close

తెలంగాణ

థియేటర్‌ల వ్యాపారానికి ఢోకా ఉండదు

ఇంట్లోనే కొత్త సినిమా చూసే వీలుపై పీవీఆర్‌, ఐనాక్స్‌ల స్పందన

దిల్లీ: కొత్త సినిమా విడుదల రోజే, తమ ప్రీమియం చందాదార్లు ఇంట్లోనే చూసే వీలు కల్పిస్తామని రిలయన్స్‌ జియో ఫైబర్‌ ప్రకటించినా, థియేటర్‌ వ్యాపారంపై పెద్దగా ప్రభావం పడదని మల్టీప్లెక్స్‌ల ఆపరేటర్లు పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాయి. సినిమాను థియేటర్‌లో చూడటం, ఇంట్లో వీక్షించే అనుభవాల మధ్య తేడా ఉందని, దేశంలో 800 స్క్రీన్లు నిర్వహిస్తున్న పీవీఆర్‌ పేర్కొంది. ఈ రెండు పద్ధతుల్లో సినిమా చూడటం దశాబ్దాలుగా అలవాటేనని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని, అయితే సినిమాహాళ్ల వృద్ధికి ఢోకా ఉండదనే అంచనాను వ్యక్తం చేసింది. జనసంఖ్యతో పోలిస్తే థియేటర్లు తక్కువగా ఉన్నాయి కనుక, మరింత విస్తరణకే వీలుందని తెలిపింది.

ఏదో ఒక మాధ్యమంలోనే..: థియేటర్లలో విడుదలైన 8 వారాల వరకు మరే మాధ్యమంలో ప్రదర్శించకూడదని సినీ నిర్మాతలు, పంపిణీదారులు, మల్టీప్లెక్స్‌ యజమానులు ఒప్పందం చేసుకున్నారని దేశంలో 600 స్క్రీన్లు నిర్వహిస్తున్న ఐనాక్స్‌ లీజర్‌ గుర్తు చేసింది. అంతర్జాతీయంగా ఇదే విధానం అమలవుతోందని, ఇందువల్ల ఈ రంగంలోని అన్ని విభాగాలు ఆర్థికంగా మనగలుగుతున్నాయని వివరించింది. అయితే సినిమాకు నిర్మాతే యజమాని కనుక ఏ మాధ్యమంలో పంపిణీ చేయాలన్నది తన ఇష్టమని పేర్కొంది. థియేటర్లు లేక మరో మాధ్యమాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి వస్తుందని, ఒకేసారి రెండింటిలో విడుదల చేయడం అంటే ఇప్పుడు ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందంది. సినిమాను థియేటర్‌లో చూడటాన్నే అత్యధికులు ఇష్టపడతారని విశ్లేషించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు