close

జాతీయ- అంతర్జాతీయ

సీఎస్‌ఆర్‌ వ్యయాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలి 

అత్యున్నత స్థాయి కమిటీ నివేదిక

దిల్లీ: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కంపెనీలు ఖర్చు చేసే మొత్తంపై పన్ను మినహాయింపు పొందే వీలు కల్పించాలని, ఒకవేళ ఎవరైనా ఆ నిధులను ఖర్చు చేయకపోతే దాన్ని సివిల్‌ నేరంగా పరిగణించి జరిమానాతో సరిపెట్టాలని అత్యున్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ మంగళవారం తమ ప్రతిపాదలను కార్పొరేట్‌ వ్యవహారాలు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేసింది. ప్రస్తుతం ఉన్న సీఎస్‌ఆర్‌ నిబంధనలను సమీక్షించి, వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయమని గత ఏడాది అక్టోబరులో శ్రీనివాస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఇందులో టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, బెయిన్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఎండీ అమిత్‌ చంద్రా, మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బీఎస్‌ నరసింహ, లూథ్రా అండ్‌ లూథ్రా లా ఆఫీస్‌ వ్యవస్థాపకులు, ఎండీ రాజీవ్‌ లూథ్రా, అపోలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభన కామినేని సభ్యులుగా ఉన్నారు. రూ.50 లక్షల్లోపు సీఎస్‌ఆర్‌ నిధులు ఉంటే, సదరు కంపెనీలు సీఎస్‌ఆర్‌ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కమిటీ పేర్కొంది.  ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత తీర్చుకొనే ప్రత్యామ్నాయ వనరుగా సీఎస్‌ఆర్‌ నిధుల్ని చూడొద్దని సూచించింది. కంపెనీల చట్టం-2013 ప్రకారం, లాభదాయక సంస్థలు మూడేళ్ల వార్షిక సరాసరి లాభంలో 2 శాతం నిధులను సీఎస్‌ఆర్‌ కింద ఖర్చు చేయాల్సి ఉంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు