close

ఆంధ్రప్రదేశ్

ఆధార్‌ కోసం మరిన్ని గుర్తింపు పత్రాలకు అనుమతి

ఈనాడు, దిల్లీ: ఆధార్‌ కార్డు నమోదు, ఆ కార్డులోని వివరాలను మార్చుకొనేందుకు సమర్పించాల్సిన సమాచారానికి సంబందించి మరింత వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు నిబంధనలకు సవరణలు చేస్తూ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇప్పటి వరకూ వ్యక్తిగత గుర్తింపు కోసం 18 రకాల పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించడానికి వీలుండేది. ఇప్పుడు ఆ సంఖ్యను 31కి పెంచారు. నివాస ధ్రువీకరణకు 33 రకాల పత్రాలను అనుమతించేవారు. ఇప్పుడు 43కి పెంచారు. బంధుత్వ నిరూపణ గుర్తింపు పత్రాల సంఖ్యను 9 నుంచి 14కి, జన్మ ధ్రువీకరణ పత్రాల సంఖ్యను 4 నుంచి 14కి పెంచారు.

ఆధార్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు, తాజా సమాచారం చేర్చేందుకు ఇప్పటి వరకూ ఆమోదించే వాటితో పాటు ఈ గుర్తింపు పత్రాలనూ అనుమతిస్తారు.

గుర్తింపు ధ్రువ పత్రం (కొత్తగా జతచేసినవి)
1. భామాషాహ్‌ కార్డు
2.  అనాథలకు గుర్తింపు పొందిన షెల్టర్‌హోమ్స్‌ సూపరింటెండెంట్‌, వార్డెన్‌, మేట్రన్‌, ఆ సంస్థ అధిపతి అధికారిక లెటర్‌హెడ్స్‌పై ఇచ్చిన సర్టిఫికెట్‌
3. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్‌ కౌన్సిలర్లు తమ లెటర్‌హెడ్స్‌పై ఇచ్చిన ఫొటో ధ్రువీకరణపత్రం
4. గ్రామపంచాయతీ స్పరంచ్‌ ఇచ్చిన ఫొటో ధ్రువీకరణ పత్రం
5. పేరు మార్పిడి కోసం జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌
6. ఫొటోలతో ఉన్న వివాహ ధ్రువీకరణపత్రం
7. ఆర్‌ఎస్‌బీవై కార్డు
8. అభ్యర్థుల ఫొటోలున్న ఎస్‌ఎస్‌ఎల్‌సీ బుక్కు
9. పేరు, ఫొటో ఉన్న స్కూల్‌ లీవింగ్‌ సర్టిఫికెట్‌ (ఎస్‌ఎల్‌సీ), స్కూల్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ),
10. స్కూల్‌ హెడ్‌ జారీచేసిన స్కూల్‌ రికార్డ్‌లోని పేరు, ఫొటో ఉన్న భాగం
11. పేరు, ఫొటో ఉన్న బ్యాంక్‌ పాస్‌ బుక్కు
12. గుర్తింపు పొందిన విద్యాసంస్థ అధిపతి పేరుతో సహా జారీచేసిన ఫొటో ధ్రువీకరణపత్రం
13. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ ధ్రువీకరణ పత్రం

చిరునామా ధ్రువీకరణ పత్రం
1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన నివాస కేటాయింపు ధ్రువీకరణ పత్రం (మూడేళ్లలోపు ఇచ్చినవి)
2.చిరునామాతో ఉండే ప్రభుత్వం జారీచేసిన వివాహ ధ్రువీకరణపత్రం
3. భామాషాహ్‌ కార్డు
4. అనాథలకు షెల్టర్‌హోమ్స్‌ సూపరింటెండెంట్‌, వార్డన్‌, మేట్రన్‌, హోం అధిపతి తమ లెటర్‌హెడ్‌ పై  ఇచ్చిన ధ్రువీకరణపత్రాలు
5. మున్సిపల్‌ కౌన్సిలర్‌ తన లెటర్‌ హెడ్‌పై ఫొటోతో సహా జారీచేసిన అడ్రస్‌ సర్టిఫికెట్‌
6. ఫొటో ఉన్న ఎస్‌ఎస్‌ఎల్‌సీ బుక్కు
7. పాఠశాల గుర్తింపుకార్డు
8. స్కూల్‌ లీవింగ్‌ సర్టిఫికెట్‌, స్కూల్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (పేరు, అడ్రస్‌ ఉన్నవి)
9. స్కూల్‌ హెడ్‌ జారీచేసిన స్కూల్‌రికార్డులోని భాగం (పేరు, అడ్రస్‌, ఫొటోగ్రాఫ్‌తో సహా)
10. గుర్తింపు పొందిన విద్యాసంస్థ అధిపతి పేరు, అడ్రస్‌, ఫొటోగ్రాఫ్‌తోసహా జారీచేసిన ధ్రువీకరణ పత్రం.

బంధుత్వ ధ్రువీకరణ పత్రం
1.పేరు, ఫొటోతో సహా పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ జారీచేసిన అడ్రస్‌కార్డు
2. భామాషా కార్డు,
3. బాలలు పుట్టినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు జారీచేసిన డిశ్చార్జికార్డు, స్లిప్పు
4. ఎంపీ, ఎమ్మెల్మే, ఎమ్మెల్సీ, మున్సిపల్‌ కౌన్సిలర్‌, గెజిటెడ్‌ ఆఫీసర్‌లు తమ అధికారిక లెటర్‌హెడ్‌పై జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు
5. కుటుంబ పెద్ద కోసం ఇంట్లోవారి వివరాలతో కలిపి గ్రామపంచాయతీ సర్పంచి జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు (గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే).

జన్మ ధ్రువీకరణ కోసం...
1. ప్రభుత్వ అధికారి సంతకంతో జారీ అయిన సర్టిఫికెట్‌, గుర్తింపుకార్డు (ఫొటో, పుట్టిన తేదీ ఉన్నవి)
2. గుర్తింపు పొందిన విద్యాసంస్థలు పుట్టిన తేదీతో సహా జారీచేసిన గుర్తింపుకార్డులు
3. పాన్‌కార్డు
4. ప్రభుత్వ విద్యామండలి, యూనివర్శిటీ జారీచేసిన మార్క్‌షీట్‌
5. పుట్టినరోజుతో సహా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డులు
6.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌
7. సీజీహెచ్‌ఎస్‌ ఫొటోకార్డు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీం ఫొటో కార్డు
8. పేరు, పుట్టినరోజు ఉన్న స్కూల్‌ లీవింగ్‌ సర్టిఫికెట్‌, స్కూల్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌
9. పేరు, పుట్టినతేదీ, ఫొటోతో సహా ఉన్న స్కూల్‌ రికార్డు (స్కూల్‌హెడ్‌ జారీచేసింది)
10. గుర్తింపు పొందిన విద్యాసంస్థ అధిపతి పేరు, పుట్టిన తేదీ, ఫొటోతో సహా జారీచేసిన గుర్తింపుకార్డులను ఇకమీదట ఆధార్‌ నమోదు, సవరణల కోసం అనుమతిస్తారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు