close

గ్రేటర్‌ హైదరాబాద్‌

జడ్పీ సీఈవోలకు జీతాలిచ్చే అధికారం లేదు

ప్రభుత్వం ఉత్తర్వులు
‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా పరిషత్‌ల సిబ్బందికి జీత,భత్యాల చెల్లింపు, జడ్పీల ఆర్థికపరమైన అంశాలను సీఈవోలే చేపట్టాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు వీటిని నిలుపుదల చేస్తున్నట్టుగా పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌.. మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా పరిషత్‌ల సిబ్బందికి జీత,భత్యాల చెల్లింపు, జడ్పీల ఆర్థికపరమైన అంశాలను సీఈవోలే చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాలను ఇవ్వగా.. డిప్యూటీ సీఈవోల బాధ్యతలను సీఈవోలకు ఇవ్వటం వల్ల ముఖ్యపనులపై ప్రభావం పడుతుందని ఈనెల 8న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పంచాయతీరాజ్‌ శాఖ.. తొలుత ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా పక్కనపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని పాత జడ్పీల్లో సీఈవో కాకుండా డిప్యూటీ సీఈవో, అకౌంట్స్‌ అధికారి(ఏవో) పోస్టులుండేవి. 9 జడ్పీలు 32 జడ్పీలుగా మారటంతో చట్టపరమైన నిబంధనల ప్రకారం ప్రతి జడ్పీకి ఒక్కో సీఈవో చొప్పున ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ సీఈవో, ఏవో పోస్టులు రెండింటిని కలిపి ఒకే పోస్టును ఉంచాలని భావించి ఆమేరకు ఒక్కో అధికారి చొప్పున నియమించింది. వీరికి డిప్యూటీ సీఈవో/ఏవో అనే 2 హోదాలను కల్పించి ఆర్థిక అంశాలను వారికే అప్పగిస్తే సమస్యలు ఉండేవేకావు. పంచాయతీరాజ్‌ శాఖ అలా చేయకుండా కేవలం ఏవో అనే పేరుతోనే నియామకాలను చేపట్టింది. దీంతో ఆర్థిక అంశాలను సీఈవోలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత భావించినట్టుగా ఏవో పోస్టుకు డిప్యూటీ సీఈవో అని నామకరణం చేసి.. జీతాల చెల్లింపు, ఇతర ఆర్థిక అంశాలను అప్పగిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఒక అధికారి పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు