close

గ్రేటర్‌ హైదరాబాద్‌

కృష్ణా తీర గ్రామాల్లో ముంపు

రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: కృష్ణా తీరంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా, భీమా నదులు కలిసే తంగడిగి సంగమం వద్ద నుంచి ఉప్పొంగుతున్న వరద.. నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల తీర గ్రామాలను తాకుతోంది. సుంకేసుల డ్యాం 26 గేట్లను తెరిచి వరదనీటిని వదులుతున్నారు. ఈ నీరంతా శ్రీశైలం తిరుగు జలాలను తాకుతుండటంతో కృష్ణా, తుంగభద్ర నదీతీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌, మానవపాడు, ఉండవల్లి, రాజోలి, అయిజ మండలాల్లోని 25 గ్రామాల్లో తుంగభద్ర తీరప్రాంతాలోన్లి పొలాలను వరదనీరు ముంచెత్తింది. రాజోలి మండలంలోని గార్లపాడు నుంచి రాజోలికి వెళ్లే రహదారి తెగిపోయింది. నారాయణపేట జిల్లాలోని మక్తల్‌, కృష్ణా, మాగనూరు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 957 మంది కున్సి పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. ముంపునకు గురైన వాసునగర్‌, హిందూపూర్‌ గ్రామస్థులు ఇంకా తేరుకోలేదు. హైదరాబాదు- బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం ఇంకా ముంపులోనే ఉంది. ఇక్కడున్న సమీప గ్రామాల ప్రజలను స్థానిక గురుకుల పాఠశాలకు తరలించారు. కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ్డ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్తు టవరు పడిపోవడంతో ఈగ్రామానికి సరఫరా నిలిచిపోయింది. జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) రంగంలోకి దిగింది. జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని కృష్ణా, తుంగభద్ర నదీ తీర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు పలు సూచనలు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా లైఫ్‌ జాకెట్లు, తాళ్లు, రబ్బరు పడవలను అందుబాటులో ఉంచారు. రెండు నదుల తీరప్రాంతాల్లో 11 వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆది, సోమవారాలతో పోల్చుకుంటే మంగళవారానికి కృష్ణానది ఇన్‌ఫ్లో తగ్గింది. తీరప్రాంత ప్రజలకు ప్రస్తుతానికి ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు