది. ఎనిమిదేళ్ల పాటు ఐర్లాండ్‌ కోచ్‌గా సేవలందించింన సిమన్స్‌ ఆ తర్వాత వెస్టిండీస్‌ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. రెండోసారి విండీస్‌ టీ20 ప్రపంచకప్‌(2016) విజేతగా నిలిచినప్పుడు సిమన్స్‌నే కోచ్. 2017లో అఫ్గానిస్థాన్‌ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌నకు అఫ్గాన్‌ జట్టు అర్హత సాధించడంలో సిమన్స్‌ తోడ్పాటు ఎంతగానో ఉంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. వారితోనే అద్భుతాలు సృష్టిస్తూ మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.    

‘టీమిండియా’ లాల్‌చంద్‌‌.. 
2007 దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ధోనీ బృందానికి లాల్‌చంద్‌ రాజ్‌పుత్ మేనేజర్‌. కోచ్‌ పదవికి గడువు ముగియడానికి ముందు బీసీసీఐకి దరఖాస్తు పంపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున చాలా తక్కువ మ్యాచ్‌లాడిన లాల్‌చంద్‌ రంజీల్లో ముంబయికి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ కోచ్‌గా సేవలు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్‌ కోచ్‌గా 2016లో బాధ్యతలు చేపట్టాడు. అప్పుడే ఆ జట్టు టెస్టు హోదా దక్కించుకుంది. కానీ, మరుసటి ఏడాదే అఫ్గాన్‌ కోచ్‌గా ఫిల్‌ సిమన్స్‌ అతని స్థానాన్ని భర్తీ చేశాడు. తర్వాత లాల్‌చంద్‌ జింబాబ్వే కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల ఐసీసీ ఆ జట్టుపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో లాల్‌ టీమిండియాకు పనిచేయాలని కోరుకుంటున్నారు. ప్రధాన కోచ్‌గా కాకుంటే తనను బ్యాటింగ్‌ కోచ్‌ పదవికైనా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన బీసీసీఐని కోరినట్టు సమాచారం. ఆయన దేశవాళీ క్రికెట్‌లో అసోం జట్టుకు శిక్షణ ఇచ్చారు. కెనడా గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఓ ఫ్రాంచైజీకి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 

హమారా ‘రాబిన్‌’ సింగ్‌..
90ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన రాబిన్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 136 వన్డేలు, ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడాడు. కోచ్‌గా దాదాపు 15ఏళ్ల అపార అనుభవం ఉన్న రాబిన్‌ 2001లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత హాంకాంగ్‌ జాతీయ జట్టుకు కోచ్‌గా సేవలు అందించాడు. 2007-09లో భారత జాతీయ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. అండర్-19, భారత్‌-ఏ జట్లకు కూడా శిక్షణ ఇచ్చాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఇటీవల కోచ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించినప్పుడు రాబిన్‌ స్పందిస్తూ.. టీమిండియా కోచ్‌ స్థానంలో మార్పు రావాలని వ్యాఖ్యనించాడు. ప్రస్తుత కోచ్‌ నేతృత్వంలోని టీమిండియా కీలక మ్యాచ్‌ల్లో బోల్తా పడిందని విమర్శించాడు. మార్పు ద్వారా వచ్చే ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచే బాటలు పరచుకోవచ్చునని చెప్పుకొచ్చాడు. 

- ఇంటర్నెట్‌డెస్క్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు