close

తాజా వార్తలు

శోధిస్తారు.. సలహాలిస్తారు

విద్యార్థుల మేధోమథనానికి ప్రత్యేక తర్ఫీదు
భద్రతపై పోలీసులకు కార్యశాలలు
ఆలోచనల సముదాయంగా సీహెచ్‌ఎస్‌ఎస్‌
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగరంలో కాలుష్య సమస్య తీవ్రమవుతోంది. దీనిపై పరిశోధన చేయాలని ఓ గురుకుల పాఠశాల విద్యార్థికి ఆలోచన వచ్చింది. ఎవరిని సంప్రదించాలి? ఎలా పరిశోధన చేయాలి? అసలు కాలుష్య తీవ్రతను తెలిపే లెక్కలు ఎక్కడ లభిస్తాయి? ఇలా ఎన్నో అంశాలు ఆ విద్యార్థి ముందు నిలిచాయి. అతని ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది ఆ సంస్థ.

భారత్‌తో చైనా, పాకిస్థాన్‌, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక సంబంధాలు ఎలా ఉన్నాయి? వాటిని తెలుసుకుని మరింత లోతైన విశ్లేషణ చేసేదెలా?.. ఇదే ఆలోచన నగరంలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థినికి కలిగింది. సమాచార సేకరణ, నిపుణులను కలుసుకోవడం ఎలానో తెలియదు. ఆ లోటు తీర్చి విద్యార్థిని పరిశోధనకు చేయూతనిచ్చింది సీహెచ్‌ఎస్‌ఎస్‌.

మన మది ఆలోచనల పుట్ట. చుట్టూ ఉన్న అంశాలను లోతుగా విశ్లేషించి సమస్యలకు మూలాలు వెతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విశ్లేషణ ఫలాలను ప్రభుత్వానికి అందించి అవసరమైన సూచనలు చేస్తే బాగుంటుందన్న భావన కలుగుతుంటుంది. అందుకు ఆసరాగా నిలుస్తోంది సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీ స్టడీస్‌(సీహెచ్‌ఎస్‌ఎస్‌). జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. విద్యార్థులతోపాటు సమాజంలోని వివిధ వర్గాలకు పరిశోధన పరమైన శిక్షణలకు చేయూతగా ఈ సంస్థ నిలుస్తోంది. అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విశ్లేషణల సముదాయం పనిచేస్తోంది. 2013 మార్చి 21న కన్నెగంటి రమేష్‌బాబు ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

4 రకాల పనులు
సీహెచ్‌ఎస్‌ఎస్‌ తరఫున ప్రస్తుతం 4 రకాల పనులు చేస్తున్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు.. పరిశోధనలు చేయించడం.. శిక్షణ అందించడం.. కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు వంటివి ఇందులో కీలకం. విద్యార్థుల పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితాలను ప్రభుత్వానికి అందిస్తున్నారు. త్వరలో తెలంగాణ గురుకుల పాఠశాలలకు చెందిన 100 మంది డిగ్రీ విద్యార్థినులకు విదేశీ వ్యవహారాలు, ప్రపంచ రాజకీయాలపై తర్ఫీదు అందించేందుకు సిద్ధమవుతున్నారు. విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం తరఫున ఉపకార వేతనాలు అందించడంలోనూ ఈ సంస్థ కీలక భూమిక పోషిస్తోంది.

సంస్థ ఏర్పాటైందిలా..
తెనాలికి చెందిన కన్నెగంటి రమేష్‌బాబు నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో సహ ఆచార్యుడిగా పనిచేసేవారు. కేవలం ఆధ్యాపక వృత్తికే పరిమితం కాకుండా సీహెచ్‌ఎస్‌ఎస్‌ పేరిట ఆలోచనల సముదాయ వేదికను ఏర్పాటుచేయాలని భావించారు. తులసీ సీడ్స్‌ అధినేత రామచంద్రప్రభు ఇందుకు ఆర్థిక సాయం అందించారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పోలీసు విభాగాలకు చెందిన పలువురు అధికారులకు భద్రతపై శిక్షణ ఇచ్చారు. సంస్థ తరఫున ఆచార్యులు, విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు ఉండటంతో వివిధ అంశాలకు సంబంధించి శిక్షణలు లేదా ఇంటర్న్‌షిప్‌లు జరిగినప్పుడు వారు వచ్చి అవగాహన కల్పిస్తుంటారు. తద్వారా శిక్షణార్థులకు సమగ్ర అవగాహన పెరిగి సమర్థంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.


విద్యార్థుల ఆలోచనలకు వేదిక: రమేష్‌బాబు

అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల పరంగా శిక్షణ ఇవ్వడంతోపాటు విద్యార్థుల ఆలోచనలకు వేదికగా సీహెచ్‌ఎస్‌ఎస్‌ నిలుస్తోంది. వివిధ అంశాలపై విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు చేస్తుంటారు. దీనివల్ల సమాజంలోని అంశాలపై లోటుపాట్లు వారికి తెలుస్తాయి. దేశభద్రత, అంతర్గత వ్యవహారాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్తులో వారు వ్యవహరించాల్సిన తీరు తెలుస్తుంది. విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని శిక్షణ అందిస్తున్నాం.


ఏయే అంశాలపై శిక్షణ ఇచ్చారంటే

* మిషన్‌ 974 కింద ఏపీ పోలీసులతో తీర ప్రాంత గస్తీపై మేధో మథనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలందించారు.
* ఉగ్రవాద నిరోధం, హైదరాబాద్‌లో అప్రమత్తతపై  తెలంగాణలో 356 మంది స్పెషల్‌ బ్రాంచి పోలీసులకు శిక్షణ ఇచ్చారు.
* రాష్ట్రంలోని 274 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 470 మంది ఉపాధ్యాయులకు నమూనా ఐరాస నిర్వహణపై తర్ఫీదిచ్చారు. వీరు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఇదే అంశానికి సంబంధించి పోటీలు నిర్వహిస్తారు.
* తాజాగా 10 మంది గురుకుల విద్యార్థులు వివిధ అంశాలపై ఇంటర్న్‌షిప్‌లు చేశారు. సంస్థలతో ఒప్పందాలు ఉన్నందున వీరు ప్రత్యేకంగా రుసుము చెల్లించక్కర్లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు