close

బిజినెస్‌

వాహ్‌.. ఆర్‌ఐఎల్‌!

మార్కెట్‌ పతనంలోనూ 10% దూసుకెళ్లిన షేరు
ఒక్క రోజులోనే రూ.72,000 కోట్లు పెరిగిన మార్కెట్‌ విలువ
పదేళ్లలో అత్యధిక ఒక రోజు లాభమిదే

మంగళవారం సెన్సెక్స్‌ 624 పాయింట్లు కుప్పకూలింది.
దాదాపు అన్ని పెద్ద షేర్లకు నష్టాలు తప్పలేదు.
అయితే.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు మాత్రం ఇందుకు మినహాయింపు.
10 శాతం దూసుకెళ్లిన షేర్లు.. మదుపర్లకు లాభాల తీపిని పంచాయి.
ఏడాదిన్నరలో రుణరహిత సంస్థగా మారుస్తామని సంస్థ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించడమే ఇందుకు నేపథ్యం.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లు పాత జోరును అందిపుచ్చుకుని మంగళవారం దూసుకెళ్లాయి. ఇటీవల మార్కెట్‌ బలహీనతలతో గరిష్ఠాల నుంచి వెనక్కి వచ్చిన షేరు.. మళ్లీ జోరు పెంచింది. నిన్న ఇంట్రాడేలో 12.09% పెరిగిన షేరు, రూ.1302.50 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 9.72% లాభంతో రూ.1275 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.71,637.78 కోట్లు పెరిగి రూ.8,08,233.78 కోట్లకు చేరింది. గత పదేళ్లలోనే షేరుకు ఇది అత్యధిక ఒకరోజు లాభం. 2009 మే 18న ఆర్‌ఐఎల్‌ షేరు ఇంట్రాడేలో ఏకంగా 24% పరుగులు తీసింది.

పరుగుకు కారాణాలివే..
సంస్థ 42వ వార్షిక సాధారణ సమావేశం మదుపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.  18 నెలల్లో రుణరహిత సంస్థగా మారతామని, భవిష్యత్‌లో అధిక డివిడెండ్లు ఇస్తామన్న ముకేశ్‌ హామీలు ఇందుకు ప్రధాన కారణం. సెప్టెంబరు 5 నుంచే ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ఆరంభం కానుండటం, వార్షిక చందాదార్లకు ఉచితంగా టీవీలు, ఏఆర్‌, వీఆర్‌ వంటి వినూత్న సాంకేతికతల్లోకి అడుగుపెడుతుండటం మదుపర్లలో మరింత విశ్వాసాన్ని నింపింది. చమురు, రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను, పెట్రోల్‌ బంకుల విభాగంలో 49 శాతం వాటాల విక్రయం ద్వారా రూ.1.15 లక్షల కోట్ల వరకు సమీకరించగలమనే ప్రకటనలు షేరు కళకళలాడటానికి దోహదపడ్డాయి.

షేరుపై బ్రోకరేజీ సంస్థల అంచనాలు ఇలా
ఆర్‌ఐఎల్‌ ఏజీఎం తర్వాత దాదాపు ఏడు బ్రోకరేజీ సంస్థలు షేరు రేటింగ్‌ను పెంచాయి. క్రెడిట్‌ సూయిజ్‌, బెర్న్‌స్టీన్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌ సహా 8 బ్రోకరేజీ సంస్థలు షేరు లక్షిత ధరను 1-27% మేర పెంచాయి. ‘రిలయన్స్‌ షేరు రూ.1300 దాటి ముందుకెళ్లొచ్చు. స్వల్పకాలంలో షేరు కొత్త గరిష్ఠాలను పరీక్షించొచ్చు. వచ్చే 12 నెలల్లో రూ.2000 స్థాయిని అధిగమించొచ్చు’ అని క్యాపిటల్‌ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రొమేశ్‌ తివారీ పేర్కొన్నారు. ‘రుణ తగ్గింపు అవకాశాలతో షేరును ‘కొనుగోలు’ చేయొచ్చని సిఫారసు చేస్తున్నాం. మా లక్షిత ధరను రూ.1400గా కొనసాగిస్తున్నామ’ని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడించింది. అరామ్‌కోకు వాటా విక్రయం వల్ల ఆర్‌ఐఎల్‌ ఇంధన వ్యాపారం దాదాపుగా రుణరహితం అవుతుందని, అయితే ఏకీకృత ఆదాయాలు, నిర్వహణ నగదు తగ్గుతాయని మోర్గాన్‌ స్టాన్లీ అభిప్రాయపడింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు