close

బిజినెస్‌

తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

జులైలో 3.15 శాతానికి పరిమితం

దిల్లీ: వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గత నెలలో స్వల్పంగా తగ్గింది. ఆహార పదార్థాలు ప్రియం అయినప్పటికీ.. ఇంధనం, విద్యుత్‌ ధరలు దిగిరావడం ఇందుకు దోహదపడింది. ఈ ఏడాది జూన్‌లో ఇది 3.18 శాతం ఉండగా.. జులైలో 3.15 శాతానికి తగ్గింది. 2018 జులైలో ఈ సూచీ 4.17 శాతం వద్ద ఉంది. కీలక రేట్లపై నిర్ణయం తీసుకునే ముందు రిటైల్‌ ద్రవ్యోల్బణం రేట్లను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుందనే విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపు కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పుడు జులైలో నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత లక్ష్యమైన 4 శాతం లోపే ఉండటం గమనార్హం. అయితే ఆహార పదార్థాల ధరల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిన అవరం ఉందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాల్లో వరదలు, కూరగాయల ధరలు పెరగడం, ఖరీఫ్‌ సాగు ఆలస్యం కావడం లాంటి వాటివి ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయొచ్చచని ఆమె పేర్కొన్నారు. కేంద్ర గణక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
* జులైలో ఆహార పదార్థాల ధరల్లో 2.36%పెరుగుదల ఉంది. అంతకుముందు నెలలో వీటి ద్రవ్యోల్బణ రేటు 2.25 శాతంగా నమోదైంది.
* కూరగాయలు 2.82 శాతం చౌక అవ్వగా.. పప్పులు 6.82 శాతం మేర ప్రియమయ్యాయి. జూన్‌లో కూరగాయలు, పప్పుల ద్రవ్యోల్బణం రేట్లు వరుసగా 4.66%, 5.68 శాతంగా నమోదయ్యాయి.
* పండ్ల ద్రవ్యోల్బణం రేటు కూడా -4.18% నుంచి -0.86 శాతానికి చేరింది.
* ఇంధనం, విద్యుత్‌ విభాగం ప్రతిద్రవ్యోల్బణాన్ని (-)0.36 శాతం నమోదుచేసింది. జూన్‌లో ఈ విభాగ ద్రవ్యోల్బణ రేటు 2.32 శాతంగా ఉంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు