close

గ్రేటర్‌ హైదరాబాద్‌

నదుల అనుసంధానంపై కేసీఆర్‌ది యూటర్న్‌: దత్తాత్రేయ

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలతో ఊరించడం, హైటెక్‌ ప్రచారం చేసుకోవడం తప్ప.. రూ.వేల కోట్లు ఖర్చు చేసినా ఇప్పటివరకు ఎకరా పొలంలోనూ ఆ నీళ్లు పారించలేదని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి వరకు 115 కిలోమీటర్ల మేర గోదావరి జలాలున్నాయని చెబుతున్నా రైతుల పొలాలకు నీళ్లు అందకపోవడం సీఎం వైఫల్యమని వ్యాఖ్యానించారు. మంగళవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే నదుల అనుసంధానంపై కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకున్నారని ఆక్షేపించారు. గోదావరి జలాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానంటూ చిత్తూరు జిల్లా నగరిలో తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘గోదావరి, కృష్ణా బేసిన్ల నుంచి 100 టీఎంసీల నీటిని రాయలసీమకు ఇవ్వాలని 1998లోనే భాజపా నాటి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ నదుల అనుసంధానాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుతున్నారు’’ అని ఆక్షేపించారు. సెప్టెంబరు 17వ తేదీ విమోచన దినోత్సవాన్ని తెరాస ప్రభుత్వం మతం కోణంలో చూస్తోందని.. మజ్లిస్‌ ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ చరిత్రను తెరమరుగు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆరోజున అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిర్వహించి జాతీయ జెండాల్ని భాజపా ఎగురవేస్తుందని చెప్పారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి వస్తారన్నారు. ఆగస్టు 15న గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే కేసీఆర్‌ సెప్టెంబరు 17న కూడా  సీఎంగా జాతీయజెండా ఆవిష్కరించాలన్నారు.

భాజపాలోకి నారాయణ్‌ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే
నారాయణ్‌ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే విజయ్‌పాల్‌రెడ్డి భాజపాలో ఈనెల 18న చేరనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో మంగళవారం హైదరాబాద్‌లో ఆయన సమావేశమయ్యారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు