close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పరిశోధనతో పతాకస్థాయికి...

సంస్థ పేరు ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ). దాని 85 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఆమే జీవశాస్త్రవేత్త డాక్టర్‌ చంద్రిమా షా. త్వరలో ఆమె ఆ సంస్థ బాధ్యతలు చేపట్టనున్నారు. డాక్టర్‌ చంద్రిమ దిల్లీ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ అదే విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు. ఐఎన్‌ఎస్‌ఏ ఉపాధ్యక్షురాలిగానూ ఉన్నారు. పరిశోధనలోకి ప్రవేశించకముందు క్రికెటర్‌గా, ఆల్‌ ఇండియా రేడియోలో క్రికెట్‌ కామెంటేటర్‌గా పని చేశారు. క్రికెట్‌ ఆడటం వల్ల తనకు టీం వర్క్‌ విలువ తెలిసిందని అంటారామె.  కోల్‌కతా విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌లో పట్టా పుచ్చుకున్నారు. ఆ తరువాత  ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీలో పరిశోధన చేపట్టారు.  కాన్సాస్‌ మెడికల్‌ సెంటర్‌ విశ్వవిద్యాలయం నుంచి రెండేళ్లు పరిశోధన చేశారు. మరో రెండేళ్లు న్యూయార్క్‌లోనూ పనిచేశారు. 1984లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీలో పరిశోధకురాలిగా చేరారు.
* సమస్యలు ఉన్నా...
కణాలు హరించిపోవడం, తగ్గిపోవడంలో సంకేతాలు అందించే మార్గాలపై ప్రస్తుతం ఆమె పరిశోధన సాగుతోంది. క్యాన్సర్‌ కణాలు, లీష్‌మానియా వంటి పరాన్నజీవులు చంద్రిమ పరిశోధనలో ప్రధాన అంశాలు. ‘నేను కొత్తగా విధుల్లో చేరినప్పుడు చుట్టూ ఉండే మగవారు నా నిర్ణయాలను తిరస్కరించేవారు. పలకరించేవారు కాదు. ఈ సమస్యలు నన్ను ఆపలేకపోయాయి. కేవలం చేసే పనిపైనే దృష్టి పెట్టేదాన్ని. ఆ కష్టమే  నాకు ఇప్పుడు గుర్తింపు తెచ్చింది. ఈ అరుదైన అవకాశం అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది..’ అని చెబుతారు చంద్రిమా షా.


మరిన్ని