close

ఆంధ్రప్రదేశ్

టెండర్ల రద్దుతో నష్టమే

నైఫుణ్యం, డిజైన్ల సమన్వయానికి పూచీ ఎవరు?

పనుల్లో జాప్యం తప్పదు

వ్యయం పెరిగితే కేంద్రం భరించబోదు

పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆందోళన

నవయుగ పనితీరు బాగానే ఉందన్న ఛైర్మన్‌ జైన్‌

ఇప్పుడు రీ టెండరింగ్‌కి వెళ్తే, అంతకంటే తక్కువకు పనులు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారన్న నమ్మకం ఉందా? కొత్త సంస్థకు పనులు అప్పగిస్తే యంత్రాలను సమకూర్చుకొనేందుకు సమయం పడుతుంది కదా?

- పోలవరం అథారిటీ అధికారుల ప్రశ్న

ఈనాడు - హైదరాబాద్‌, అమరావతి: పోలవరం ప్రాజెక్టు టెండర్‌ని రద్దు చేసి మళ్లీ పిలవడం (రీ టెండరింగ్‌) వల్ల నష్టమే తప్ప, లాభమేమీ ఉండబోదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పేర్కొంది. రీ టెండరింగ్‌కు వెళ్లడం వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు, ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిర్మాణ గడువు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. వేరే సంస్థకు పనులు అప్పగిస్తే... సాంకేతిక నైపుణయం, డిజైన్ల పరంగా సమన్వయం ఎలా సాధ్యపడుతుందని, దానికి ఎవరు పూచీ వహిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ప్రశ్నించింది. వ్యయం పెరిగితే... ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించబోదని కుండబద్దలు కొట్టింది. రీ టెండరింగ్‌ నిర్ణయం వల్ల ఒనగూరే లాభనష్టాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే... పోలవరం రీటెండరింగ్‌పై ఒక నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ సూచించింది. పోలవరం హెడ్‌వర్క్స్‌ పనులు చేస్తున్న నవయుగ సంస్థను ముందుగానే తప్పిస్తూ (ప్రీక్లోజర్‌) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న నేపధ్యంలో పీపీఏ అత్యవసర సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ప్రీక్లోజర్‌ నిర్ణయం వల్ల ప్రాజెక్టుపై పడే ప్రభావాన్ని చర్చించడానికే ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పీపీఏ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌, కేంద్ర జలవనరులు, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు చెందిన సంయుక్త కార్యదర్శులు, పోలవరం ప్రాజెక్టు మానిటరింగ్‌ కమిటీ ఛైర్మన్‌, సభ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగానే నిర్మాణ సంస్థ నవయుగ- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రీకోజర్‌ నోటీసుకు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీనిపైనా పీపీఏలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీపీఏ సమావేశం అనంతరం అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. పీపీఏ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ విలేకరులతోనూ మాట్లాడారు.

ప్రయోజనాలు ఆలస్యమవుతాయి: పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్‌ వల్ల పనుల్లో జాప్యం జరుగుతుందని, ఫలితంగా ప్రాజెక్టు వల్ల ఒనగూరే ప్రయోజనాలూ ఆలస్యమవుతాయని పీపీఏ పేర్కొంది. వ్యయం పెరిగితే తాము బాధ్యత వహించబోమని స్పష్టంచేసింది. వ్యయం ఎంత పెరుగుతుందన్నది టెండర్‌కు వచ్చే స్పందనను బట్టి అంచనా వేయగలమని పేర్కొంది. తుది నిర్ణయం తీసుకొనే ముందు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సలహా ఇచ్చినట్లు తెలిపింది. నవంబరు ఒకటి కల్లా పనులను తిరిగి ప్రారంభిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వాదనతో పీపీఏ అధికారులు అంగీకరించలేదని తెలిసింది. మొదట్లో మధుకాన్‌ కంపెనీ పోలవరం పనులు చేస్తున్నప్పుడు, వాటిని రద్దు చేసి ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇవ్వడానికి నాలుగేళ్లు పట్టిన విషయాన్ని పీపీఏ అధికారులు గుర్తుచేసినట్టు సమాచారం. ప్రీక్లోజర్‌ వల్ల పనుల్లో జాప్యం జరగదన్న గ్యారంటీ ఏమిటంది.

ఎవరు బాధ్యత వహిస్తారు: ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి నవయుగకు పనులు మార్చినప్పుడు... మూడు నెలల సమయం వృథా అయిందని, ఇప్పుడు మరో మూడు నెలలు వృథా అయితే ఒక సీజన్‌ పోతుందని పీపీఏ పేర్కొంది. జాప్యం వల్ల పడే ఆర్థిక భారానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించింది. ‘గతంలో ట్రాన్స్‌ట్రాయ్‌ ఐబీఎం కంటే 14 శాతం తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు రీ టెండరింగ్‌కి వెళ్తే, అంతకంటే తక్కువకు పనులు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారన్న నమ్మకం ఉందా? కొత్త సంస్థకు పనులు అప్పగిస్తే యంత్రాలను సమకూర్చుకొనేందుకు సమయం పడుతుంది కదా?’ అని పీపీఏ అధికారులు ప్రశ్నించారు. ప్రస్తుతం పనులు చేస్తున్న నవయుగ సంస్థకు చెందిన యంత్రాలనే వినియోగించుకునేలా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పినట్టు సమాచారం. ఆ అంశాన్ని టెండర్‌ నిబంధనల్లోనూ పొందుపరుస్తారా? అని పీపీఏ అధికారులు ప్రశ్నించగా, అలా చేయలేమని రాష్ట్ర అధికారులు చెప్పినట్టు తెలిసింది. లాభనష్టాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని పీపీఏ స్పష్టం చేసినట్టు సమాచారం.

కచ్చితంగా ఖర్చు పెరుగుతుంది.. ఆర్‌.కె.జైన్‌: ‘రీటెండరింగ్‌ వల్ల ప్రాజెక్టు వ్యయం ఎంత పెరుగుతుందో ఇప్పుడే అంచనా వేయలేం. కొంత వ్యయం పెరుగుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలం’ అని ఛైర్మన్‌ జైన్‌ విలేకరులకు తెలిపారు. రీటెండరింగ్‌కు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ అనుమతి ఉందా? అన్న ప్రశ్నకు... దానికి తమ అనుమతి అవసరం లేదని, టెండర్లు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఆయన తెలిపారు. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా చూడటమే తమ బాధ్యతగా పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల పడే ఆర్థిక భారంతోనూ తనకు సంబంధం లేదని, దాన్ని భరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. నిర్దిష్టమైన కారణాలుంటే తప్ప రీ టెండరింగ్‌కు వెళ్లకపోవడమే మంచిదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ప్రస్తుతం పోలవరం పనులు చేస్తున్న నవయుగ సంస్థ పనితీరు బాగానే ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు