close

తాజా వార్తలు

పరిచయస్థుడని అప్పగిస్తే.. అపహరించాడు

అయిదేళ్ల చిన్నారి అదృశ్యం
రాంగోపాల్‌పేట ఠాణాలో తల్లిదండ్రుల ఫిర్యాదు

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: గతంలో పరిచయమున్న వ్యక్తి కావడంతో నమ్మి చిన్నారిని అప్పగిస్తే.. అపహరించిన ఘటన రాంగోపాల్‌పేట ఠాణా పరిధిలో జరిగింది. తమ అయిదేళ్ల కూతురు అపహరణకు గురైందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ పోలీసులను ఆశ్రయించారు. బాదితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఎస్సై శ్రీనివాసులు వివరాల ప్రకారం యాప్రాల్‌ భాగ్యనగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి చిత్తు కాగితాలు సేకరిస్తూ జీవనం సాగించేవాడు. వివాహం అనంతరం ప్రస్తుతం బాలరాయిలోని ఓ ఫంక్షన్‌ హాలులో పనిచేస్తున్నాడు. వీరికి అయిదు, నాలుగు ఏళ్లు, మూడు నెలల చిన్నారులు ఉన్నారు. స్థానికంగా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే అయిదేళ్ల పాపకు జ్వరం రావడంతో సోమవారం  నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు. సికింద్రాబాద్‌ ప్యాట్నీ కూడలిలో బస్సు దిగారు.  నాంపల్లికి వెళ్లడానికి జేమ్స్‌ స్ట్రీట్‌ రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ ఎక్కాలనుకొని పార్క్‌లేన్‌ మీదుగా వెళ్తుండగా.. ఎంజీరోడ్డు గాంధీ విగ్రహం వద్ద గతంలో పరిచయమున్న రాజు(30) కనిపించి పలకరించాడు. యోగక్షేమాలు తెలుసుకునే క్రమంలో పాపను ఎత్తుకున్నాడు. బక్రీద్‌ కావడంతో నల్లగుట్ట మసీదు వద్దకు భిక్షాటనకు వెళ్తున్నానని వారితో నల్లగుట్ట మసీదు వరకు వెళ్లాడు. అక్కడ సూరత్‌ ఆంధ్ర ట్రాన్స్‌పోర్ట్‌ వద్దకు రాగానే పిల్లలకు పాల తీసుకువచ్చేందుకు అయిదేళ్ల పాపను రాజుకు అప్పగించి దంపతులు మిగతా చిన్నారులను తీసుకొని వెళ్లారు. తిరిగొచ్చేసరికి అక్కడ ఆ వ్యక్తి కనిపించలేదు. సమీప ప్రాంతాల్లో వెతికానా ఆచూకీ తెలియకపోవడంతో రాంగోపాల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు తెలుపు రంగు జీన్స్‌, గోధుమరంగు జర్కిన్‌ ధరించాడని, చిన్నారి  తెలుపు, నలుపు, నీలం రంగు ఫ్రాక్‌ ధరించిందని, మెడలో పూసల దండ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు