close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆర్థిక పాఠాలు... కాలేజీ నుంచే!

కౌమార దశ నుంచే ఆర్థిక పాఠాలను ఒంటబట్టించుకుంటే ఉద్యోగం చేసే సమయానికి మీకంటూ ఓ స్పష్టత వస్తుంది. అందుకు ఇప్పటి నుంచి మీరేం చేయాలంటే...
సమయమే పెట్టుబడి... మీరు ఈ వయసులో ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బును అప్పటికప్పుడు జమచేయలేరు. కొంత కాలంపాటు క్రమంతప్పకుండా పొదుపు చేస్తేనే అది సాధ్యమవ్వొచ్చు. కొన్నేళ్లపాటు పోస్టాఫీసు రికరింగ్‌ డిపాజిట్‌, బ్యాంకు ఖాతా, సిప్‌... ఇలా రకరకాల పద్ధతుల్లో ఆదా చేయడం అలవాటు చేసుకోండి. మీకు చదువు కాకుండా ఇంకేదైనా విద్య వచ్చి ఉంటే... ఖాళీ సమయంలో  ఉద్యోగంచేసి ఎంతోకొంత సంపాదించుకోవచ్చు.
అలవాటుగా... కౌమారం నుంచే పొదుపుపై అవగాహన పెంచుకోవాలి.  మీరు ఇప్పుడు ఆదా చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో మీకు ఆర్థిక భరోసాను కలిగిస్తుంది. మీకు కానుకలు, బహుమతి, చెక్కులు... ఇలా ఏ రూపంలో డబ్బు అందుకున్నా దాన్ని వృథాగా ఖర్చు చేసే ప్రయత్నం వద్దు.
అప్రమత్తత అవసరం... మీ ఖాతాలో ఎల్లప్పుడు కొంత మొత్తం ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైనా అందులోంచి తీసినా... దాన్ని భర్తీ చేయడం అవసరం. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని రెండు రకాలుగా పొదుపు చేయండి. ఒకటి కరెంట్‌ ఖాతా, మరొకటి కొన్ని సంవత్సరాలపాటు కదపకుండా ఉండేలా చూసుకోండి. నగదు కాకుండా వీలైన చోట్ల డెబిట్‌ కార్డును ఉపయోగించండి.  దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో అనేదానిపై మీకు స్పష్టత వస్తుంది.
అవగాహన తప్పనిసరి... డబ్బును ఎలా పొదుపు చేయాలో ఎక్కడా నేర్పించరు. పొదుపు గురించి పాటించాల్సిన నియమాలు, చిట్కాలు... ఇలా సమస్త సమాచారాన్ని మీరు అంతర్జాలం ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని రకాల యాప్‌లు, పుస్తకాలనూ పరిశీలించవచ్చు. అవసరం అనుకుంటే... ఓ సారి నిపుణులను సంప్రదించండి.
పెద్దవాళ్ల సలహాతో... ఇంట్లో అమ్మానాన్నతోనూ మాట్లాడండి. ఇంటి అవసరాల కోసం వారెలా ఖర్చు చేస్తున్నారో అడగండి. ప్రత్యక్షంగా చూడండి. చిన్నప్పటి నుంచే ఆర్థిక పాఠాలను తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటే పెద్దయ్యాక చాలా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఒకవేళ ఏవైనా సమస్యలు వచ్చినా... ఎలా తట్టుకోవాలనే స్పష్టత మీకు వస్తుంది.


మరిన్ని