close

తాజా వార్తలు

మత నిరూపణ కంటే చావడం మేలు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

కోల్‌కతా: తన మతాన్ని నిరూపించుకోవాల్సి వస్తే ప్రాణాలు సైతం తీసుకోవడానికి వెనుకాడనని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మంగళవారం ఓ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె పేరు ప్రస్తావించకుండా భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దుర్గా మాతకు పూజలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆమె కాస్త భావోద్వేగంతో ప్రసంగించారు.

‘హిందూ ఆలయాల్లోకి ప్రవేశించేముందు నా మతాన్ని నిరూపించుకోవడం కంటే చచ్చిపోవడం మేలు. గుడిలోకి వెళ్లడానికి నా మతాన్ని నిరూపించుకోమని చెప్పే అధికారం ఎవరికీ లేదు. నన్ను విమర్శించే వారి కంటే ఎక్కువగానే సంస్కృతం గురించి చదువుకున్నాను. నా మతాన్ని నిందించే వారికంటే పెచ్చుగానే మత పద్ధతుల గురించి నేర్చుకున్నాను. నేను హిందూని. అయినా నాకు అన్ని మతాల పట్ల గౌరవం ఉంది. మతాల ప్రాతిపదికన ప్రజలను విభజించి పాలించడం వంటి ఆచారాలను నేను నమ్మను. మా ప్రభుత్వంలోనే దుర్గామాతకు ఎక్కువ పూజలు జరిగాయి. మాకు హితవు పలకడానికి ముందు.. మేం అధికారంలోకి వచ్చాక ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చామో తెలుసుకుంటే బాగుంటుంది. మతం అంటే మానవత్వం. మానవత్వం అంటే మతం. ప్రతి ఒక్కరి పట్ల ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండాలని మన మతాలు చెబుతున్నాయి. విభజించి పాలించమని ఏ మతంలోనూ చెప్పలేదు. ఏ మత గ్రంథంలోనూ రాయలేదు’ అంటూ కొంచెం భావోద్వేగంతో ప్రసంగించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు