close

తాజా వార్తలు

రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుక

హైదరాబాద్: ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహించారు. ‘బాహుబలి’వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, చిత్ర బృదం అభిమానులకు ఓ శుభవార్త వినిపించిది. ‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుకను ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రామోజీఫిల్మ్‌ సిటీ ప్రాంగణంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభించింది.

‘సాహో’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాని కారణంగా విడుదల తేదీని 30కి వాయిదా వేశారు. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. తనీష్‌ బాగ్చి, జిబ్రాన్‌(నేపథ్య) సంగీతం అందించారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు