close

తాజా వార్తలు

గగనయోధుడు.. అభినందన్‌

శత్రువులను తరిమికొట్టి దేశం మీసం మెలేసిన ధీరత్వం.. శత్రు  సైనికుల చెరలో ఉన్నా చెరగని స్థైర్యం.. ప్రత్యర్థుల దాడితో రక్తం ధారలు కారుతున్నా సడలని ధైర్యం.. చావు కళ్లముందు కన్పిస్తున్నా తలవంచని గుండె నిబ్బరం.. దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం.. 

ఆయనే మన గగనవీరుడు అభినందన్‌ వర్ధమాన్‌. ఆయన ధైర్య పరాక్రమానికి యావత్‌ భారతావని బ్రహ్మరథం పట్టింది. ఆయన సాహసానికి కేంద్ర ప్రభుత్వం వీర్‌చక్రతో సత్కరిస్తోంది.

అది ఫిబ్రవరి 27, 2019.. అంతకుముందు రోజు పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై భారత్‌ మిరాజ్‌లు బాంబులతో విరుచుకుపడ్డాయి. దీనికి ప్రతికారం తీర్చుకునేందుకు పాక్‌ తమ యుద్ధవిమానాలతో భారత్‌పై దాడికి యత్నించింది. అయితే దాయాది దేశం దుస్సాహసాన్ని భారత్‌ బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాక్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాయి. అదే సమయంలో మన దేశానికి చెందిన మిగ్‌-21 విమానాన్ని పాక్‌ నేలకూల్చింది. ఆ విమాన పైలటే వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌. విమానం కూలిపోయినప్పటికీ సురక్షితంగా దాని నుంచి బయటపడిన అభినందన్‌.. దురదృష్టవశాత్తు నియంత్రణరేఖ అవతల శత్రుదేశ భూభాగంలో పడ్డారు. అలా ఆయన పాక్‌ జవాన్ల చేతికి చిక్కారు.

శత్రువుల చెరలో నిబ్బరంగా.. నిర్భయంగా

విమానం నుంచి దిగిన అభినందన్‌ నేరుగా నియంత్రణరేఖకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరన్‌ అనే గ్రామంలో పడ్డారు. అది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంది. అతడిని చూడగానే స్థానికులు చుట్టుముట్టారు. అభినందన్‌ పారాచూట్‌పై భారతీయ జెండా ఉండటాన్ని గుర్తించారు. ‘నేను భారత్‌లోనే ఉన్నానా’ అని అభినందన్‌ వారిని అడగగా.. స్థానికులు పాక్‌ అనుకూల నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి తెలుసుకున్న అభినందన్‌ అక్కడి నుంచి పరిగెత్తారు. దాదాపు 500 మీటర్లు పరిగెత్తి ఓ చెరువు దగ్గరకు చేరుకున్నారు. తనతో పాటు ఉన్న పత్రాలను మింగే ప్రయత్నం చేశారు. కొన్నింటిని చెరువులో పడేశారు. అయితే గ్రామస్థులు వెంటబడి ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. అనంతరం పాక్‌ జవాన్లు ఆయన్ను అధీనంలోకి తీసుకున్నారు. 

సైన్యానికి చిక్కిన అభినందన్‌ను పాక్‌ జవాన్లు తీవ్రంగా హింసించారు. మాటలతో వేధించారు. ఇంటరాగేషన్‌ పేరుతో భారత రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అభినందన్‌ మానసిక ధైర్యం మాత్రం చెక్కు చెదరలేదు. ఎన్నిరకాలుగా ప్రశ్నించినా పేరు, ఐడీనంబరు, హోదా వివరాలు తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అంతకు మించిన వివరాలు చెప్పే హక్కు తనకు లేదని స్పష్టంగా చెప్పారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 గంటలు అభినందన్‌ శత్రువుల చెరలో ఉండాల్సి వచ్చింది. 

రెండు రోజుల తర్వాత స్వదేశంలోకి.. 

అభినందన్‌ను విడుదల చేయాలంటూ భారత్‌ గట్టిగా డిమాండ్‌ చేసింది. భారత ఒత్తిడికి పాక్‌ దిగిరాక తప్పలేదు. మార్చి 1, 2019న రాత్రి 9.10గంటలకు అభినందన్‌ను పాక్‌ బలగాలు వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చాయి. ఖాకీ ప్యాంటు, ముదురు రంగు జాకెట్‌తో పౌర దుస్తుల్లో ఇరుదేశాలను వేరు చేస్తున్న గేట్ల వద్దకు గంభీర వదనంతో నడిచి వచ్చారు. ‘‘నా మాతృభూమికి తిరిగి రావడం మహదానందకరం’’ అని సొంతగడ్డపై అడుగుపెట్టిన తర్వాత అభినందన్‌ ఆనందం వ్యక్తం చేశారు. 

ఆ మీసం ఎంతో ప్రత్యేకం..

అభినందన్‌ను పాక్‌ సైనికులు పట్టుకున్నారని తెలియగానే ఆయన ఫొటోలు మీడియాలో వైరల్‌ అయ్యాయి. మెలి తిరిగిన మీసంతో అభినందన్‌ ధైర్యానికి ప్రతీకగా కన్పించారు. తర్వాతి కాలంలో ఆ మీసం దేశవ్యాప్తంగా ట్రెండీగా మారింది. ‘అభినందన్‌ కట్‌’ పేరుతో ఆ స్టైల్‌ ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా మంది అభినందన్‌లా మీసం స్టైల్‌ను అనుకరించారు. 

తండ్రి కూడా ఎయిర్‌ఫోర్స్‌లోనే..

అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా సెయ్యూరు. చెన్నైలోని సైనిక పాఠశాలలో చదువుకున్నారు. ఆయన తండ్రి సింహకుట్టి వర్ధమాన్‌ ఎయిర్‌మార్షల్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. తల్లి మల్లిక వైద్యురాలు. 2004 జూన్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా భారత వైమానిక దళంలో చేరారు. మిగ్‌ కంటే ముందు సు-30 ఎంకేఐ యుద్ధవిమానాన్ని నడిపారు. రిటైర్డ్‌ స్క్వాడ్రన్‌ అధికారి తన్వీ మార్వాను ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు