close

తాజా వార్తలు

‘గుర్తు’పట్టారు.. ‘ఆటో’కట్టించారు..!

నారాయణగూడ: ప్రయాణికురాలి సొత్తుతో ఉడాయించిన ఆటో డ్రైవర్‌ను నారాయణగూడలో పట్టుకున్నారు. డీఎస్సై శంకర్‌ కథనం ప్రకారం... హిమాయత్‌నగర్‌లో నివాసముండే జి.మాధవి ఈ నెల 8వ తేదీన లక్డీకాపుల్‌ మెట్రో నుంచి హిమాయత్‌నగర్‌కు ఆటో మాట్లాడుకున్నారు. తన చేతి సంచిని ఆటోలోనే వదిలేసి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత వెనక్కి వచ్చే చూసేసరికి ఆటో కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో 3.5 తులాల బంగారు గొలుసు, రూ. 42 వేల నగదు, ఫోన్‌తో ఉన్న బ్యాగ్‌ మరిచిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆటోపై ఉన్న పువ్వులు, నక్షత్రాలు వంటి గుర్తులతో ఆటోను గుర్తించి, నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నల్గొండ జిల్లా మాల్‌ ప్రాంతానికి చెందిన బి.బ్రహ్మయ్యగా గుర్తించారు. వారంలో నాలుగు రోజులు నగరానికి వచ్చి ఆటో అద్దెకు తీసుకొని నడుపుతాడు. నగరంలో ఉండే నాలుగు రోజులు ఆటోలోనే నివాసం ఉంటాడని డీఎస్సై శంకర్‌ వివరించారు. నిందితుడి నుంచి ఒక సెల్‌ఫోన్‌ మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, బంగారు గొలుసు, నగదు మాత్రం తాను తీయలేదని బ్రహ్మయ్య చెప్పాడని పోలీసులు తెలిపారు. నారాయణగూడ డీఐ ఎం.రవికుమార్‌ ఆధ్వర్యంలో డీఎస్సై శంకర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు