close

తెలంగాణ

పులిచింతల విద్యుత్‌కు వరద దెబ్బ 

అధిక వరదతో ఉత్పత్తి నిలిపివేత 
120కి 12 మెగావాట్లే ఉత్పత్తి

ఈనాడు, హైదరాబాద్‌: వజినేపల్లి (మేళ్లచెరువు), న్యూస్‌టుడే: అధిక వరద వల్ల పులిచింతల ఆనకట్ట వద్ద విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్కేంద్రానికి సమానస్థాయిలో అధిక వరద వస్తున్నందున ఉత్పత్తి సాధ్యం కావడంలేదు. జూరాల వద్ద సైతం వరద కారణంగా విద్యుదుత్పత్తి నిలిపివేశారు. పులిచింతల ఆనకట్ట వద్ద మొత్తం 120, జూరాల వద్ద 480 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. వరద ఎక్కువగా వచ్చినప్పుడు నీటి ఎత్తు ఎక్కువగా ఉండి ఈ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి వీలుకాదు. తక్కువ వరద వచ్చినప్పుడు విద్యుదుత్పత్తి చేసేలా ఈ కేంద్రాలను నిర్మించడమే ఇందుకు కారణం. మరోవైపు జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సూర్యాపేట జిల్లాలోని పులిచింతల విద్యుత్కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఇక్కడ కేవలం 12 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసి నిలిపివేశారు. వరద తగ్గితే మళ్లీ ఏ క్షణమైనా ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్నందున 1500 మెగావాట్లకుపైగా కరెంటు వస్తోంది. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రభాకర్‌రావు తెలిపారు. పులిచింతలలో విద్యుదుత్పత్తి ప్రారంభం దగ్గర్నుంచి ఇప్పటివరకు దాదాపు 18 మిలియన్‌ యూనిట్లు గ్రిడ్‌కు అందించామన్నారు. అన్ని ప్రాజెక్టుల పరిధిలో అవకాశాన్ని బట్టి విద్యుదుత్పత్తి చేయనున్నట్లు చెప్పారు.

అదనంగా ఇవ్వలేదు.. 
ప్రస్తుత నెల విద్యుత్‌ రాయితీల కోటా కింద రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రూ.415.35కోట్లను విడుదల చేస్తూ ఇంధనశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతీ నెలా ఈ మొత్తాన్ని ఇవ్వడం ఆనవాయితీ. ఈనెల నుంచి ముందుగా బ్యాంకులో సొమ్ము డిపాజిట్‌ చేసి ‘లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌’(ఎల్‌సీ) తీసుకుని ఇచ్చాకే కరెంటు కొనుగోలు చేయాలని దేశంలోని అన్ని డిస్కంలను కేంద్రం ఆదేశించింది. ఎల్‌సీ తీసుకోవడానికి రాయితీ నిధులకు అదనంగా మరో రూ.200కోట్లను కలిపి ఇవ్వాలని డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాయి. కానీ గతనెల మాదిరిగానే రూ.415కోట్లనే విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులివ్వడం గమనార్హం. ఎల్‌సీ కోసం ప్రస్తుతం అంతర్గత నిధుల నుంచి ట్రాన్స్‌కో ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు విడుదలవుతాయని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం జల విద్యుదుత్పత్తి అధికంగా ఉన్నందున ఎల్‌సీ గురించి ఒత్తిడి లేదు. కరెంటు డిమాండ్‌ పెరుగుతున్నందున అదనంగా కొనుగోలు చేయాలంటే ఎల్‌సీకి నిధులు అవసరమని డిస్కంల వర్గాలు తెలిపాయి.

పెరుగుతున్న వినియోగం 
రెండు రోజులుగా వర్షాలు తగ్గిపోవడంతో కరెంటు వినియోగం బాగా పెరుగుతోంది. ఈనెల 4న 7104 మెగావాట్ల వినియోగముంటే 12న ఏకంగా 9,348 మెగావాట్లకు చేరింది. 2 వేల మెగావాట్లకు మించి డిమాండ్‌ పెరగడం ఈ వర్షాకాలంలో ఇదే తొలిసారి. జల విద్యుదుత్పత్తి అధికంగా ఉన్నందున కరెంటు సరఫరాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఇంతకాలం డిమాండ్‌ పెద్దగా లేదని, జలవిద్యుత్‌ వస్తున్న నేపథ్యంలో భూపాలపల్లిలో 600 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుదుత్పత్తి నిలిపివేశారు. వినియోగం మళ్లీ పెరగడంతో దానిని పునఃప్రారంభించాలని జెన్‌కో సిద్ధమవుతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు