close

క్రీడలు

ప్రపంచ ఛాంప్‌ భారత్‌ 

ఫైనల్లో ఇంగ్లాండ్‌పై విజయం 
వికలాంగుల వరల్డ్‌ టీ20 సిరీస్‌ కైవసం

ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు గెలవలేకపోయిందని తీవ్రంగా నిరాశ చెందాం. కానీ ఆ టోర్నీ ముగిసిన నెల రోజుల్లోపే అదే గడ్డపై భారత్‌ మెగా టోర్నీలో విజేతగా నిలిచింది. అయితే ఇది వికలాంగుల కోసం టీ20 ఫార్మాట్లో వరల్డ్‌ సిరీస్‌ పేరుతో నిర్వహించిన ప్రపంచ సమరం. ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌నే ఓడించి భారత్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది.

వర్సెస్టర్‌

వికలాంగుల టీ20 వరల్డ్‌ సిరీస్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రవీంద్ర (34 బంతుల్లో 53) మెరుపు ఇన్నింగ్స్‌తో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్‌ కునాల్‌  (35 బంతుల్లో 36)తో పాటు సుగణేశ్‌   (11 బంతుల్లో 33), కెప్టెన్‌ విక్రాంత్‌ (27 బంతుల్లో 29) కూడా రాణించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఓబ్రైన్‌ (2/35) రాణించాడు. అనంతరం భారత బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులే చేయగలిగింది. ఓపెనర్‌ బ్రౌన్‌ (32 బంతుల్లో 44) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. తర్వాతి బ్యాట్స్‌మెన్‌లో గుడ్‌విన్‌ (17), కాలమ్‌ (27),  విల్‌ ఫ్లిన్‌ (21 నాటౌట్‌) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. సన్ని గోయత్‌ (2/23), కునాల్‌ (2/15) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ఇంగ్లాండ్‌ ఆశలపై నీల్లు చల్లారు. అంతకుముందు సెమీఫైనల్లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించడం విశేషం.  ఆ మ్యాచ్‌లో పాక్‌ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కశ్మీర్‌ ఆటగాడు వసీమ్‌ ఖాన్‌ పాక్‌పై 69 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌.. అఫ్గానిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. టోర్నీలో ఇంకా బంగ్లాదేశ్‌, జింబాబ్వే కూడా పాల్గొన్నాయి.

సంక్షిప్త స్కోర్లు 
భారత్‌: 20 ఓవర్లలో 180/7 (కునాల్‌ 36, రవీంద్ర 53, మహేంద్రన్‌ 33, విక్రాంత్‌ 29; ఓబ్రైన్‌ 2/35) 
ఇంగ్లాండ్‌: 20 ఓవర్లలో 144/9 (బ్రౌన్‌ 44, గుడ్‌విన్‌ 17, కాలమ్‌ 27,  విల్‌ ఫ్లిన్‌ 21 నాటౌట్‌; సన్ని గోయత్‌ 2/23, కునాల్‌ 2/15)

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు