close

తెలంగాణ

కొత్త ఆలోచనల సాక్షాత్కారం 

రేపు నూతన ఆవిష్కరణల పండుగ 
33 జిల్లాల్లో ప్రదర్శనలు

ఈనాడు, హైదరాబాద్‌: మండోజి నర్సింహాచారి కాలిన ట్యూబ్‌లైట్‌ను పునర్వినియోగంలోకి తెచ్చారు... చింతకింది మల్లేశం ఆసు యంత్రాన్ని కనిపెట్టారు... ఇలాంటి నూతన ఆవిష్కరణలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. సాధారణ విద్యతోనూ చక్కటి ఆవిష్కరణలు చేయగలరని నిరూపించడానికి పూనుకుంది. అలాంటి వాటిని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శించాలని నిర్ణయించింది. దీనికి ఇంటింటా ఇన్నోవేటర్‌ అని నామకరణం చేసింది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 33 జిల్లా కేంద్రాల్లో నూతన ఆవిష్కరణలతో ప్రదర్శనలను నిర్వహించనుంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం. మాజీ మంత్రి కేటీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహికుల నుంచి మొత్తం 500 దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాల, మేడ్చల్‌-మల్కాజిగిరి, ఖమ్మం, నిర్మల్‌, పెద్దపల్లి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఉత్తమమైన 220 ఆవిష్కరణలతో జాబితా రూపొందించారు.

ప్రభుత్వం విధానంగా తీసుకుంది: జయేశ్‌ రంజన్‌ 
నూతన ఆవిష్కరణలకు పెద్దఎత్తున ప్రభుత్వపరంగా ప్రోత్సాహాన్ని అందిస్తామని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. మంగళవారం  ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘ప్రభుత్వం దీనిని విధానంగా తీసుకుంది. రాష్ట్ర నూతన ఆవిష్కరణల విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఐటీ రంగంలో అంకురాలు.. నూతన ఆవిష్కరణల ఫలితమే. గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యుల్లోనూ మేధావులు ఉన్నారని నిరూపించడానికి నిర్వహించబోయే ప్రదర్శనలు ఉపయోగపడతాయి. ఆయా జిల్లాల్లోని పౌరులంతా నూతన ఆవిష్కరణల ప్రదర్శనను తిలకించవచ్చు. ఆవిష్కర్తలను ప్రత్యక్షంగా కలుసుకోవచ్చు. ప్రదర్శనల అనంతరం జిల్లాల పరిపాలనా విభాగాలు ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి స్వయంగా భాధ్యత తీసుకుంటాయి’ అని జయేశ్‌ రంజన్‌ తెలిపారు. ఆవిష్కర్తలు రోజువారీ సమస్యలను గుర్తించి, ఆవిష్కరణల్లో స్థిరమైన పరిష్కార మార్గాలను కనుగొన్నారని ముఖ్య ఆవిష్కరణల అధికారి ఫణీంద్ర  తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు