close

బిజినెస్‌

రూ.140 కోట్లతో సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ విస్తరణ

మూడేళ్లలో రుణ రహితం
ఏటా 15- 20 శాతం వృద్ధి లక్ష్యం
దేశీయ రిటైల్‌ విపణిలోకి కాఫీ ఉత్పత్తులు
ప్రచారకర్తగా నిత్యా మేనన్‌
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీ సంస్థ సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ మరో దఫా విస్తరణ చేపట్టింది. దీని కోసం దాదాపు రూ.140 కోట్లు (20 మిలియన్‌ డాలర్లు) వెచ్చించనుంది. ఇందులో రూ.56 కోట్లు ఖర్చు చేసి వియత్నాం యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తారు. మిగిలిన రూ.84 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్‌) యూనిట్లో ప్యాకేజింగ్‌ ప్లాంటు ఏర్పాటుకు వెచ్చిస్తారు. ఈ విస్తరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని, ఈ నిధులను అంతర్గత వనరుల నుంచి సమీకరిస్తున్నట్లు సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ ఛైర్మన్‌ చల్లా రాజేంద్రప్రసాద్‌, ఎండీ చల్లా శ్రీశాంత్‌ ఇక్కడ వెల్లడించారు. దాదాపు రూ.350 కోట్లతో నిర్మించిన చిత్తూరు ఎస్‌ఈజడ్‌ యూనిట్‌ ఇటీవలే ఉత్పత్తి దశలోకి వచ్చింది. వచ్చే ఏడాది నాటికి ఇది 75 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుందని అంచనా. ప్రస్తుతం సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌కు 35,000 టన్నుల వార్షిక ఇన్‌స్టెంట్‌ కాఫీ పొడి తయారీ సామర్థ్యం ఉంది. తాజా విస్తరణ కూడా పూర్తయితే ఉత్పత్తి సామర్థ్యం 50,000 టన్నులకు చేరువవుతుంది.

ఈ కంపెనీకి గుంటూరు జిల్లా దుగ్గిరాల, వియత్నాం, స్విట్జర్లాండ్‌లలో ఉన్న యూనిట్లపై ఎటువంటి అప్పు లేదు. చిత్తూరు జిల్లా యూనిట్‌ కోసం రూ.225 కోట్ల అప్పు తీసుకున్నారు. తక్కువ వడ్డీరేటుకే అయినా దీన్ని మూడేళ్లలో తీర్చివేసి, పూర్తి రుణరహిత కంపెనీగా మారతామని చల్లా రాజేంద్రప్రసాద్‌ వివరించారు. ఇటీవల కాలంలో దేశీయ కాఫీ రిటైలింగ్‌ మార్కెట్లోకి  కాంటినెంటల్‌ స్పెషల్‌, మాల్గుడి, దిస్‌.. తదితర బ్రాండ్ల పేరుతో ఇన్‌స్టెంట్‌ కాఫీ, ఫిల్టర్‌ కాఫీ, ప్రీ-మిక్స్‌ కాఫీని సంస్థ విక్రయిస్తోంది. మనదేశంలో ఇన్‌స్టెంట్‌ కాఫీ మార్కెట్‌ పరిమాణం రూ.2,000 కోట్లు కాగా, ఫిల్టర్‌ కాఫీ మార్కెట్‌ మరో రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. ఇన్‌స్టెంట్‌ కాఫీ విక్రయాలు  ఏటా 8- 10 శాతం పెరుగుతున్నాయి. మొత్తం కాఫీ విక్రయాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 60 శాతం వరకు ఉంది. ఫిల్టర్‌ కాఫీ అయితే 95 శాతం అమ్మకాలు దక్షిణాదిలోనే నమోదవుతున్నాయి. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణా, కర్నాటక రాష్ట్రాల్లో 6 బ్రాండ్లతో తమ కాఫీ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎండీ శ్రీశాంత్‌ పేర్కొన్నారు. దాదాపు 50 వేల మంది రిటైలర్లు, ఇ-కామర్స్‌ పోర్టళ్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నట్లు వివరించారు. మొత్తం విక్రయాల్లో దేశీయ రిటైల్‌ అమ్మకాల వాటా 7 శాతం ఉందని, రెండు మూడేళ్లలో 15 శాతానికి పెరిగే అవకాశం ఉందని యాజమాన్యం వెల్లడించింది. మొత్తం ఆదాయం ఏటా 15- 20 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలోనూ తాము అమ్మకాలు పెంచుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దేశీయంగా కాఫీ రిటైలింగ్‌ మార్కెట్లో విస్తరించాలనే ఉద్దేశంతో దక్షిణాది నటి నిత్యా మేనన్‌ను ప్రచారకర్తగా ఎంపిక చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు