close

బిజినెస్‌

మార్కెట్‌ కుదేల్‌

ప్రపంచ మార్కెట్ల సెగ
624 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

అంతర్జాతీయ ప్రతికూలతలతో మళ్లీ బేర్‌ నిద్రలేచింది. అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, హాంకాంగ్‌ ఆందోళనలు, అర్జెంటీనా కరెన్సీ పతనం వంటి పరిణామాలతో ప్రపంచ మార్కెట్లు వణికాయి. మన మార్కెట్‌కూ ఈ సెగ తాకింది. దేశీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంపై మదుపర్ల కలవరం అమ్మకాల రూపంలో ప్రతిబింబించింది. నిఫ్టీ మళ్లీ 11,000 పాయింట్ల దిగువకు చేరగా.. రూ.2.21 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 10 శాతం పెరిగినప్పటికీ.. మిగతా షేర్లు మార్కెట్‌ పతనాన్ని శాసించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 62 పైసలు తగ్గి 71.40 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 37,755.16 పాయింట్ల వద్ద సానుకూలంగానే ప్రారంభమైంది. ఇంట్రాడేలో సూచీకదే గరిష్ఠ స్థాయి. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. మళ్లీ ఏదశలోనూ కోలుకోలేకపోయింది. ఒకానొకదశలో 36,888.49 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయిన సెన్సెక్స్‌.. చివరకు 623.75 పాయింట్ల నష్టంతో 36,958.16 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 183.80 పాయింట్లు కోల్పోయి 10,925.85 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 10,901.60- 11,145.90 పాయింట్ల మధ్య కదలాడింది.

* 19 ఏళ్లలోనే అత్యధిక విక్రయాల క్షీణత నమోదైనట్లు సియామ్‌ గణాంకాలు స్పష్టం చేయడంతో వాహన షేర్లు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో మదర్‌సన్‌ సుమీ 8.94%, భారత్‌ ఫోర్జ్‌ 6.13%, ఎం అండ్‌ ఎం 6.11%, బాష్‌ 5.43%, ఐషర్‌ మోటార్స్‌ 5.31%, టీవీఎస్‌ 5.07%, మారుతీ 4.72%, అశోక్‌ లేలాండ్‌ 4.35%, అపోలో టైర్స్‌ 2.80%, హీరో మోటోకార్ప్‌ 2.14%, బజాజ్‌ ఆటో 1.51% చొప్పున నష్టాలు నమోదు చేశాయి.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 28 నష్టాలు చవిచూశాయి. యెస్‌ బ్యాంక్‌ 10.35%, బజాజ్‌ ఫైనాన్స్‌ 5.72%, భారతీ ఎయిర్‌టెల్‌ 5.28%, హెచ్‌డీఎఫ్‌సీ 5.07%, టాటా స్టీల్‌ 3.85% చొప్పున డీలాపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 9.72%, సన్‌ఫార్మా 3.71% మేర రాణించాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు