close

గ్రేటర్‌ హైదరాబాద్‌

నిబంధనల ప్రకారమే ప్రవేశాలు

ఖాళీ సీట్ల భర్తీలో జీవో 550 అమలుకు అడ్డంకులు
హైకోర్టుకు నివేదించిన కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌
ఎంబీబీఎస్‌ ప్రవేశాలపై స్టే పొడిగింపు.. నేడు విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్య విద్య ప్రవేశాలను నిబంధనల ప్రకారమే చేపట్టామని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం హైకోర్టుకు నివేదించింది. 2001నాటి జీవో 550లోని పలు అంశాలతో 2017 జులై 5న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 114 ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు భర్తీ చేశామన్నారు. జీవో 550 అమలు కేవలం మొదటి విడతలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రెండో విడత చేపట్టిన మెడికల్‌ అడ్మిషన్లలో జీవో 550, 114లను అమలు చేయలేదంటూ ఆదిలాబాద్‌కు చెందిన భావన, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. వీటిపై మంగళవారం జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ దాఖలు చేసిన కౌంటరుకు సమాధానం ఇవ్వడానికి ఒకరోజు గడువు కావాలని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ కోరారు. దీంతోపాటు ఇప్పటికే అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు మరికొందరు హైకోర్టును ఆశ్రయించడంతో అన్నింటిపై బుధవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బుధవారం వరకు పొడిగించింది. జీవో 550ను రెండో విడత కౌన్సెలింగ్‌లో అమలు చేయడానికి చాలా అడ్డంకులున్నాయని రిజిస్ట్రార్‌ డి.ప్రవీణ్‌కుమార్‌ కౌంటర్‌లో పేర్కొన్నారు. మొదటి విడత అడ్మిషన్‌లలో ఖాళీ అయిన సీట్ల భర్తీలో జీవో 550ను అమలు చేయడం వల్ల రిజర్వేషన్లు 50 శాతాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మెరిట్‌ ద్వారా సీట్లు పొందిన రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థి 27 కాలేజీల్లో ఎక్కడైనా సీటును ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. ఓపెన్‌ కేటగిరీ నుంచి పక్కకు జరిగిన మెరిట్‌ రిజర్వేషన్‌ అభ్యర్థి మెరుగైన కాలేజీలో రిజర్వేషన్‌ కేటగిరీ కింద చేరినట్లయితే రిజర్వేషన్‌ కోటా పెరుగుతుందన్నారు. ఇలా పక్కకు జరిగిన మెరిట్‌ రిజర్వేషన్‌ అభ్యర్థి సీటును తరువాతి మెరిట్‌ అభ్యర్థితో భర్తీ చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటే అవకాశం ఉండదన్నారు. అందువల్ల మొదటి విడతలో ఖాళీ అయిన మెరిట్‌ రిజర్వేషన్‌ సీట్లను ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు జీవో 550ను అమలు చేయాలని పేర్కొన్నప్పటికీ రెండో విడత భర్తీకి సంబంధించి స్పష్టత ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు  కాలేజీల్లో 2,535 సీట్లు, మైనారిటీ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా 330 సీట్లున్నాయన్నారు. దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌సీసీ కోటా మినహా మిగిలిన 2,487 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించామన్నారు. మొదటి విడతలో ఓపెన్‌ కేటగిరీ 804, రిజర్వేషన్‌ కేటగిరీలో 1,243 సీట్లను భర్తీ చేసినట్లు చెప్పారు. మెరిట్‌ కోటాలో 440 మంది సీట్లు పొందగా, 20 మంది చేరలేదన్నారు. పిటిషనర్లకు కటాఫ్‌ మార్కులకంటే ఎక్కువ వచ్చినట్లయితే వారికి సీట్లు వస్తాయని, అడ్మిషన్లలో వారికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు