close

తెలంగాణ

ఆహార పొట్లాలపై గడువు తేదీ 

వినియోగదారుల కొత్త చట్టం 3 నెలల్లో అమల్లోకి 
కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ వెల్లడి 
ఈనాడు - దిల్లీ

ప్యాకేజ్డ్‌ నీళ్ల సీసాలు, కూల్‌డ్రింక్స్‌ తదితర వస్తువులపై అతికించే లేబుళ్లు మరింత పెద్దగా కనిపించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా సీసాలు, ప్యాకెట్లపై 40శాతం పరిమాణం వరకూ లేబుళ్లు ఉండటాన్ని తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ తెలిపారు. వస్తువు పరిమాణం, తయారీ తేదీ, వినియోగార్హత ముగిసే తేదీ (ఎక్స్‌పైరీడేట్‌), గరిష్ఠ చిల్లర ధర అందులో స్పష్టంగా కనిపించేలా చూస్తామన్నారు. ‘యూజ్‌ బెస్ట్‌ బిఫోర్‌ 6 మంత్స్‌’ మాదిరి కాకుండా... ఆ వస్తువుల కాలపరిమితి కచ్చితంగా ఏ తేదీలోగా ముగుస్తుందో స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని తయారీదారులను ఆదేశించారు. వినియోగదారుల హక్కుల రక్షణ సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు అరటిపళ్లు రూ.442, రెండు ఉడికించిన రెండు గుడ్లు రూ.1,700కి అమ్ముతూ వినియోగదారులను దోచుకుంటున్న ఫైవ్‌స్టార్‌ హోటళ్ల తీరుకు ముకుతాడు వేస్తామన్నారు. ఇటీవల చండీగఢ్‌, ముంబయిల్లోని వేర్వేరు హోటళ్లు అరటిపళ్లు, గుడ్లకు అసాధారణ ధరలు వసూలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను తాము సుమోటోగా తీసుకుని, ఆ రెండు హోటళ్లకు సంజాయిషీ నోటీసులు జారీ చేశామన్నారు.

విమానాశ్రయాల్లో చిల్లరగా అమ్మే వస్తువుల ధరలతో పాటు, వాటిపై సర్వీస్‌ ఛార్జీ ఎంత వేయాలన్న స్వేచ్ఛ సంబంధిత వ్యాపారికే ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని హోటళ్లు ఇలాంటి అవాంఛనీయ వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని పాసవాన్‌ ఆక్షేపించారు. కొత్తచట్టం అమలుకు జారీచేసే నిబంధనల్లో ఇలాంటి తప్పుడు విధానాలన్నింటికీ ముకుతాడు వేస్తామన్నారు. ఏ వస్తువు ధర ఎంత ఉండాలి, దానిపై సేవా రుసుము ఎంత వేయాలన్నది స్పష్టంగా నిర్దేశిస్తామన్నారు. హోటళ్లలో చిల్లరగా అమ్మే ప్రతి వస్తువు ధరను సేవా రుసుముతో సహా మెనూలో చూపించాలని, తద్వారా వినియోగదారులకు దేని ధర ఎంతో తెలుస్తుందన్నారు. కొత్త వినియోగదారుల హక్కుల చట్టాన్ని మూడు నెలల్లోగా అమల్లోకి తెస్తామన్నారు. ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాటి నిబంధనలను నోటిఫై చేస్తామని చెప్పారు. వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఆ తర్వాత ధరల తగ్గింపు! 
ప్యాకేజ్డ్‌ ఆహారంపై తయారీ, గడువు తేదీలతో పాటు ‘బెస్ట్‌ బిఫోర్‌ యూజ్‌’ తేదీని కూడా తయారీదారులు ముద్రించేలా చర్యలు తీసుకోవాలని ఆహార భద్రత-భారత ప్రమాణాల సంస్థ నిర్ణయించినట్టు సమాచారం. బెస్ట్‌ బిఫోర్‌ యూజ్‌ తేదీ ముగిసిన తర్వాత ఆ ప్యాకేజీ ధరలను భారీగా తగ్గించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు