close

జాతీయ- అంతర్జాతీయ

‘పాక్‌’ మోహరింపులపై ఆందోళనొద్దు 

భారత బలగాలు సర్వసన్నద్ధం 
సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌ వెల్లడి

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని తొలగించాలన్న భారత నిర్ణయంతో అగ్గిమీద గుగ్గిలమైన పాకిస్థాన్‌ నియంత్రణ రేఖ వెంబడి అదనంగా సైనిక సంపత్తిని మోహరించడం ఆందోళనకర పరిణామమేమీ కాదని సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేర్కొన్నారు. ఇది సర్వసాధారణమేనన్నారు. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలాంటి భద్రతాపరమైన సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రతి దేశమూ ముందుజాగ్రత్త చర్యగా సైనిక మోహరింపులు, తరలింపులను చేపడుతుంటుంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ అదనపు బలగాలను మోహరించడంపై మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదు’’ అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఘర్షణలు పెరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు.. అంతా పాక్‌పై ఆధారపడి ఉందన్నారు. ‘‘అక్కడ ఘర్షణలను పెంచాలని ప్రత్యర్థి నిర్ణయించుకుంటే అది వారిష్టం’’ అని చెప్పారు.

కశ్మీర్‌ లోయలో అల్లర్లు, బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు పాక్‌ కుట్ర పన్నే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అక్కడి భద్రతా పరిస్థితులను అగ్రశ్రేణి సైనిక కమాండర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

అవసరమైతే అఫ్గాన్‌ వైపు నుంచి బలగాల తరలింపు: పాక్‌ 
న్యూయార్క్‌: భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల వెంబడి ఉన్న తన బలగాలను నియంత్రణ రేఖ వద్దకు పాకిస్థాన్‌ తరలించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికాలో పాక్‌ రాయబారి అసద్‌ మజీద్‌ ఖాన్‌ తెలిపారు. అఫ్గాన్‌లో అమెరికా, తాలిబన్ల మధ్య జరుగుతున్న చర్చలను ఇది సంక్లిష్టం చేయవచ్చని అమెరికా పత్రిక ‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది. ఈ శాంతి చర్చలు తుది దశలో ఉన్నట్లు సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌, పాక్‌ల మధ్య గత వారం రోజులుగా పెద్దగా సంప్రదింపులు జరగలేదని మజీద్‌ ఖాన్‌ చెప్పారు. అందువల్ల పరిస్థితులు సంక్లిష్టమయ్యే అవకాశం ఉందన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు