close

గ్రేటర్‌ హైదరాబాద్‌

నేర పరిశోధనకు అత్యుత్తమ పురస్కారం

ఇద్దరు ఏసీపీలకు కేంద్ర హోంశాఖ పతకాలు

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌- దమ్మపేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్లలో విధులు నిర్వహిస్తున్న సహాయ పోలీస్‌ కమిషనర్లు ఎస్‌.మోహన్‌కుమార్‌, ఏవీఆర్‌ నరసింహారావులకు కేంద్ర హోంశాఖ అందించే ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌-2019’ పతకాలు దక్కాయి. నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభను చూపే వారికి ఇచ్చే ఈ పురస్కారం ఈ సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం నుంచి వీరిద్దరికే లభించడం గమనార్హం.

1995 బ్యాచ్‌ ఎస్సైగా ప్రస్థానం ప్రారంభించిన ఎస్‌.మోహన్‌కుమార్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సహా8య కమిషనర్‌ (ప్రత్యేక విభాగం)గా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌గా నాలుగేళ్ల క్రితం ఆయన విధులు నిర్వహించారు. ఆ సమయంలో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసులో అయిదుగురు నిందితులకు శిక్ష పడేలా న్యాయస్థానానికి సాక్ష్యాధారాలు సమర్పించారు. మూడేళ్ల క్రితం ఓ అత్యాచారం కేసులో శాస్త్రీయ ఆధారాలు, బలమైన సాక్ష్యాలను సమర్పించడంతో న్యాయస్థానం నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇప్పటివరకు మోహన్‌కుమార్‌ 512 అవార్డులు, 284 నగదు బహుమతులు అందుకున్నారు. ఆయన స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెం.సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అల్వాల్‌ ఠాణా పరిధిలో నివసిస్తున్న ఓ బాలికపై ఈ ఏడాది మార్చిలో హత్యాచారం చేసిన నిందితుడిని 24 గంటల్లో ఏసీపీ ఏవీఆర్‌ నరసింహారావు అరెస్ట్‌ చేశారు. ఘటనా స్థలంలో లభించిన చిన్న ఆధారం సాయంతో విచారణ కొనసాగించి సిబ్బందిని అప్రమత్తం చేసి నిందితుడిని పట్టుకున్నారు. కేసును వేగంగా పరిష్కరించడంతో నరసింహారావుకు ఈ పతకం లభించిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు