close

బిజినెస్‌

ఫియట్‌ ఇండియా ఎండీగా డాక్టర్‌ పార్థ దత్తా

ఈనాడు, హైదరాబాద్‌: ఎఫ్‌సీఏ (ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌) ఇండియా నూతన అధ్యక్షుడు, ఎండీగా డాక్టర్‌ పార్థ దత్తా నియమితులయ్యారు. తమ భారతీయ కార్యకలాపాలకు నేతృత్వం వహించటానికి డాక్టర్‌ దత్తా ఎంపిక ఎంతో సరైనదని, స్థానిక మార్కెట్‌పై ఆయనకు ఎంతో అవగాహన ఉన్నట్లు ఎఫ్‌సీఏ ఆసియా పసిఫిక్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మస్సిమిల్లియానో త్రాంతిని అభిప్రాయపడ్డారు. డాక్టర్‌ పార్థ దత్తాకు విశాఖపట్టణంతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్ధి. 1985-89 మధ్యకాలంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించారు. అంతకు ముందు విశాఖపట్టణంలోని సెయింట్‌ ఆలోసిస్‌ హైస్కూల్‌లో, టింపనీ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని మయామి విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ఎంఎస్‌, తదుపరి వేన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఆయనకు ఆటోమొబైల్‌ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఎఫ్‌సీఏలో ఆయన చెన్నై, పూనే లోని సాంకేతిక కేంద్రాల డైరెక్టర్‌గా, చైనాలో ప్రోడక్ట్‌ ఇంజనీరింగ్‌ అధిపతిగా పనిచేశారు. ఇటీవల వరకూ ‘ఉత్తర అమెరికా వెహికల్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ వాలిడేషన్‌’ విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. కొత్త మోడల్‌ కార్లలో అధిక శాతం స్థానికంగానే తయారు చేయాలని (లోకలైజేషన్‌), ‘జీప్‌’ బ్రాండ్‌ వాహనాలను భారతదేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతి చేయాలనేది తమ ప్రణాళికగా పేర్కొంటూ వాటి సాధనకు డాక్టర్‌ పార్థ దత్తా కృషి చేస్తారనే ఆశాభావాన్ని మస్సిమిల్లియానో త్రాంతిని వెలిబుచ్చారు. ఇప్పటి వరకూ ఎఫ్‌సీఏ ఇండియా ఎండీగా వ్యవహరించిన కెవిన్‌ ఫ్లిన్‌ను ఆస్ట్రేలియా కార్యకలాపాలకు సీఈఓగా బదిలీ చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు