close

జాతీయ- అంతర్జాతీయ

శ్రీనగర్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 

అక్టోబర్‌ 12 నుంచి నిర్వహణ

జమ్మూ: జమ్మూ-కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు శ్రీనగర్‌లో అక్టోబర్‌-12 నుంచి మూడు రోజులపాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు అధికార యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. జమ్మూ-కశ్మీర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, వనరులు, మౌలిక వసతులు వంటివాటిని ఈ సదస్సుకు వచ్చిన పెట్టుబడిదారులకు వివరిస్తామని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (పరిశ్రమలు) నవీన్‌ చౌధురి తెలిపారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని వాణిజ్య వర్గాల్లో జమ్మూ-కశ్మీర్‌కు సంబంధించి ఉన్న భయాలు, అపోహలను తొలగించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల సదస్సుకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో చేపట్టనున్న రోడ్డు షోలను త్వరలో గవర్నర్‌ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. దేశంలోని అహ్మదాబాద్‌, ముంబయి, హైదరాబాద్‌, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రోడ్డు షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నవీన్‌ చౌధురి వివరించారు. విదేశాలకు సంబంధించి.. దుబాయ్‌, అబుధాబి, లండన్‌, నెదర్లాండ్స్‌, సింగపూర్‌, మలేసియా తదితర దేశాల్లోనూ రోడ్డు షోలు చేపడతామన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద గ్రూపులకు చెందిన ప్రతినిధులు సహా మొత్తం 2,000 మంది ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానిస్తామని చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం ఈ సదస్సుకు హాజరవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు