close

గ్రేటర్‌ హైదరాబాద్‌

పోలవరం టెండర్ల రద్దుతో నష్టమే 

దానివల్ల పనుల్లోనూ జాప్యం తప్పదు 
వ్యయం పెరిగితే కేంద్రం భరించబోదు 
నైపుణ్యం, డిజైన్ల పరంగా సమన్వయానికి పూచీ ఎవరు? 
పీపీఏ ఆందోళన 
నవయుగ పనితీరు బాగుంది: ఛైర్మన్‌ జైన్‌

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: పోలవరం ప్రాజెక్టు టెండర్‌ని రద్దు చేసి మళ్లీ పిలవడం (రీ టెండరింగ్‌) వల్ల నష్టమే తప్ప, లాభమేమీ ఉండబోదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పేర్కొంది. రీ టెండరింగ్‌కు వెళ్లడం వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు, ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిర్మాణ గడువు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. వేరే సంస్థకు పనులు అప్పగిస్తే... సాంకేతిక నైపుణ్యం, డిజైన్ల పరంగా సమన్వయం ఎలా సాధ్యపడుతుందని, దానికి ఎవరు పూచీ వహిస్తారని ఏపీ జలవనరుల శాఖ అధికారులను ప్రశ్నించింది. వ్యయం పెరిగితే... ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించబోదని కుండబద్దలు కొట్టింది. రీ టెండరింగ్‌ నిర్ణయం వల్ల ఒనగూరే లాభనష్టాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే... పోలవరం రీటెండరింగ్‌పై ఒక నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ సూచించింది. పోలవరం హెడ్‌వర్క్స్‌ పనులు చేస్తున్న నవయుగ సంస్థను ముందుగానే తప్పిస్తూ (ప్రీక్లోజర్‌) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న నేపధ్యంలో పీపీఏ అత్యవసర సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ప్రీక్లోజర్‌ నిర్ణయం వల్ల ప్రాజెక్టుపై పడే ప్రభావాన్ని చర్చించడానికే ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పీపీఏ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌, కేంద్ర జలవనరులు, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు చెందిన సంయుక్త కార్యదర్శులు, పోలవరం ప్రాజెక్టు మానిటరింగ్‌ కమిటీ ఛైర్మన్‌, సభ్య కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందుగానే నిర్మాణ సంస్థ నవయుగ- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రీకోజర్‌ నోటీసుకు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీనిపైనా పీపీఏ సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీపీఏ సమావేశం అనంతరం అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. పీపీఏ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ విలేకరులతోనూ మాట్లాడారు.

ప్రయోజనాలు ఆలస్యమవుతాయి 
పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్‌ వల్ల పనుల్లో జాప్యం జరుగుతుందని, ఫలితంగా ప్రాజెక్టు వల్ల ఒనగూరే ప్రయోజనాలూ ఆలస్యమవుతాయని పీపీఏ పేర్కొంది. వ్యయం పెరిగితే తాము బాధ్యత వహించబోమని స్పష్టంచేసింది. వ్యయం ఎంత పెరుగుతుందన్నది టెండర్‌కు వచ్చే స్పందనను బట్టి అంచనా వేయగలమని పేర్కొంది. తుది నిర్ణయం తీసుకొనే ముందు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సలహా ఇచ్చినట్లు తెలిపింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... నవంబరు ఒకటి కల్లా పనులను తిరిగి ప్రారంభిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వాదనతో పీపీఏ అధికారులు అంగీకరించలేదని తెలిసింది. మొదట్లో మధుకాన్‌ కంపెనీ పోలవరం పనులు చేస్తున్నప్పుడు, వాటిని రద్దు చేసి ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇవ్వడానికి నాలుగేళ్లు పట్టిన విషయాన్ని పీపీఏ అధికారులు గుర్తుచేసినట్టు సమాచారం. ఇప్పుడు మళ్లీ ప్రీక్లోజర్‌ వల్ల పనుల్లో జాప్యం జరగదన్న గ్యారంటీ ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది.

ఎవరు బాధ్యత వహిస్తారు? 
ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి నవయుగకు పనులు మార్చినప్పుడు... మూడు నెలల సమయం వృథా అయిందని, ఇప్పుడు మరో 3 నెలలు వృథా అయితే ఒక సీజన్‌ పోతుందని పీపీఏ పేర్కొంది. జాప్యం వల్ల పడే ఆర్థిక భారానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించింది. ‘మళ్లీ టెండర్లు పిలిస్తే... ఎవరూ ముందుకు రాకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? గతంలో ట్రాన్స్‌ట్రాయ్‌ ఐబీఎం కంటే 14 శాతం తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు రీ టెండరింగ్‌కి వెళ్తే, అంతకంటే తక్కువకు పనులు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారన్న నమ్మకం ఉందా? కొత్త సంస్థకు పనులు అప్పగిస్తే యంత్రాలను సమకూర్చుకొనేందుకు సమయం పడుతుంది కదా?’ అని పీపీఏ అధికారులు ప్రశ్నించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే రీ టెండరింగ్‌కు వెళ్తున్నామని చెప్పగా... దాని లాభనష్టాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని పీపీఏ స్పష్టం చేసినట్టు సమాచారం.

ఖర్చు పెరుగుతుంది: ఆర్‌.కె.జైన్‌ 
‘రీటెండరింగ్‌ వల్ల ప్రాజెక్టు వ్యయం ఎంత పెరుగుతుందో ఇప్పుడే అంచనా వేయలేం. కొంత వ్యయం పెరుగుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలం’ అని ఛైర్మన్‌ జైన్‌ విలేకరులకు తెలిపారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు