close

క్రీడలు

రోహిత్‌.. కొత్త ఆరంభం?

రోహిత్‌ శర్మ స్వతహాగా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌. తన తొలి టీ20లో ఏడో స్థానంలో ఆడాడు. వన్డేల్లోనూ అదే స్థానంతో అరంగేట్రం చేశాడు. తర్వాత 5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌ చేశాడు. కానీ కెరీర్‌ ఆరంభమైన చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌ అవతారమెత్తాడు. విజయవంతమయ్యాడు. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌ మేటి బ్యాట్స్‌మెన్‌లో అతనొకడు.

కానీ టెస్టుల్లో మాత్రం రోహిత్‌కు కనీసం జట్టులో చోటు కూడా కష్టంగా ఉంది. ఎన్నో అవకాశాలు లభించినా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే మిడిలార్డర్లో నిలదొక్కుకోలేకపోయిన రోహిత్‌కు.. ఆ ఫార్మాట్లోనూ ఓపెనర్‌గా అవకాశమిచ్చి చూడాలన్నది సౌరభ్‌ గంగూలీ లాంటి మాజీల డిమాండ్‌. ఇప్పుడు జట్టు యాజమాన్యం కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రోహిత్‌ టెస్టు ఓపెనర్‌ అవతారం ఎత్తితే ఆశ్చర్యం లేదు.

ఈనాడు క్రీడావిభాగం

రోహిత్‌ శర్మ అంతర్జాతీయ అరంగేట్రం చేసింది 2007లో. కానీ ఇప్పటిదాకా అతనెన్ని టెస్టులు ఆడాడో తెలుసా? కేవలం.. 27. కానీ 2014లో అరంగేట్రం చేసిన కేఎల్‌ రాహుల్‌ మాత్రం అప్పుడే 36 టెస్టులు ఆడేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహుల్‌ను మించి ఎంతో గొప్ప బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్‌.. టెస్టు జట్టులో కనీసం చోటు దక్కించుకోలేని స్థితిలో ఉండటం ఆశ్చర్యమే. అలాగని రాహుల్‌ ప్రదర్శన రోహిత్‌ కన్నా మిన్నగా ఏమీ లేదు. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ అయిన రాహుల్‌.. 36 మ్యాచ్‌ల్లో 34.58 సగటుతో 2006 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయినప్పటికీ రోహిత్‌ 27 టెస్టుల్లో 39.62 సగటుతో 1585 పరుగులు సాధించడం విశేషం.

రాహుల్‌ పరిస్థితి ఇది..
ఏడు మ్యాచ్‌లు.. 192 పరుగులు.. 17.72 సగటు.. ప్రస్తుత భారత టెస్టు ఓపెనర్లలో ఒకడైన కేఎల్‌ రాహుల్‌ ప్రదర్శన ఇది. అతను ప్రతిభావంతుడే. కానీ నిలకడ లేమి పెద్ద సమస్య. ఓ మ్యాచ్‌లో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడతాడు. తర్వాత వరుసగా విఫలమవుతాడు. గత ఏడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో అద్భుత శతకం బాదాడు. కానీ తర్వాత ఇటీవలి వెస్టిండీస్‌ సిరీస్‌ వరకు రాహుల్‌ కనీసం ఓ అర్ధసెంచరీ కూడా సాధించలేదు. గత మూణ్నాలుగేళ్లలో వివిధ ఫార్మాట్లలో రాహుల్‌కు వచ్చినన్ని అవకాశాలు మరే ఆటగాడికీ వచ్చి ఉండవేమో! అయినా సద్వినియోగం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లు, జట్టు యాజమాన్యం ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రత్యామ్నాయం రోహితే అన్నది జట్టు వర్గాల సమాచారం.

మిడిల్‌లో చోటెక్కడ?
టెస్టు జట్టులోకి రావడం, పోవడం రోహిత్‌కు అలవాటైపోయింది. నిలకడ లేమితో, ఫాస్ట్‌ పిచ్‌లపై తడబాటుతో చోటు కోల్పోయాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఓపికతో క్రీజులో నిలవడం, టెయిలెండర్లతో భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు స్కోరును పెంచడం మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు ఎదురయ్యే ప్రధాన సవాల్‌. ఈ విషయంలో రోహిత్‌ విఫలమయ్యాడు. రహానె ఫామ్‌ అందుకుని, విహారి చోటు సుస్థిరం చేసుకోవడంతో రోహిత్‌కు మిడిల్‌లో దాదాపుగా దారులు మూసుకుపోయినట్లే. ఈ నేపథ్యంలో ఓపెనింగ్‌లో పంపితే.. రోహిత్‌ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగలడని అంటున్నారు విశ్లేషకులు. విదేశాల్లో అయితే రోహిత్‌ ఒత్తిడికి గురి కావచ్చని.. కాబట్టి సొంతగడ్డపై  దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అతడిని ఓపెనర్‌గా ప్రయత్నించి చూడాలని జట్టు యాజమాన్యం భావిస్తోందట. టెస్టుల్లో మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ నిలకడగానే ఆడుతుండగా.. నిరుడు ఒక సిరీస్‌ ఆడి సత్తా చాటుకున్న పృథ్వీ షా.. డోపింగ్‌లో దొరికిపోయి నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్‌ పాత్రలోకి మారడానికి రోహిత్‌కు మంచి అవకాశం లభిస్తోంది. మరి ఈ అవకాశాన్ని అతనే మేరకు సద్వినియోగం చేసుకుంటాడో?

‘‘రోహిత్‌ను టెస్టుల్లోనూ ఓపెనర్‌గా పంపాలని గతంలో సూచించా. ఇప్పుడూ ఆ మాటకు కట్టుబడి ఉన్నా. అతను ఆ స్థానంలో కుదురుకోగల సత్తా ఉన్నవాడు. ప్రస్తుతం మిడిలార్డర్‌లో అతడికి చోటు కష్టమే’’
- సౌరభ్‌ గంగూలీ, మాజీ కెప్టెన్‌
‘‘వెస్టిండీస్‌ సిరీస్‌ తర్వాత సెలక్షన్‌ కమిటీ సమావేశం కాలేదు. ఈసారి మేం కలిసినపుడు రోహిత్‌ను టెస్టుల్లో ఓపెనర్‌గా పంపే అంశంపై చర్చిస్తాం. రాహుల్‌కు ఎంతో ప్రతిభ ఉంది. కానీ టెస్టుల్లో అతడికి కష్టకాలం నడుస్తోంది. అతడి ఫామ్‌ మాకు ఆందోళన కలిగిస్తోంది. అతను లయ అందుకోవడానికి కష్టపడాలి’’
- ఎమ్మెస్కే ప్రసాద్‌, టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్‌


 
 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు