close

క్రైమ్

వాహన డీలర్ల అక్రమాలపై కొరడా

పలువురికి అపరాధ రుసుం వడ్డింపు

ఈనాడు-అమరావతి: డీలర్ల వద్దే ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్‌కు వెసులుబాటు కల్పిస్తుండగా, దానిని కొందరు దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా అక్రమాలకు పాల్పడ్డారని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. ఫిర్యాదులు వస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా వంద షోరూముల్లో తనిఖీలు చేయగా పలు లొసుగులు వెలుగు చూశాయని, బాధ్యులపై చర్యలు చేపట్టామని చెప్పారు. రవాణాశాఖ కమిషనర్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, అదనపు కమిషనర్‌ శ్రీనివాస్‌, సంయుక్త కమిషనర్లు- ప్రసాదరావు, రమశ్రీ మంగళవారం ఆ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో కొందరు డీలర్లు ఆయా వాహనాల విలువను ఇన్వాయిస్‌లో తక్కువగా చూపడం ద్వారా, తక్కువ జీవిత పన్నునే జమ చేసేవారని చెప్పారు. ‘విజయవాడలోని హోండా ద్విచక్ర వాహన డీలర్‌ ఒక్కొక్కటి కేవలం రూ.10 వేలు చొప్పున 29 వాహనాలు విక్రయించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆ షోరూం నుంచి రూ.లక్ష జీవిత పన్ను, అపరాధ రుసుము కింద మరో రూ.లక్ష వసూలు చేశాం. అనంతపురంలోని మారుతి డీలర్‌ 59 వాహనాల విషయంలో ఇలాగే చేస్తే.. అదనపు జీవిత పన్ను, అపరాధ రుసుము కలిపి రూ.82 లక్షలు వసూలు చేశాం. విజయవాడలోని ఓ హ్యుందాయ్‌ షోరూమ్‌లో రికార్డుల తనిఖీకి డీలర్‌ సహకరించకపోవడంతో రూ.5 లక్షల అపరాధ రుసుము రాబట్టాం. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ఇన్వాయిస్‌ ధరలను అధికారులు తనిఖీ చేసిన తర్వాత అనుమతులు ఇచ్చేందుకు వీలుగా ఆటోమేటిక్‌ ఆమోదాన్ని నిలిపివేశాం’ అని వివరించారు.

కమిషనర్‌ను కలిసిన కోడెల: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మంగళవారం రవాణా శాఖ కమిషనర్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును కలిశారు. తన కుమారుడికి చెందిన షోరూముల్లో నిబంధనల ప్రకారమే వాహనాల విక్రయాలు జరిగాయని, అధికారులు ఇచ్చిన తాఖీదులకు పూర్తి సమాచారంతో బదులిచ్చినా షోరూమ్‌లు సీజ్‌ చేశారని తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు