close

క్రీడలు

2022 కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌ 

షూటింగ్‌కు చోటుకు ససేమిరా

మెల్‌బోర్న్‌: కొంత కాలంగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌ భాగం కానుంది. మహిళల టీ20 ఈవెంట్‌ను బర్మింగ్‌హామ్‌లో జరిగే క్రీడల్లో ప్రవేశ పెట్టనున్నట్లు కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీడబ్ల్యూఎఫ్‌) అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 1998 కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల జట్లు క్రికెట్లో తలపడ్డాయి. దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. దానికి ముందు, తర్వాత ఈ క్రీడల్లో క్రికెట్‌ లేదు. 2022 జులై 27-ఆగస్టు 7 మధ్య జరగబోతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో ఎనిమిది జట్లు క్రికెట్లో తలపడబోతున్నాయి. ‘‘ఇది చరిత్రాత్మక దినం. కామన్వెల్త్‌ క్రీడల్లోకి మళ్లీ క్రికెట్‌ను ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తున్నాం’’ అని సమాఖ్య అధ్యక్షుడు లూయిస్‌ మార్టిన్‌ తెలిపాడు. ‘‘ఈ బిడ్‌ కోసం ఉమ్మడిగా మద్దతునిచ్చిన ప్రపంచ క్రికెట్‌ కుటుంబానికి ఇది చరిత్రాత్మకమైన సందర్భం’’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సావ్నీ పేర్కొన్నాడు.

షూటింగ్‌.. కుదరదంటే కుదరదు: షూటింగ్‌ను కామన్వెల్త్‌ క్రీడల్లో కొనసాగించే ప్రసక్తే లేదని సీడబ్ల్యూఎఫ్‌ స్పష్టం చేసింది. 1974 నుంచి ప్రతిసారీ కామన్వెల్త్‌ క్రీడల్లో ఉంటున్న షూటింగ్‌ను 2022 ఈవెంట్‌ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని భారత్‌ సహా పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా సీడబ్ల్యూఎఫ్‌ నిర్ణయం మారలేదు. క్రికెట్‌ను 2022 క్రీడల్లో చేరుస్తున్నట్లు ప్రకటించిన సీడబ్ల్యూఎఫ్‌ అధ్యక్షుడు మార్టిన్‌.. షూటింగ్‌కు ఇక ఎప్పుడూ కామన్వెల్త్‌ క్రీడల్లో చోటు ఉండదని తేల్చి చెప్పాడు. ‘‘క్రీడల్లో ఉండే హక్కును ఆ ఆటే సంపాదించుకోవాలి. షూటింగ్‌ ఎప్పుడూ తప్పక ఉండాల్సిన క్రీడగా లేదు. అది ఐచ్ఛికం. అందుకే దీనిపై సమీక్ష జరిపి షూటింగ్‌ను క్రీడల నుంచి తప్పించాం. ఇకపై దానికి చోటు ఉండదు’’ అని మార్టిన్‌ అన్నాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు