close

క్రీడలు

సిరీస్‌పై భారత్‌ గురి 

వెస్టిండీస్‌తో మూడో వన్డే నేడు 
రాత్రి 7 గంటల నుంచి సోనీ టెన్‌-1లో

జోరుమీదున్న టీమ్‌ఇండియా మరో సమరానికి సన్నద్దమైంది. ఆఖరి వన్డేలో నేడు వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని కోహ్లీసేన భావిస్తుంటే.. ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆతిథ్య జట్టు ఆరాటపడుతోంది. పెద్దగా ఫామ్‌లో లేని భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు.

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌

రెట్టించిన ఉత్సాహంతో టెస్టు సిరీస్‌కు సిద్ధం కావాలనుకుంటున్న భారత జట్టు బుధవారం జరిగే చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్‌తో తలపడుతుంది. సొంతగడ్డపై పేలవంగా ఆడుతున్న కరీబియన్‌ జట్టుకు కోహ్లీసేనను నిలువరించడం సవాలే. 

దృష్టంతా అతడిపైనే..

సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత్‌ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ వరుసగా విఫలమవుతున్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మాత్రం ఒత్తిడిలో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేశాక ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. టీ20 సిరీస్‌లో వరుసగా 1, 23, 3 పరుగులు చేసిన ధావన్‌.. రెండో వన్డేలో 2 పరుగులకే ఔటయ్యాడు. లోపలికి వస్తున్న బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతున్న అతడు ఎలా పుంజుకుంటాడన్నది ఆసక్తికరం. టెస్టు జట్టులో లేని అతడికి కరీబియన్‌ పర్యటనలో ఇదే ఆఖరి మ్యాచ్‌. మరోవైపు నాలుగో స్థానం కోసం ఆసక్తికర పోరు నడుస్తోంది. ఆ స్థానం కోసం రిషబ్‌ పంత్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ గట్టిగా పోటీపడుతున్నాడు. పంత్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్‌ నుంచి, ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నుంచి గట్టి మద్దతు ఉంది. కానీ అతడు విఫలమవుతుండడం, రెండో వన్డేలో శ్రేయస్‌ (68 బంతుల్లో 71) రాణించడంతో పరిస్థితి మారిపోయింది. పంత్‌కు సంయమనం లేకపోవడం, అనేకసార్లు వికెట్‌ను పారేసుకోవడం ఆందోళన కలిగించే విషయాలు. ఆ స్థానంలో కాస్త నియంత్రణతో ఆడే ఆటగాడు ఉండాలని ఏ జట్టయినా కోరుకుంటుంది. రెండో వన్డేలో చక్కని ఇన్నింగ్స్‌ ఆడిన శ్రేయస్‌ నాలుగో స్థానానికి గట్టిగా పోటీలో నిలిచాడు. దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ కూడా నాలుగో స్థానంలో అతణ్ని ఆడించాలని సూచించాడు. పంత్‌ ఐదో స్థానానికి సరిపోతాడని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆఖరి వన్డే లైనప్‌ ఎలా ఉంటున్నది ఆసక్తికరం. గత మ్యాచ్‌లో సెంచరీ బాదిన కోహ్లి జోరు మీదుండడం భారత్‌కు గొప్ప సానుకూలాంశం. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన అతడు.. అదే జోరును కొనసాగిస్తే విండీస్‌కు ఇబ్బందులు తప్పవు. ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. 

గేల్‌కు ఆఖరిదా!

టీ20 సిరీస్‌ను కోల్పోయిన వెస్టిండీస్‌.. కనీసం వన్డే సిరీస్‌సైనా కాపాడుకోవాలనుకుంటోంది. చివరి మ్యాచ్‌లో నెగ్గి, సిరీస్‌ సమం చేయాలంటే ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. షై హోప్‌, షిమ్రాన్‌ హెట్‌మయర్‌, నికోలస్‌ పూరన్‌ వంటి బ్యాట్స్‌మెన్‌ సత్తా మేర ఆడాలని ఆతిథ్య జట్టు కోరుకుంటోంది. వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్‌    అవుతానని ప్రకటించిన గేల్‌కు బహుశా ఇదే చివరి మ్యాచ్‌ కావొచ్చు. వన్డే సిరీస్‌ ముగిశాక రెండు జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో  తలపడతాయి. తొలి టెస్టు ఈ నెల 22న   అంటిగ్వాలో ఆరంభమవుతుంది.

వాన రావొచ్చు...

వాతావరణం బాగా ఉక్కపోతగా ఉండొచ్చు. జల్లులతో మ్యాచ్‌కు అంతరాయాలు కలగొచ్చు. ఇక్కడ పూర్తయిన గత ఆరు వన్డేల్లో ఐదుసార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. కానీ వర్షం వచ్చే అవకాశమున్నందున్న టాస్‌ గెలిచిన కెప్టెన్‌ బౌలింగే ఎంచుకోవచ్చు.

4

వంద మైలురాయి చేరుకోవడానికి కుల్‌దీప్‌కు కావాల్సిన వికెట్లు. ఇప్పటివరకు అతడు 53 వన్డేల్లో 96 వికెట్లు పడగొట్టాడు. షమి రికార్డు (55 వన్డేల్లో)ను బద్దలు కొట్టి వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్ల మైలురాయిని అందుకున్న భారత బౌలర్‌గా నిలిచే అవకాశం కుల్‌దీప్‌కు ఉంది.


 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు