close

జాతీయ- అంతర్జాతీయ

రాజకీయ జోక్యం లేకపోతే సీబీఐ భేష్‌ 

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య

దిల్లీ: సీబీఐని ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించుకునే అవకాశం ఎప్పుడూ ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి పేర్కొన్నారు. అయితే రాజకీయ ప్రభావం లేని కేసుల్లో ఆ దర్యాప్తు సంస్థ అద్భుతంగా పనిచేస్తోందన్నారు. సీబీఐలోని కీలక అంశాలను ప్రభుత్వ పాలనా నియంత్రణ పరిధి నుంచి తప్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కాగ్‌తో సమానంగా చట్టబద్ధ హోదాను ఈ దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని, ఇందుకు చట్టం చేయాలని సూచించారు. మంగళవారం ఆయన ఇక్కడ సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్‌ డి.పి.కోహ్లి స్మారకోపన్యాసాన్ని ఇచ్చారు. సంస్థాగత నిర్మాణం, విధులు, అధికార పరిమితులు, పర్యవేక్షణ వంటి అంశాల్లో లోపాలను సరిచేస్తూ ఒక సమగ్ర చట్టాన్ని చేయడం ద్వారా సీబీఐని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘దిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం’లోని సెక్షన్‌ 4 వల్ల ఈ దర్యాప్తు సంస్థపై పర్యవేక్షణ చాలా వరకూ కార్యనిర్వాహక వ్యవస్థ చేతిలో ఉండిపోయిందని చెప్పారు. అందువల్ల దీన్ని రాజకీయ సాధనంగా ఉపయోగించే అవకాశం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నేరాల దర్యాప్తు కోసం ‘పబ్లిక్‌ ఆర్డర్‌’ను ఉమ్మడి జాబితాలో ఉంచాలని జస్టిస్‌ గొగొయి కోరారు. సీబీఐలో స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సంస్కరణలు చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. ఈ సంస్థ పనితీరులో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని కట్టడి చేసేందుకు సుప్రీం కోర్టు అనేక మార్గదర్శకాలను ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రాల్లో కేసుల దర్యాప్తునకు ఆయా రాష్ట్రాల అనుమతి అవసరమవుతోందని తెలిపారు. అయితే అధికారుల అలసత్వం, స్వప్రయోజనాలు వల్ల ఆ అనుమతులను నిరాకరించడం కానీ, ఆలస్యం చేయడం కానీ చేస్తున్నారని పేర్కొన్నారు.

నిష్పాక్షిక దర్యాప్తు అవసరమైనప్పుడల్లా సీబీఐ వైపే చూపు 
సంక్లిష్టమైన కేసుల్లో నిష్పాక్షిక దర్యాప్తు అవసరమైనప్పుడల్లా ప్రజలు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్‌ చేస్తారని ఆ సంస్థ డైరెక్టర్‌ రిషి కుమార్‌ శుక్లా పేర్కొన్నారు. ఈ దర్యాప్తు సంస్థ ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, ప్రజల విశ్వాసాన్ని చూరగొందని చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు