close

తాజా వార్తలు

పాక్‌ మంత్రికి బుద్ధి చెప్పిన హర్‌సిమ్రత్‌ కౌర్‌!

చండీగఢ్‌: ఎన్నిమార్లు చెప్పినా, చేసే పనులకు అంతర్జాతీయంగా మద్దతు కొరవడినా.. పాకిస్థాన్‌ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. పదే పదే భారత్‌పై విషం వెళ్లగక్కుతూనే ఉంది. అక్కడి మంత్రులు నోరు పారేసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆ దేశ మంత్రి ఫవాద్‌ చౌదరి భారత పంజాబ్‌ సైనికులపై చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్ తిప్పికొట్టారు. మాకు మీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ బుద్ధి చెప్పారు. మంగళవారం ఫవాద్‌ ట్విటర్‌ వేదికగా.. కశ్మీర్‌లో విధులు నిర్వర్తించడానికి భారత్‌లోని పంజాబ్‌ సైనికులు నిరాకరించాలని అనుచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన హర్‌సిమ్రత్‌ కౌర్‌..‘‘కశ్మీర్‌లో పంజాబ్‌ సైనికులు విధులు నిర్వర్తించొద్దంటూ పాక్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలు వారి అసహనం, కుయుక్తులకు నిదర్శనం. దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడని పంజాబ్‌ సైనికులు గొప్ప దేశభక్తులు. ఫవాద్‌ చౌదరి.. మీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు’’ అని ట్విటర్‌ వేదికగా దీటుగా సమాధానం ఇచ్చారు. 

ఫవాద్‌ వ్యాఖ్యల పట్ల హర్‌సిమ్రత్‌ కౌర్‌తో పాటు భారత్‌లోని ప్రముఖ నాయకులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ స్పందిస్తూ.. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపేయాలని తేల్చి చెప్పారు. అయినా పాక్‌ మంత్రికి జ్ఞానోదయం కాలేదు. తిరిగి అర్థంపర్థం లేని ట్వీట్లు చేసే ప్రయత్నం చేయగా.. నెటిజన్లు గట్టిగా బదులిచ్చి నోరు మూయించే ప్రయత్నం చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు