close

తాజా వార్తలు

వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ : వనస్థలిపురంలో అప్పట్లో చోటుచేసుకున్న ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన రాంజీనగర్‌ ముఠాను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థ సిబ్బంది దృష్టి మరల్చి దుండగులు సుమారు రూ.70 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ చోరీకి పాల్పడింది రాంజీ ముఠానేనని పోలీసులు తేల్చారు. దాదాపు నాలుగు నెలల పాటు గాలింపు చేపట్టి ఎట్టకేలకు నేడు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దోపిడీకి ఉపయోగించిన వాహనంతో పాటు.. సుమారు 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

మే 7వ తేదీన వనస్థలిపురంలో డబ్బులు నింపేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన సెక్యురిటీ సిబ్బంది దృష్టి మరల్చి నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. వాహనంలో నుంచి డబ్బుల పెట్టెను ఎత్తుకెళ్లిన నిందితులు ఆటోలో దిల్‌సుఖ్‌నగర్ చేరుకొని అక్కడ సులభ్ కాంప్లెక్స్‌లో డబ్బులను పెట్టలో నుంచి సంచిలోకి మార్చుకుని పరారయ్యారు. దోపిడీకి పాల్పడిన ముఠా తమిళనాడుకు చెందిన రాంజీనగర్ వాసులుగా గుర్తించారు. గతంలోనూ భోపాల్ లోని ఓ ఏటీఎంలో చోరీలకు పాల్పడి 43లక్షలకు పైగా దోచుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

నిందితుల కోసం పోలీసులు సుమారు 4 నెలల పాటు గాలించారు. తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ గాలించారు. కానీ నిందితుల ఆచూకీ లభించలేదు. రాచకొండ పోలీసులు మాత్రం పట్టు విడవకుండా గాలించి నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు రాచకొండ సీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించనున్నారు.

 మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు