close

బిజినెస్‌

పసుపు ఆడిస్తే పన్ను కట్టాల్సిందే..

హైదరాబాద్‌ శివార్లలో ఒక ఫ్లాట్‌ను బుక్‌ చేశాను. ఇందు కోసం ఏప్రిల్‌ 2019లోపే 20 శాతం మొత్తం చెల్లించాను. అయితే ఏప్రిల్‌ 2019 నుంచి జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ మా బిల్డరు 12 శాతం జీఎస్‌టీ కోరుతున్నారు. క్రెడాయ్‌ ప్రకారం.. పాత జీఎస్‌టీకి వెళ్లడం బిల్డరు ఇష్టమని అతను చెబుతున్నారు. ఏప్రిల్‌ 2019 తర్వాతే నర్మాణం మొదలుపెట్టారు. ఇంకా తొలి అంతస్తులో నిర్మాణం ఉంది. నేను 12% జీఎస్‌టీ చెల్లించాల్సిందేనా?

- మేఘ్యా నాయక్‌ బి

 

కేంద్ర పన్ను రేటు నోటిఫికేషన్‌ నం.03/2019, 29.03.19 ప్రకారం.. ఏదైనా ప్రాజెక్టు.. కొనసాగుతున్న ప్రాజెక్టుగా పిలవాలంటే నాలుగు షరతులు వర్తిస్తాయి. 1.) 31.03.2019న లేదా ఆ లోపున ప్రాజెక్టు ప్రారంభ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత అధికారి జారీ చేసి ఉండాలి.2) ధ్రువీకరణ పత్రం అవసరం లేనిచోట 31.03.2019 కంటే ముందే నిర్మాణం ప్రారంభమై ఉండాలి. 3) 31.03.2019న లేదా అంత కంటే ముందు భవన నిర్మాణం పూర్తి అయినట్లుగా ధ్రువీకరణ పత్రం జారీ చేయకుండా ఉండినట్లయితే. 4) 31.03.2019 కంటే ముందే ఆ అపార్ట్‌మెంట్‌ పూర్తిగా లేదా పాక్షికంగా బుక్‌ అయి ఉంటే. ఈ నాలుగు షరతుల మీద మీ బిల్డరు నుంచి సమాచారం తీసుకోండి. ఒక వేళ ఈ నాలుగు షరతులు వర్తించినట్లయితే బిల్డరు చెప్పినట్లు 12 శాతం జీఎస్‌టీ కట్టాల్సిందే. లేదంటే 5 శాతం జీఎస్‌టీనే వర్తిస్తుంది.

హెచ్‌పీ, ఐఓసీ, రిలయన్స్‌ వంటి సంస్థల నుంచి పెట్రోలు, డీజిల్‌ డీలర్లు అందుకుంటున్న కమీషన్‌పై జీఎస్‌టీ ఉందా? ఉంటే అది ఎంతో చెప్పండి

- సత్యనారాయణ దావులూరి, విజయవాడ

 

పెట్రోలియం కంపెనీల నుంచి పెట్రోలు, డీజిల్‌ డీలర్లు అందుకునే కమీషన్‌పై సేవల విభాగం కింద వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వర్తిస్తుంది. సీజీఎస్‌టీ 9%, ఎస్‌జీఎస్‌టీ 9% చొప్పున మొత్తం 18% జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది.

గత అయిదేళ్లుగా కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ఇపుడు సొంతంగా వెబ్‌సైట్‌, యాప్‌ను ప్రారంభించి కూరగాయలను డెలివరీ ద్వారా అమ్మాలనుకుంటున్నా. కూరగాయలు జీఎస్‌టీ పరిధిలోకి రానప్పటికీ.. ఈ-కామర్స్‌ ద్వారా చేస్తున్నందున జీఎస్‌టీ నమోదు చేసి, రిటర్నులు దాఖలు చేయాలంటున్నారు. ఇపుడు నేనేం చేయాలో చెప్పగలరు.

- నారాయణరావు

 

జీఎస్‌టీ చట్టం నిబంధనల ప్రకారం.. వెబ్‌సైట్‌, యాప్‌ల ద్వారా వస్తువులను సరఫరా చేసే మీ కార్యకలాపాలు ఇ-కామర్స్‌ నిర్వచనం కిందకు వస్తాయి. కానీ మూలం వద్ద పన్ను వసూలు(టీసీఎస్‌) చేయడానికి అవసరమయ్యే జీఎస్‌టీ చట్టంలోని సెక్షన్‌ 52 కిందకు రారు. కాబట్టి మీరు తప్పనిసరి నమోదు విభాగంలోకి రారు. ఇ-కామర్స్‌లో కూరగాయల సరఫరాకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంది. ఒక వేళ మీరు కూరగాయల ధరలతో పాటు ఇతరత్రా ఏదైనా మొత్తాన్ని వసూలు చేస్తే.. ఆ లావాదేవీలను జీఎస్‌టీని వసూలు చేయడం కోసం పునః పరిశీలించాలి.

నా సంస్థ అవసరాల కోసం ఒక లాప్‌టాప్‌ కొన్నాను. రూ.9000 టాక్స్‌ ఇన్‌పుట్‌ క్లెయిం చేశాను. కానీ షాప్‌ యజమాని టాక్స్‌ కట్టలేదు. మా ఆడిటర్‌కు కూడా చెప్పలేదు. షాప్‌కు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. పన్ను కట్టాం అని చెబుతున్నారు. 2017-18 వార్షిక రిటర్నులు దాఖలు చేయడానికి ఆడిటర్‌ ఇపుడు పన్ను కట్టాలంటున్నారు. ఇపుడు ఏం చేయాలో  చెప్పండి.

- రామకృష్ణ, వి.జె. ఎంటర్‌ప్రైజెస్‌

 

జీఎస్‌టీఆర్‌-2ఏ రిటర్నులో ఇన్‌వాయిస్‌ కనిపించలేదన్న కారణంతో లాప్‌టాప్‌ కొనుగోలుపై సరఫరాదారు ఇచ్చిన పన్ను ఇన్‌వాయిస్‌ను తిరస్కరించలేరు. మీరు నాకు పంపిన పన్ను ఇన్‌వాయిస్‌ను చూశాను. ఒక పన్ను రశీదులో ఉండాల్సిన వివరాలన్నీ ఉన్నాయి. మీ సరఫరాదారు పన్ను చెల్లించామనీ చెబుతున్నారు. కాబట్టి.. మీరు చెప్పిన వివరాలు నిజమైతే.. ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)ని తిరస్కరించలేరు. అదే సమయంలో మీరు లాప్‌టాప్‌ ఇన్‌వాయిస్‌పై రెండోసారి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి 2017-18 ఇన్‌వాయిస్‌ను మీ సరఫరాదారు అప్‌లోడ్‌ చేయలేరు. అయితే మీరు మాత్రం ఐటీసీని తీసుకోండి. ఒక వేళ అధికారులెవరైనా దర్యాప్తు చేసినా.. మీరు చెప్పిన విషయాలు వాళ్లకు చెప్పండి.

మాకు పసుపు పొడి మిల్లు ఉంది. జీఎస్‌టీ నమోదు చేసుకున్నాం. పసుము కొమ్ములు తీసుకుని పౌడరు చేసి ఇస్తాం. దీనికి గాను మేం తీసుకున్న మిల్లింగ్‌ ఛార్జీలపై జీఎస్‌టీ కట్టాలా. మాకు ఏ ఇతర వ్యాపారాలు లేవు.

 - ఆనంద్‌

 

పసుము కొమ్ములను పసుపు పొడిగా మార్చడమనేది జీఎస్‌టీ చట్టం కింద వ్యవసాయ కార్యకలాపాల కిందకు రాదు. మీరు వసూలు చేస్తున్న ఛార్జీలపై సేవల విభాగం కింద 18 శాతం జీఎస్‌టీని మీరు కట్టాలి. రూ.20 లక్షల వరకు మీ టర్నోవరు దాటనంత వరకు మీకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఒక వేళ ఆపైన ఉంటే మాత్రం జీఎస్‌టీ నమోదు తప్పనిసరి. అయితే మీరు ఇప్పటికే జీఎస్‌టీ నమోదును కలిగి ఉన్నారు కాబట్టి ప్రాథమిక మినహాయింపు మీకు వర్తించదు. ఎందుకంటే.. నమోదు చేసుకున్న తర్వాత ప్రాథమిక మినహాయింపు వర్తించదు. కాబట్టి మీరు మీ వినియోగదార్ల నుంచి జీఎస్‌టీ వసూలు చేసి.. ప్రభుత్వానికి కట్టండి.

వర్క్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాం. రోడ్ల మరమ్మతులతో పాటు వివిధ ప్రభుత్వ పనులు చేస్తుంటాము. 2018-19 సంవత్సరానికి నెలవారీ జీఎస్‌టీఆర్‌3బీ, జీఎస్‌టీఆర్‌1 నిల్‌ టర్నోవరును ఫైల్‌ చేశాం. అయితే 2018-19 ఏడాదికి 26ఏఎస్‌ కింద వచ్చిన మొత్తం వర్క్స్‌ టర్నోవరు ఆధారంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశాం. నా అనుమానం ఏమిటంటే.. జీఎస్‌టీ నెలవారీ రిటర్నులలో ఈ వర్క్స్‌లను చూపించాలా? సిమెంటు, ఇనుము వంటి వస్తువులను జీఎస్‌టీ నమోదిత డీలర్ల నుంచి చేసిన కొనుగోళ్లపై ఐటీసీ క్లెయిముకు అర్హత ఉంటుందా?

- సుందరయ్య కె

 

వర్క్స్‌ కాంట్రాక్ట్‌ సేవలకు జీఎస్‌టీ వర్తిస్తుంది. జీఎస్‌టీ టర్నోవరును రిటర్నులలో తప్పకుండా చూపించాలి. జీఎస్‌టీ చట్టం కింద పన్ను విధింపు, సరఫరా సమయం, సరఫరా స్థలం, సరఫరా విలువ వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. జీఎస్‌టీ నమోదిత వ్యక్తుల నుంచి సిమెంటు, ఇనుము తదితరాలను మీరు కొనుగోలు చేస్తే.. మీకు ఐటీసీ క్లెయిమునకు మీకు అర్హత ఉంటుంది.

రిఫ్రిజిరేషన్‌, ఏసీ మరమ్మతుల షాపును పార్ట్‌ టైంగా నిర్వహిస్తున్నాను. టర్నోవరు రూ.లక్ష కంటే పైన ఉండదు. జీఎస్‌టీ నమోదు నాకు అవసరమా?

- అమ్మిరాజు సీహెచ్‌

 

మీ టర్నోవరు ప్రాథమిక మినహాయింపు పరిమితి అయిన రూ.20 లక్షల లోపే ఉంది. కాబట్టి మీకు జీఎస్‌టీ నమోదు అవసరం లేదు. వార్షిక టర్నోవరు ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉందన్న విషయాన్ని మీ వినియోగదార్లకు మీరు అర్థమయ్యేలా చెప్పండి.

మీ సందేహాలు పంపండి

జీఎస్‌టీకి సంబంధించి మీ సందేహాలు మాకు పంపించండి.. మీ సందేహాలు  ఎలాంటివైనా సరే అవి క్లుప్తంగాను, సరళంగాను ఉండాలి.. మా చిరునామా

eenadubusinessdesk@gmail.com; businessdesk@eenadu.net


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు