close

బిజినెస్‌

మంట మొదలైందా...!!

ఈనాడు వాణిజ్య విభాగం

దసరా, దీపావళి.. సీజను వస్తుందనగానే వాహన కంపెనీలు కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లతో సిద్ధమవుతుంటాయి. కొనుగోలుదార్లు కూడా ఆ కారు కొంటే బావుంటుందా? ఈ కారు కొంటే బావుంటుందా? అని అడుగుతూ  కనిపించిన ప్రతి ఒక్కరితో మంతనాల్లో మునిగి తేలుతుంటారు. డీలర్లు, విక్రయ ఉద్యోగులైతే (సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌) కంపెనీలకు తమకు ఇచ్చిన విక్రయాల లక్ష్యాన్ని పూర్తి చేసి మంచి ప్రోత్సాహకాలను పొందేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఇప్పుడా ఆనందం.. ఉత్సాహం వాహన పరిశ్రమలో ఇసుమంతైనా కనిపించడం లేదు. పండగ సీజనుకు ముందుండే సందడి.. హడావుడి అంతా మాయమైపోయింది. దీనికి కారణం.. వాహన పరిశ్రమను మందగమనం ముంచెత్తడమే. గిరాకీ కరవై అమ్మకాలు పడిపోవడంతో కంపెనీలు లబోదిబోమంటున్నాయి. ఉత్పత్తిని తగ్గించుకోవడమే శరణ్యమని కొన్ని ప్లాంట్లలో తయారీని నిలిపేస్తున్నాయి. ఫలితంగా ఉద్య్లోగులను తొలగించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మున్ముందూ ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద సంఖ్యలో కొలువులు పోయే ప్రమాదముందనే మాట పరిశ్రమ వర్గాల నోట వినిపిస్తోంది.

మాంద్యం ముంగిట్లో.. అద్వాహనం
మాంద్యం.. మాంద్యం.. మాంద్యం..
ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పదం..

అమ్మకాలు పడిపోతున్నాయి.. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. ఉత్పత్తి ఆగిపోతోంది.. ఈ మాటలు కూడా వింటూనే ఉన్నాం.. అంతేనా.. ఈసారి మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని.. అలా ఇలా కాదు.. కోరలు సాచి కబళించేందుకు సిద్ధమవుతోందంటూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడుతున్నాయి.. ఇది నిజమేనా.. పరిస్థితి అంత తీవ్రంగా ఉండబోతోందా..?? మాంద్యం పడగవిప్పి బుస కొట్టబోతోందా..?? ఈ ప్రశ్నలకు సమాధానాలు అంత తేలిగ్గా దొరకకపోవచ్చు. కానీ, ప్రమాద ఘంటికలు మోగుతున్న సంకేతాలు  ఇప్పటికే కానవస్తున్నాయి. దశాబ్దం కిందట ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసినా.. మన దేశం మాత్రం మాంద్యం ముప్పు నుంచి తప్పించుకోగలిగింది. కానీ, ఈసారి గట్టెక్కడం అంత ఆషామాషీగా కనిపించడంలేదు 8% వైపు పరుగులు తీస్తుందనుకుంటున్న వృద్ధి రేటు కాస్తా 5 శాతానికి పడిపోయింది. పారిశ్రామికోత్పత్తి డీలా పడింది... మౌలికం వంటి కీలక రంగాలు పడకేశాయి. వివిధ రంగాల్లో ఇప్పటికే ఉద్యోగాల కోత మొదలైంది.. నియామకాలు తగ్గిపోయాయి. కొత్త అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చనే స్వరాలు వినవస్తున్నాయి.
వాహన రంగం ఇప్పటికే డీలా పడిపోయింది.. బ్యాంకింగ్‌ రంగం బెంగతో నీరసించిపోయింది. స్టాక్‌ మార్కెట్లు అడపాదడపా తప్పిస్తే కోలుకుంటున్న దాఖలాలే కనిపించడంలేదు. మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎఫ్‌ఎంసీజీ... ఇలా అన్ని రంగాలకూ సెగ తగలడం మొదలైంది. నవంబరు-డిసెంబరు నుంచి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా వచ్చే జూన్‌ దాకా మాంద్యం తాలూకు భయాలు మనల్ని వెంటాడే అవకాశాలు నిండా ఉన్నాయి. ప్రస్తుతం మాంద్యం కోరలు సాచకపోయినా.. మందగమనమైతే మొదలైంది.. ఈనేపథ్యంలో యావత్‌ భారత్‌ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని హెచ్చరిస్తున్నారు ఆర్థికవేత్తలు. పరిస్థితి గమనించిన ప్రభుత్వం ఇప్పటికే రకరకాల ఉపశమన చర్యలు ప్రారంభించింది. మరెన్నో చర్యలు ఉండొచ్చన్న సంకేతాలూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫలించి మాంద్యం కోరల్లో చిక్కుకోకుండా గట్టెక్కితే అదే పదివేలు..

ఊపిరిలూదాలి..

అమ్మకాల క్షీణతతో సతమతమవుతున్న వాహన పరిశ్రమకు ఊపిరిలూదడం ప్రభుత్వం తక్షణం చేయాల్సిన పని. ముఖ్యంగా మందగమనం నెలకొన్న ఇటువంటి తరుణంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా అవసరం. ప్రస్తుతం అమ్మకాలు పుంజుకోవాలంటే.. జీఎస్‌టీ రేటును తగ్గించడం ఒక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గమనే మాట వినిపిస్తోంది.  జీఎస్‌టీ రేటు అధికంగా ఉండటంతో ధర భారమై కొనుగోలుదార్లు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. జీఎస్‌టీ రేటును తగ్గించకుంటే మున్ముందు కూడా అమ్మకాలు పుంజుకోకపోవచ్చని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

కొలువులు కొట్టుకుపోతాయ్‌

గిరాకీ కరవై ఓ వైపు నిల్వలు పేరుకుపోయాయ్‌. అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అందుకే ఉన్న నిల్వలను తగ్గించుకోవడంపై డీలర్లు దృష్టి పెట్టారు. దీంతో కంపెనీలు కూడా కొత్తగా వాహనాలను ఎక్కువ సంఖ్యలో తయారీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అందుకే ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. మారుతీ, టాటా మోటార్స్‌ లాంటి వాహన తయారీ దిగ్గజాలు కూడా కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేశాయి. తయారీని తగ్గించుకుంటున్నప్పుడు సిబ్బంది ఎక్కువ మంది ఉండి ప్రయోజనం లేదని తాత్కాలిక ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. మున్ముందు శాశ్వత ఉద్యోగాల కోతకూ కంపెనీలు సిద్ధమయ్యే అవకాశం ఉంది. అటు అమ్మకాలు లేకపోవడంతో డీలర్లు కూడా నిర్వహణ భారాన్ని మోయలేకపోతున్నారు. దీంతో కొన్ని చోట్ల డీలర్‌ కేంద్రాలు కూడా మూతపడిపోతున్నాయి.

సామాజిక వైపరీత్యాలు..

ప్రస్తుతం వాహన పరిశ్రమలో నెలకొన్న మందగమనం మరింత తీవ్ర రూపం దాలిస్తే వేల సంఖ్యలో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంటుంది. ఇదే జరిగితే సామాజిక వైపరీత్యాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగాలు పోయినవాళ్లలో ఇంటి రుణం, వాహన రుణం ఇలా పలు రుణాలు తీసుకున్న వాళ్లుంటారు. ఎన్నో రకాల ఆర్థిక ప్రణాళికలు వేసుకొని దానికి తగ్గట్లుగా మదుపు, చెల్లింపులు చేస్తుంటారు. ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యోగం పోతే వాటిని చెల్లించడం, మదుపు చేయడం ఆగిపోతుంది. ఈ చెల్లింపులు చేసేందుకు వేరే దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం లేకపోవడం వల్ల ఒక్కోసారి ఆ అప్పు పుట్టకపోవచ్చు. తిరిగి ఎలాగోలా మరో ఉద్యోగం సంపాదించినా.. కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకే ఆ డబ్బులు సరిపోతాయి. అప్పుల కుప్ప మాత్రం పెరిగిపోతుంటుంది. అప్పు తిరిగి కట్టకపోవడంతో ఇంటి వద్దకు బ్యాంకులు తమ ఉద్యోగులను పంపిస్తాయి. ఇలా ఇంటి ముందుకు వచ్చి అడగడంతో అప్పటివరకు సంపాదించిన మంచి పేరును పోగొట్టుకున్నామని కుమిలిపోయే వాళ్లుంటారు. దానిని తట్టుకోలేక ఏమైనా అఘాయిత్యానికి పాల్పడే వాళ్లుంటారు. కొందరు దొంగలుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా ఒకటి కాదు ఎన్నో రూపాల్లో సామాజిక వైపరీత్యాలకు ఉద్యోగాల కోత దారితీసేందుకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్నారు.

ప్రభుత్వం ఏం చేయాలి..

విద్యుత్‌ వాహనాల విధానానికి సంబంధించి ఇటీవల కొన్ని ఉద్దీపనలు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాల వల్ల అమ్మకాల పురోగతిలో ఎటువంటి మార్పు ఉండదన్నది వాహన పరిశ్రమల అభిప్రాయం. అమ్మకాల క్షీణతకు కారణాలేమిటి? విక్రయాలు పుంజుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయాలపై తక్షణం దృష్టి పెట్టాలి. నిధుల కొరత సమస్యను సత్వరం పరిష్కరించాలి. ముఖ్యంగా జీఎస్‌టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలి. 2008, 2014 మాంద్యం సమయంలో ప్రభుత్వం ప్రకటించిన పన్ను ప్రోత్సాహకాలు అప్పుడు వాహన పరిశ్రమకు ఎంతో మేలు చేశాయి. ఇప్పుడు కూడా అదే మాదిరి తక్షణ ప్రోత్సాహకాలు అందిస్తే వాహన పరిశ్రమ గాడిన పడేందుకు అవకాశం ఉంటుందని సియామ్‌ అభిప్రాయపడుతోంది.

ఏ అమ్మకాలు చూసినా.. ఏముంది ఆనందం

ఆగస్టులో వాహన అమ్మకాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. సియామ్‌ వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. ద్విచక్ర వాహనాలు.. త్రిచక్రవాహనాలు.. కార్లు, లారీలు.. ఇలా ఏ ఒక్క విభాగంలో అమ్మకాలు చూసినా నిరాశజనకమే. ప్రస్తుత మందగమనం నేపథ్యంలో వాహన పరిశ్రమకు మున్ముందూ ఇబ్బందులు కొనసాగొచ్చని సియామ్‌ భావిస్తోంది. ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు వరుసగా 10వ నెలా క్షీణించడం గమనార్హం. గత నెలలో మిగతా విభాగాల అమ్మకాలు క్షీణత బాటే పట్టాయి. ప్యాసింజర్‌ వాహనాలు, ద్విచక్రవాహనాలు, వాణిజ్య వాహనాలు సహా మొత్తం వాహనాల అమ్మకాలు ఆగస్టులో 18,21,490 వాహనాలుగా నమోదయ్యాయి. 2018 ఆగస్టులో నమోదైన 23,82,223 వాహనాలతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా 23.55 శాతం క్షీణించాయి. సియామ్‌ 1997-98లో వాహనాల విక్రయ గణాంకాలను లెక్కగట్టడం ప్రారంభించిన నాటి నుంచి ఇంత తక్కువ అమ్మకాలు నమోదుకావడం ఇదే మొదటిసారి.

ఓ వినాయకా..

ఏటా గణేశ్‌ చతుర్థి సంబరాల కోసం
మూషిక వాహనంపై దివి నుంచి భువికి దిగివస్తావు.
అక్కడ్నుంచి ఏ ట్రాక్టరో.. లారీయో నిన్ను మండపానికి చేరుస్తాయి..
నవరాత్రులు ముగిశాక నిమజ్జనం కోసం మళ్లీ ఏదో ఒక వాహనంపై ఊరేగింపుగా వెళ్తావు..
నిమజ్జనం పూర్తయ్యాక మళ్లీ నీ మూషిక వాహనంపై తిరిగి దివికేగుతావు.
చూశావా.. ఈ తొమ్మిది రోజులూ నీ రాకపోకలన్నింటినీ  వాహనాలే దగ్గరుండి చూసుకున్నాయి..
మరి ఆ వాహన పరిశ్రమ కష్టాల్లో పడ్డప్పుడు దాని బాగోగులు కూడా నువ్వే చూసుకోవాలి కదా సామీ..
ఇప్పుడు వాహన పరిశ్రమ గగ్గోలు పెడుతోంది. దాన్ని కాస్త గట్టెక్కించేలా చూడు గణపయ్యా...


వినండొహో...

ఖర్చు తగ్గించుకోండి.. వచ్చే 6 నెలల్లో అదనపు ఆడంబరాల జోలికి పోకండి.. చేతిలో డబ్బులున్నాయి కదా అని ఖరీదైన వస్తువులు కొనాలనుకుంటే.. కాసేపు ఆ ఆలోచనను పక్కన పెట్టేయండి...

గాడిన పడుతుందో లేదో..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన నెలల్లోనైనా వాహన పరిశ్రమ తిరిగి సానుకూల వృద్ధి దిశగా అడుగులు వేయబోదేమోననే ఆందోళన నన్ను వెంటాడుతోంది. ప్రస్తుతం డిమాండుకు తగ్గట్లుగా వాహనాల తయారీకి ఎంత మంది అవసరమో అంతకుమించి సిబ్బంది వాహన కంపెనీలు, సరఫరాదార్ల వద్ద ఉన్నారేమోనని నా భావన. అందుకే మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6 మారడమనేది పరిశ్రమకు అతిపెద్ద సవాలు లాంటింది. సరఫరా వ్యవస్థ, నిల్వలు, తయారీ ప్లాంట్లు ఇలా అన్ని మార్పులకు లోనవుతాయి. పరిశ్రమ వృద్ధి దిశగా సాగుతున్నప్పుడు ఇలాంటి సవాళ్లను ఎన్నైనా తట్టుకోగలం. కాని మందగమనంలో అది సాధ్యం కాదు.
- పవన్‌ గోయెంకా, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఎంఅండ్‌ఎం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు