close

బిజినెస్‌

సాంకేతికతతో 35% నీటి ఆదా

తొలిసారిగా క్లౌడ్‌ బేస్డ్‌ ఆటోమెటిక్‌ ఇరిగేషన్‌ వ్యవస్థ
జీఎంఆర్‌ ఆధ్వర్యంలో విమానాశ్రయంలో ఏర్పాటు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: క్లౌడ్‌ బేస్డ్‌ ఇరిగేషన్‌ వ్యవస్థను ఉపయోగించిన నీటిని ఆదా చేసే ప్రక్రియకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీకారం చుట్టింది. ఇరిగేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సాఫ్ట్‌వేర్‌ (ఐఐఎంఎస్‌)ను ఉపయోగించి పని చేసే నీటి పారుదల వ్యవస్థను విమానాశ్రయంలోని 8.4 కిలోమీటర్ల ప్రధాన రహదారి పొడవునా జీఎంఆర్‌ ఏర్పాటు చేసింది. దీని ద్వారా 80 ఎకరాల్లో ఉన్న చెట్లు, మొక్కలకు నీటిని అందించడంతో పాటు గతంలో కంటే 35శాతం వరకు నీటిని ఆదా చేస్తున్నారు. భారతదేశంలో ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. గతేడాది జనవరిలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) విమానాశ్రయంలోని 8.4కి.మీ పొడవైన ప్రధాన రహదారి గుండా ఆటోమాటిక్‌ ఇరిగేషన్‌ వ్యవస్థను ప్రారంభించింది. ప్రధాన రహదారికి 2.4 కి.మీ పొడవున మూడు భాగాలుగా విభజించి, వాటిలో రెండు సైట్‌ కంట్రోలర్లు అమర్చారు. ఈ దశలో నీటి పారుదల షెడ్యూల్‌ను విడుదల చేసి నీటి పరిమాణాన్ని సైట్‌ కంట్రోలర్ల ద్వారా నియంత్రించేవారు. ప్రస్తుతం అనేక మార్పుల అనంతరం ఏర్పాటు చేసిన నీటి పారుదల వ్యవస్థలో కంట్రోలర్లను క్లౌడ్‌ బేస్డ్‌ ఐఐఎంఎస్‌ ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా సెంట్రల్‌ ఇరిగేషన్‌ వ్యవస్థకు అనుసంధానించారు. ఇది నిరంతరం నీటి పారుదల వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. వేసవికాలంలో ప్రధాన రహదారిపై నీటిపారుదలకు 1684కెఎల్‌డీ (కిలో లీటర్‌ పర్‌ డే)ల నీరు అవసరం అవుతుంది. మనుషులతో నిర్వహించే నీటి పారుదల వ్యవస్థతో పోల్చితే క్లౌడ్‌ బేస్డ్‌ నీటిపారుదల వ్యవస్థ కారణంగా 35శాతం వరకు నీరు ఆదా అవుతోందని అధికారులు చెబుతున్నారు. నీటివినియోగం, లీకేజీల గుర్తింపు, వృథానీరు, ఇతర సమస్యలను గుర్తించి వెంటనే సందేశాలను పంపే ప్రత్యేక లక్షణం ఈ సాంకేతికతకు ఉంది. పర్యావరణ స్పృహతో, సహజ వనరులను పరిరక్షించడానికి ఈ నూతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ సీఈవో ఎస్‌.జి.కె.కిషోర్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు