close

గ్రేటర్‌ హైదరాబాద్‌

యూరియా కష్టాలు 

అధిక వర్షాలతో పెరిగిన వినియోగం 
కొరత లేకున్నా ధర పెంచి అమ్ముతున్న వ్యాపారులు 
బస్తా ధర రూ.266.. వసూలు చేసేది రూ.320పైనే 
విదేశీ యూరియా రాకలో జాప్యం

ఈనాడు, హైదరాబాద్‌: అధిక వర్షాలతో యూరియా వినియోగం గణనీయంగా పెరిగింది. ఇదే అదనుగా ధర పెంచి వ్యాపారులు రైతులను దోచేస్తున్నారు. మార్కెట్‌లో విక్రయించే 45 కిలోల యూరియా బస్తా గరిష్ఠ చిల్లర అమ్మకం ధర(ఎమ్మార్పీ) రూ.266.50. పలు ప్రాంతాల్లో రశీదుపై రూ.266 రాసి రైతుల నుంచి రూ.320కి పైనే తీసుకుంటున్నారు. ఎక్కువ మంది రైతులు అప్పు పేరుతో ఎరువులు కొంటున్నందున ఎంత ధర చెప్పినా తీసుకోక తప్పడం లేదు. ఈ నెలారంభం నుంచి అధిక వర్షాల కారణంగా పైర్లు ఏపుగా పెరగాలని  రైతులు యూరియాను అధికంగా చల్లుతున్నారు. ఈ నెలలో రాష్ట్రానికి మొత్తం 4.96 లక్షల టన్నుల ఎరువులను పంపుతామని కేంద్రం ప్రకటించింది. ఇందులో యూరియానే 2.21 లక్షల టన్నులుంది. ఇందులో లక్షా 40 వేల టన్నులు విదేశాల నుంచే వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. సగం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో దేశీయ పరిశ్రమల్లో తయారయ్యే దాంట్లో 81 వేల టన్నులు కేటాయించినందున దానిని ఈ నెల 15లోగా తెప్పించాలని అన్ని కంపెనీలను వ్యవసాయశాఖ నెలారంభంలోనే ఆదేశించింది. అదీ వేగంగా రావడం లేదు. ఒక ప్రధాన కంపెనీ ఈ నెలలో 40 వేల టన్నులు ఇస్తామని తెలిపింది. ఇప్పటివరకూ గ్రామాలకు కేవలం 8 వేల టన్నులు పంపినట్లు తెలుస్తోంది.

మార్క్‌ఫెడ్‌ వద్ద ఉంది... 
వర్షాలు అధికంగా పడితే యూరియా డిమాండుకు రెక్కలొచ్చి కొరత ఏర్పడుతుందని వ్యవసాయశాఖ నెల క్రితమే జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(మార్క్‌ఫెడ్‌) వద్ద 2 లక్షల టన్నులు నిల్వ చేయాలని ఆదేశించింది.

దీనిని డిమాండు పెరిగినప్పుడు అత్యవసర కోటా కింద రైతులకు విక్రయించాలి. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో లక్షా 13 వేల టన్నులు ఉంది. ఈ నెలలో వర్షాల వల్ల విక్రయాలు బాగా పెరిగాయని, ఇప్పటికే 80 వేల టన్నులు విక్రయించినట్లు సమాఖ్య వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్‌) ద్వారా మార్క్‌ఫెడ్‌.. ఎరువులు విక్రయిస్తోంది. బయటి మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు ఎమ్మార్పీకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని, ఏ జిల్లాకు ఎంత అవసరమైతే అంత వెంటనే పంపాలని మార్క్‌ఫెడ్‌కు, ఎరువుల కంపెనీలకు ఆదేశాలిచ్చినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ‘ఈనాడు’కు చెప్పారు. ఎరువుల అమ్మకాలు, ఎమ్మార్పీ వసూలుపై నిరంతర తనిఖీ చేయాలని కలెక్టర్లకు సైతం ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.
 

సన్న... చిన్న అంటూ స్వాహా మంత్రం 
యూరియా చిన్న గుళికల రూపంలో ఉంటుంది. విదేశాల నుంచి వచ్చేదాన్ని దేశీయ తయారీ యూరియాతో పోల్చి చూస్తే గుళికలు కొంచెం లావుగా ఉంటాయి. సన్నగా, చిన్నగా ఉండే దేశీయ యూరియాను రైతులు ఎక్కువగా అడుగుతున్నందున కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిజానికి యూరియా నీటిలో వేయగానే కరిగిపోతుంది. సన్నగా ఉండే యూరియాను చల్లేటప్పుడు గాలిలో తేమ వల్ల సైతం కొంత ఆవిరవుతోంది. దీనివల్ల ప్రయోజనం లేకపోగా కొద్దిమేర నష్టమే ఉన్నా అదే మంచిదనే అపోహ ఎక్కువగా ఉందని ప్రధాన ఎరువుల కంపెనీ అధికారి ఒకరు వివరించారు. ధర ఎక్కువగా వసూలు చేయడానికి ఇది కూడా ఓ కారణమని తమ పరిశీలనలో తేలిందని ఆయన చెప్పారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు