close

ఆంధ్రప్రదేశ్

ఉత్కంఠ.. ఉద్రిక్తత

‘చలో ఆత్మకూరు’పై పోటాపోటీ ఆందోళనలకు తెదేపా, వైకాపాల పిలుపు
అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
పోలీసు ఉన్నతాధికారుల వద్దకు ఇరుపార్టీల నేతలు
గుంటూరుపునరావాసశిబిరం వద్ద పోలీసు బలగాల మోహరింపు
పల్నాడులో నిషేధాజ్ఞలు
తెదేపా నేతల బైండోవర్‌
ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు

ఈనాడు, గుంటూరు: తెదేపా, వైకాపాలు పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో గుంటూరు జిల్లాలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పల్నాడులో ఎక్కడికక్కడ, గుంటూరులోని తెదేపా కార్యాలయం పరిసరాల్లోనూ, ఆ పార్టీ నిర్వహిస్తున్న ‘వైకాపా బాధితుల పునరావాస శిబిరం’ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. తెదేపా నాయకుల్ని బైండోవర్‌ చేశారు. కొందరిని హౌస్‌ అరెస్టు చేశారు. ‘సేవ్‌ డెమోక్రసీ.... సేవ్‌ పల్నాడు’ పేరుతో తెదేపా బుధవారం ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం చేపట్టింది. దానికి పోటీగా వైకాపా బుధవారమే ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి సిద్ధమైంది. ఇరు పార్టీలు పోటాపోటీగా పల్నాడు వెళ్లేందుకు సిద్ధమవడం, మంగళవారం తెదేపా, వైకాపా నేతలు విలేకరుల సమావేశాలు పెట్టి పరస్పర ఆరోపణలు చేసుకోవడం, పోలీసు ఉన్నతాధికారులను కలవడంతో వాతావరణం వేడెక్కింది. మంగళవారం ఉదయమే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు తాజా పరిస్థితులపై పార్టీ  నాయకులతో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, బాధితుల డిమాండ్లపై చర్చించారు. మరోవైపు అదనపు ఎస్పీ, గుంటూరు ఆర్డీవో తెదేపా నిర్వహిస్తున్న బాధితుల పునరావాస శిబిరానికి వచ్చి పలుమార్లు పార్టీ నేతలతో చర్చించారు. డీజీపీ స్థాయి అధికారి వచ్చి రాష్ట్రంలోని వైకాపా బాధితులందరి సమస్యలనూ పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని తెదేపా నేతలు పట్టుబట్టడంతో సమస్య కొలిక్కి రాలేదు. మంగళవారం సాయంత్రానికి వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. పునరావాస శిబిరంతో పాటు, తెదేపా కార్యాలయం పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. శిబిరంలోని వారిని బలవంతంగా వారి గ్రామాలకు తరలిస్తారన్న ప్రచారం జరిగింది. ఏ క్షణానికి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మంగళవారం రాత్రి గుంటూరులోని వైకాపా బాధితుల పునరావాస శిబిరాన్ని పరిశీలించారు.

హౌస్‌ అరెస్టులు  పోరాటాన్ని ఆపలేవు: చంద్రబాబు
ప్రతిపక్షనేత చంద్రబాబు మంగళవారం రాత్రి పొద్దుపోయాక తెదేపా నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. తెదేపా నేతల హౌస్‌అరెస్టులు తమ పోరాటాన్ని ఆపలేవని, ఎక్కడ అరెస్టులు జరిగితే అక్కడే ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అంతకు ముందు ఉదయమూ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆత్మకూరు యాత్రకు వారిని సమాయత్తం చేశారు. ఉదయం నుంచి  పార్టీ కార్యాలయంలో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు... పునరావాస శిబిరం ఏర్పాటు చేసిన 8 రోజుల తర్వాత అధికారులు రావడం, బాధితులను గ్రామాలకు తీసుకెళ్తామని చెప్పడం తదితర అంశాలపై పార్టీ నేతలతో చర్చించారు. ‘బాధితుల్ని గ్రామాలకు తీసుకెళ్తామని చెబుతున్న పోలీసులు మరోవైపు పల్నాడులో 144వ సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఇది పల్నాడు ప్రాంత సమస్యే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో బాధితులు గుంటూరు చేరుకుంటున్నారు. వారందరిపై తప్పుడు కేసులు ఎత్తేయాలి. ధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలి’ అని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రస్థాయి అధికారిని పంపాలి
మంగళవారం బాధితుల శిబిరానికి వచ్చిన అదనపు ఎస్పీ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు... తెదేపా నేతలతో పలుమార్లు చర్చించారు. తెదేపా తలపెట్టిన ‘చలో ఆత్మకూరు’కు అనుమతి లేదని తమకు సహకరించాలని కోరారు. ఇది రాష్ట్రవ్యాప్త సమస్య కనుక డీజీపీ లేదా శాంతిభద్రతల అదనపు డీజీ వచ్చి పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఆలోచిస్తామని తెదేపా నేతలు.. ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు తదితరులు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వరకు తాము సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో శిబిరం నుంచి బాధితులను పంపడానికి తెదేపా నేతలు అంగీకరించలేదు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులకు న్యాయం జరిగేవరకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నుంచి స్పష్టమైన హామీ లేనందున ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం కొనసాగిస్తామని తెదేపా నేతలు స్పష్టం చేశారు.

పోలీసు ఉన్నతాధికారులను కలిసిన ఇరు పార్టీల నేతలు
‘చలో ఆత్మకూరు’ పర్యటనకు అనుమతి ఇవ్వాలని వైకాపా నేతలు.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు మంగళవారం గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కలిశారు. ‘తెదేపా బాధితుల’తో కలసి తామూ ఆత్మకూరు వెళతామన్నారు. పల్నాడులో 144వ సెక్షన్‌ ఉన్నందున వారికి అనుమతివ్వలేమని ఐజీ స్పష్టం చేశారు. మరోపక్క తెదేపా నేతలు మంగళవారం సాయంత్రం గుంటూరు గ్రామీణ జిల్లా ఎస్పీ జయలక్ష్మిని కలిసి రాష్ట్రవ్యాప్తంగా వైకాపా బాధితుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని కోరారు. దాడులు ఒక్క పల్నాడులోనే కాదని, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై డీజీపీ నుంచి సరైన స్పష్టత వచ్చే వరకు శిబిరం కొనసాగిస్తామన్నారు. మంగళవారం రాత్రిలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే, బుధవారం ఉదయం 9గంటలకు గుంటూరు నుంచి ఆత్మకూరుకు వెళతామని ఎస్పీకి స్పష్టం చేశారు. ఇదే అంశంపై గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌కి వారు ఒక లేఖ రాశారు.

తెదేపా నేతల గృహ నిర్బంధం

‘చలో ఆత్మకూరు’ నేపథ్యంలో పోలీసులు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును, కృష్ణాజిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావును, ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావు, అశోక్‌రెడ్డిలను హౌస్‌ అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా నుంచి ఆత్మకూరుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని నూజివీడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. పల్నాడు ప్రాంతంలో పలువురు తెదేపా నేతలను పోలీసుస్టేషన్‌కు పిలిపించి ‘చలో ఆత్మకూరు’లో పాల్గొనకూడదని సంతకాలు తీసుకుని బైండోవర్‌ చేసి పంపారు. నరసరావుపేట తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అరవిందబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి యాదవ్‌లకు నోటీసులు జారీ చేశారు. సత్తెనపల్లిలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రామస్వామి, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ పెదకరిముల్లా, పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావులతో పాటు 14 మందిని బైండోవర్‌ చేశారు. పిడుగురాళ్లలో డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. దుర్గి మండల కేంద్రంలో రెండు పోలీసు బెటాలియన్లను అందుబాటులో ఉంచారు. మాజీ సర్పంచి ఏసుబు సాయంతో డీఎస్పీ శ్రీహరిబాబు గ్రామాలను వదిలిపెట్టి ముటుకూరు, గంగమహేశ్వరపాడు, కోలగుట్ల గ్రామాల్లో ఉన్నవారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల పోలీసు డివిజన్లలో 144వ సెక్షన్‌ విధించడంతో ఎక్కడా గుంపులుగా ఉండకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పోలీసుల పహారాలో ఆత్మకూరు

ఆత్మకూరు(దుర్గి), న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా దుర్గి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామాన్ని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి నుంచి తమ అధీనంలోకి తీసుకున్నారు. గ్రామంలోకి ఎవరినీ అడుగుపెట్టనివ్వడంలేదు. అదనపు ఎస్పీతో పాటు నలుగురు డీఎస్పీలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, 13మంది ఎస్సైలు, సుమారు 300 మందికి పైగా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని, గ్రామంలోకి ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేస్తామని గురజాల డీఎస్పీ ఆర్‌.శ్రీహరిబాబు చెప్పారు. దుర్గి, ఆత్మకూరు, ఒప్పిచర్ల, శ్యామరాజపురం, మాచర్ల, రాయవరం జంక్షన్‌, ఉప్పలపాడు, నకరికల్లు తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు