close

బిజినెస్‌

3 నెలల్లో 15,000 ఉద్యోగాలు పోయాయ్‌

19 ఏళ్ల కనిష్ఠానికి వాహన అమ్మకాలు
సత్వరం ఆదుకోవాలి: సియామ్‌

దిల్లీ: దేశంలో వాహన విక్రయాలు 19 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. 2018 జులైతో పోలిస్తే, ఈ ఏడాది జులైలో అమ్మకాలు 18.71 శాతం క్షీణించాయని వాహన తయారీదారుల సంఘం సియామ్‌ వెల్లడించింది. 2000 సంవత్సరం డిసెంబరులో విక్రయాలు 21.81 శాతం క్షీణించాక, మళ్లీ భారీగా తగ్గడం ఇప్పుడేనని పేర్కొంది. ఫలితంగా గత 2-3 నెలల్లో ఏకంగా 15,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. వీరంతా తాత్కాలిక, సాధారణ ఉద్యోగులని, అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే వాహన విడిభాగాల విభాగంలో మరో 10 లక్షల ఉద్యోగాలు ప్రశ్నార్థకమవుతాయని పేర్కొంది. ‘విక్రయాలు క్షీణంచినందున, 300 విక్రయశాలల్ని మూసివేసే దిశగా అడుగులు పడుతున్నాయని, ఇందువల్ల మరో 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంద’ని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథూర్‌ వెల్లడించారు. విక్రయాలు పెంచుకోడానికి పరిశ్రమ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని, ప్రభుత్వం కూడా పునరుద్ధరణ పథకం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
* ద్విచక్ర, ప్రయాణికుల వాహనాలన్నీ కలిపి ఈ ఏడాది జులైలో 18,25,148 అమ్ముడయ్యాయి. 2018 జులైలో 22,45,223 వాహనాలు విక్రయమయ్యాయి.
* ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు కూడా 19 ఏళ్ల కనిష్ఠాన్ని నమోదు చేశాయి. గత నెలలో 30.98 శాతం క్షీణించి 2,00,790 వాహనాలకు పరిమితమయ్యాయి. 2000 డిసెంబరులో 35.22 శాతం క్షీణత తర్వాత మళ్లీ ఇప్పుడే అలాంటి పరిస్థితి ఎదురైంది.
* ప్రయాణికుల కార్ల విక్రయాలు కూడా 35.95 శాతం క్షీణించి గత నెలలో 1,22,956గా నమోదయ్యాయి. 2018 జులైలో ఇవి 1,91,979గా ఉన్నాయి. 2000 డిసెంబరులో ఈ విభాగంలో 39.86 క్షీణత నమోదైంది.
* ద్విచక్ర వాహన విక్రయాలు 16.82 శాతం తగ్గి, 15,11,692కు పరిమితమయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు 25.71 శాతం క్షీణించి 56,866కు పరిమితమయ్యాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు