close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. కశ్మీర్‌లో మార్పులతో అక్కడి ప్రజలకే లబ్ధి

ఇటీవల జమ్ముకశ్మీర్‌లో జరిగిన పలు మార్పులు వల్ల అక్కడి ప్రజలు లబ్ధి పొందుతారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. మహిళల సాధికారత కోసమే కొన్ని చట్టాలను సవరించామని చెప్పారు. 73వ స్వాతంత్ర్య దినోత్సం జరుపుకొంటున్న ఈ వేళ మనముందున్న లక్ష్యం దేశాభివృద్ధి అని, అందుకోసం సమష్టిగా పనిచేయాలని ప్రజలకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు

తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్‌పై ట్విటర్‌ వేదికగా పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీపీఏలపై పునఃసమీక్ష మంచిది కాదని కేంద్ర ఇంధన శాఖ చెప్పిందని చంద్రబాబు గుర్తు చేశారు. అలాచేస్తే ఏపీకి పెట్టుబడులు దూరమవుతాయని ఇంధన శాఖ కార్యదర్శి, కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి చెప్పినా సీఎం జగన్‌ వినలేదని విమర్శించారు. జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులో ఉంటే.. మిగతా సగం జగన్‌ చేసే పనుల్లో ఉందని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అందువల్లే వైకాపాకు అధికారం: పవన్‌

మూడేళ్ల నుంచి పోరాటం చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవాళ్లమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు పంచడం వైకాపాకే సాధ్యమైందని, అందుకే ఆ పార్టీ అధికారంలో ఉందన్నారు. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వానికి మనపై కక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ‘అశోక చక్రం’ ఎమోజీని విడుదల చేసిన ట్విటర్‌

భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ట్విటర్‌లో భారత అశోక చక్రం ఎమోజీని అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ ప్రకటించింది. #indiaindependencedayఅని పేర్కొంటూ అశోక చక్రం ఎమోజీని ట్విటర్‌ బుధవారం విడుదల చేసింది. ఈ ఎమోజీ ఆగస్టు 18 వరకు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. బాలాకోట్‌ ఆపరేషన్‌ పైలట్లకు పతకాలు

భారత వైమానిక దళానికి చెందిన ఐదుగురు పైలట్లు వాయుసేన పురస్కారాలకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని జైషే  మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై అత్యంత సాహసోపేతంగా  బాంబులు జారవిడిచినందుకు ప్రభుత్వం వారిని వాయుసేన పతకాలతో సత్కరించనుంది. యుద్దభూమిలో ప్రణాళిక ప్రకారం విధులను సక్రమంగా పూర్తిచేసిన వారిని ఈ వాయుసేన పతకాలతో సత్కరిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. గతంలో భారత్‌ను పన్నుల రారాజుగా అభిర్ణించిన ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. భారత్‌, చైనా ఇక ఏమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కావని.. అవి అభివృద్ధి చెందిన దేశాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల పేరిట ఉభయ దేశాలు లబ్ధి పొందుతున్నాయని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. వాళ్లు కృష్ణార్జునులైతే..పాండవులు ఎవరు?

సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో ప్రధాని మోదీ- కేంద్ర మంత్రి అమిత్‌ షా కృష్ణార్జునుల్లా వ్యవహరించారని రజనీ కాంత్‌ ప్రశంసించిన విషయం తెలిసిందే. దీనిపై ఒవైసీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా కృష్ణార్జునులంటూ రజనీకాంత్‌ ప్రశంసించారు.. అయితే ఇక్కడ పాండవులు, కౌరవులు ఎవరు? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. గేల్‌ సరసన భువి

కరీబియన్‌ దీవుల్లో బంతిని రెండువైపులా స్వింగ్‌ చేస్తూ విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్న టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్‌ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో వన్డేలో భువి 31 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌తో సమానంగా నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. హెచ్‌టీసీ ఈజ్‌ బ్యాక్‌.. కొత్తఫోన్‌తో మార్కెట్లోకి!

హెచ్‌టీసీ.. ఒకప్పుడు అగ్రగామి స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీల్లో  ఒకటి. అలాంటిది కొన్ని నెలలుగా కనుమరుగైపోయింది. దాదాపు ఏడాది తర్వాత భారత మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో అడుగుపెట్టింది. ఈ కంపెనీ బ్రాండ్‌ లైసెన్స్‌ పొందిన ‘ఇన్‌వన్‌ స్మార్ట్‌ టెక్నాలజీ’.. హెచ్‌టీసీ వైల్డ్‌ ఫైర్‌ X పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అడ్వాణీకి అనారోగ్యం

భాజపా అగ్రనేత ఎల్‌ కే అడ్వాణీకి అనారోగ్యంతో ఉన్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఐదు రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్నారని వెల్లడించింది. ఈ కారణం వల్ల ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా అడ్వాణీ ఇంటి వద్ద జెండా వందనం కార్యక్రమం జరగబోదని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు