close

తాజా వార్తలు

భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. గతంలో భారత్‌ను పన్నుల రారాజుగా అభిర్ణించిన ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. భారత్‌, చైనా ఇక ఏమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కావని.. అవి అభివృద్ధి చెందిన దేశాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల పేరిట ఉభయ దేశాలు లబ్ధి పొందుతున్నాయని అభిప్రాయపడ్డారు. పెన్సిల్వేనియాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ..‘‘ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్‌, చైనా ఏమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కావు. ఇక నుంచి వారు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) నుంచి అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల పేరిట అనేక మినహాయింపులు పొందుతూ.. అమెరికాకు నష్టం కలిగిస్తున్నారు. అనేక ఏళ్లుగా ఇరు దేశాలు లబ్ధి పొందుతూనే ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలోనే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 

ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొన్ని దీర్ఘకాలిక మినహాయింపులు వర్తిస్తాయి. ఆయా దేశాల్లో ఉత్పత్తి అయ్యే వస్తువులకు సంబంధించిన దిగుమతి, ఎగుమతి సుంకాల్లో మినహాయింపు లభిస్తుంది. వ్యాపార సంబంధిత ఒప్పందాల ప్రక్రియల్లోనూ నిబంధనలను సులభతరం చేస్తారు. వాణిజ్యపరమైన వివాదాల ప్రక్రియను త్వరితగతిన పరిష్కరించేందుకు అంతర్జాతీయ సంస్థలు సహకారం అందిస్తాయి. అనేక రంగాల్లో గణనీయ స్ధిరవృద్ధి కనబరుస్తున్న భారత్‌కు డబ్ల్యూటీవో గత కొన్నేళ్లుగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదా కట్టబెడుతోంది. దీన్ని సమర్థంగా వినియోగించుకుంటున్న భారత్‌ పేదరికం లాంటి సామాజిక సమస్యల్ని రూపుమాపడంలో గణనీయమైన మార్పు సాధించింది. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది.

కానీ, రక్షణాత్మక ధోరణి అవలంబిస్తున్న ట్రంప్‌ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల పేరిట లబ్ధిపొందుతున్న బలమైన ఆర్థిక వ్యవస్థలపై గురి పెట్టారు. అందులో భాగంగా గత జూన్‌లో డబ్ల్యూటీవోపై అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆ హోదా ఏ ప్రాతిపదికన కట్టబెడతారో వివరించాలని కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు