close

క్రీడలు

మూడు ముక్కలాట...

1971లో తన 12వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచి నిష్క్రమించాడు ఎమర్సన్‌. ఈ రికార్డు దాదాపు మూడు దశాబ్దాలు నిలబడింది. 2000లో వింబుల్డన్‌ గెలిచి పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సాధించిన సంప్రాస్‌.. ఇంకో రెండేళ్లకు మరో యుఎస్‌ ఓపెన్‌ నెగ్గి 14 టైటిళ్లతో కెరీర్‌ ముగించాడు. కానీ ఫెదరర్‌ మరో ఏడేళ్లకే    సంప్రాస్‌ను అధిగమించేశాడు. ఆపై 20 టైటిళ్ల మైలురాయినీ అందుకున్నాడు. రోజర్‌ రికార్డుకిక ఢోకా లేదని అనుకుంటుంటే ఇంకో ఇద్దరు వీరులు అతడిని వెంటాడుతూ వస్తున్నారు. ఓవైపు నాదల్‌, అటు జకోవిచ్‌.. ఫెదరర్‌ను అధిగమించి టెన్నిస్‌ చరిత్రలో ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అనిపించుకోవాలని తహతహలాడుతున్నారు. మరి ఈ ముగ్గురిలో ఈ హోదా ఎవరి సొంతం కానుంది?

ఈనాడు క్రీడావిభాగం

ఫెదరర్‌
వయసు: 38
గ్రాండ్‌స్లామ్‌లు: 20
(ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-6, ఫ్రెంచ్‌ ఓపెన్‌-1, 
వింబుల్డన్‌-8, 
యుఎస్‌ ఓపెన్‌-5)

సంప్రాస్‌ 2002లో 14వ గ్రాండ్‌స్లామ్‌తో రికార్డు నెలకొల్పే సమయానికి ఫెదరర్‌ ఒక్క టైటిల్‌ కూడా గెలవలేదు. అప్పటికి 14 టైటిళ్ల ఘనతే చాలా గొప్పగా అనిపించింది. ఎమర్సన్‌ రికార్డు 29 ఏళ్లకు కానీ బద్దలు కాని నేపథ్యంలో సంప్రాస్‌ ఘనతను అధిగమించడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో అని అంతా అనుకున్నారు. కానీ 2003లో వింబుల్డన్‌తో గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టిన రోజర్‌.. 2009లో అదే టోర్నీలో విజేతగా నిలిచి సంప్రాస్‌ రికార్డును బద్దలు కొట్టేసి ఔరా అనిపించాడు. ఆ తర్వాత రోజర్‌ జోరు తగ్గింది. మూడేళ్లలో మూడు టైటిళ్లే సాధించాడు. 2012 వింబుల్డన్‌తో గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్యను 17కు పెంచుకున్న రోజర్‌.. నాలుగున్నరేళ్ల పాటు మరో టైటిల్‌ గెలవలేదు. రోజర్‌కు వయసు కూడా మీద పడిపోవడంతో రికార్డు 17 దగ్గర ఆగిపోతుందనే అనుకున్నారంతా. కానీ 36 ఏళ్ల వయసులో 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచి ఆశ్చర్యపరిచిన ఫెదరర్‌.. తర్వాతి వింబుల్డన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లను కూడా నెగ్గి 20 గ్రాండ్‌స్లామ్‌ల మైలురాయిని అందుకున్నాడు. కానీ జకోవిచ్‌, నాదల్‌ పుంజుకునే సమయంలో ఫెదరర్‌ అక్కడే ఆగిపోయాడు. వయసు 38కి చేరుకోవడం రోజర్‌కు ప్రతికూలత. 2018 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత గ్రాండ్‌స్లామ్‌ గెలవని ఫెదరర్‌.. ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ఒకటో రెండో టైటిళ్లను జమ చేయకపోతే రికార్డు నిలిచేలా లేదు.

రఫెల్‌ నాదల్‌

వయసు: 33
గ్రాండ్‌స్లామ్‌లు: 19 (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-1, ఫ్రెంచ్‌ ఓపెన్‌-12, వింబుల్డన్‌-2, యుఎస్‌ ఓపెన్‌-4)

ఫెదరర్‌ 15వ టైటిల్‌ సాధించే సమయానికి నాదల్‌.. 6 టైటిళ్లతో ఉన్నాడు. అందులో నాలుగు అతడి కంచుకోట రోలాండ్‌ గారోస్‌లో సాధించినవే. ఆ స్థితిలో అతను ఫెదరర్‌ సమీపానికైనా వస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ తన గడ్డపై తిరుగులేని ఆధిపత్యంతో టైటిళ్లు సాధిస్తూనే.. అడపాదడపా వేరే గ్రాండ్‌స్లామ్‌లూ గెలిచాడు. అయితే గాయాలు అతడి కెరీర్‌కు బ్రేకులేశాయి. 2015లో ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. తర్వాతి ఏడాది జకోవిచ్‌ అతడిని క్వార్టర్స్‌లో ఓడించాడు. 2013లో యుఎస్‌ ఓపెన్‌ గెలిచాక.. తర్వాతి నాలుగేళ్లలో 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచే వరకు ఒకే ఒక్క గ్రాండ్‌స్లామ్‌ (2014 ఫ్రెంచ్‌ ఓపెన్‌) సాధించాడతను. కానీ గత రెండేళ్లలో అతడి ఫామ్‌ బాగుంది. ఎప్పట్లాగే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. రెండు యుఎస్‌ ఓపెన్‌ టైటిళ్లూ గెలిచాడు. దీంతో చూస్తుండగానే రోజర్‌ను సమీపించేశాడు. గత రెండేళ్లలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో టైటిళ్ల సంఖ్యను 19కు పెంచుకున్న నాదల్‌.. ఫెదరర్‌ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. రోజర్‌ కన్నా నాదల్‌ అయిదేళ్లు చిన్నవాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అతడి ఆధిపత్యానికి ఇప్పుడిప్పుడే తెరపడేలా లేదు. బోనస్‌గా వేరే టైటిళ్లు కూడా దక్కాయంటే ఫెదరర్‌ను మించడమే కాదు.. ఇంకెవరూ అందుకోలేని స్థాయికి కూడా చేరుతాడేమో.

నొవాక్‌ జకోవిచ్‌

వయసు: 32
గ్రాండ్‌స్లామ్‌లు: 16 (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-7, ఫ్రెంచ్‌ ఓపెన్‌-1, వింబుల్డన్‌-5,  యుఎస్‌ ఓపెన్‌-3)

నువ్వా నేనా అని సాగుతున్న ఫెదరర్‌, నాదల్‌ల పోరును త్రిముఖంగా మార్చిన ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌. అప్పుడప్పుడూ ఓ టైటిల్‌ గెలుస్తున్న జకోవిచ్‌ను రోజర్‌, రఫాల స్థాయిలో దిగ్గజ ఆటగాడిగా గుర్తించడానికి చాలా సమయం పట్టింది. కానీ ఒక దశలో ఆ ఇద్దరినీ మించి టెన్నిస్‌ కోర్టులో ఆధిపత్యం చలాయించాడతను. ఏడాదిలో మూడు గ్రాండ్‌స్లామ్‌లు (2015) గెలిచిన ఘనుడతను. ఫెదరర్‌కు కూడా సాధ్యం కాని విధంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ను ఓడించి టైటిల్‌ (2016) గెలిచిన ఘనత జకోవిచ్‌ సొంతం. ఫెదరర్‌ 17, నాదల్‌ 14 గ్రాండ్‌స్లామ్‌లతో ఉండగా జకోవిచ్‌ టైటిళ్ల సంఖ్య 12కు చేరుకుంది. అతి త్వరలోనే ఆ ఇద్దరినీ అధిగమించేస్తాడని అనుకుంటే.. ఉన్నట్లుండి ఫామ్‌ కోల్పోయాడు. టైటిళ్లకు దూరమయ్యాడు. ర్యాంకింగ్స్‌లో పతనమయ్యాడు. ఇక అతడి కథ ముగిసిందనుకుంటుంటే.. నిరుడు మళ్లీ గొప్పగా పుంజుకున్నాడు. వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌ నెగ్గాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ సాధించాడు. గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్యను 16కు పెంచుకున్నాడు. అతడి వయసు 32 ఏళ్లే. ఫిట్‌నెస్‌ బాగుంది. ఫామ్‌ బాగుంది. వాటిని ఇంకో రెండు మూడేళ్లు కాపాడుకుంటే రోజర్‌ రికార్డును అందుకోవడం, నాదల్‌కు కూడా గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.


 
 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు