close

తాజా వార్తలు

రెవెన్యూ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు సంతృప్తికర స్థాయిలో మంజూరు చేసేలా ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలన్నారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షలమంది ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన భూమి ద్వారా దాదాపు 9 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వొచ్చని.. మరో 2 లక్షల మందికి ఇవ్వడానికి భూమి అందుబాటులో ఉందని సీఎంకు వివరించారు. దాదాపు 15.75 లక్షలమందికి ఇంకా భూమిని సమకూర్చాల్సి ఉందని సీఎంకు అధికారులు నివేదించారు.

వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైనవారిని గుర్తించేలా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. మరోవైపు భూముల సమగ్ర సర్వేని త్వరగా పూర్తిచేయాలని జగన్‌ ఆదేశించారు. దీనికోసం అత్యాధునిక పరికరాలు వాడాలని.. భూముల రీసర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదన్నారు. భూముల సమగ్ర సర్వేకి తాము సిద్ధమని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రణాళికను సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు