close

ఆంధ్రప్రదేశ్

యురేనియంపై ఫిర్యాదుల వెల్లువ

పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో పూర్తయిన కమిటీ పర్యటన
ప్రభావంపై నేడు ఏపీపీసీబీకి నివేదిక

ఈనాడు డిజిటల్‌-కడప, వేముల-న్యూస్‌టుడే: కడప జిల్లా వేముల మండలం ఎం.తుమ్మలపల్లెలోని యూసీఐఎల్‌ కర్మాగార ప్రభావిత గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ) నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం విస్తృతంగా పర్యటించింది. కమిటీలోని 11మంది నిపుణుల బృందం ఏడు గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించింది. రెండోరోజు బాధిత గ్రామాల్లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించింది. అరటి, టమోటా, చీనీ తదితర పంటల పరిస్థితిని పరిశీలించింది. కర్మాగార టెయిల్‌పాండ్‌ నుంచి వెలువడే వ్యర్థాలతో భూగర్భజలాలు కలుషితం కావడం, పంటలు పండకపోవడం, వాయుకాలుష్యంతో చర్మవ్యాధులు సోకడం వంటి అంశాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకూ తమ బాధలు పట్టించుకోని యూసీఐఎల్‌ అధికారుల తీరుపై ప్రజలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోర్లలో నీరు అడుగంటడం, పంటలు పండకపోవడంపై సభ్యులు బాధితులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు. కేకే కొట్టాల, కనంపల్లె గ్రామాల్లో ఎక్కువ మందికి తల, కాళ్లు, చేతుల్లో కురుపులు వచ్చాయని, కడుపులో గడ్డలు పెరిగాయని, వివాహితలకు గర్భస్రావాలు అయ్యాయని, మరికొన్ని గ్రామాల్లో మేకలు, గొర్రెలకు చర్మంపై బొబ్బలు వచ్చి చనిపోయాయని పేర్కొంటూ బాధితులు సంబంధిత వైద్య నివేదికలను కమిటీ సభ్యుల ముందుంచారు. ఈ నేపథ్యంలో సమస్యల పరంగా నిపుణులను మళ్లీ ఆయా గ్రామాలకు పంపే విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తామని నిపుణుల కమిటీ కన్వీనర్‌, ఎన్జీఆర్‌ఐ ప్రిన్సిపల్‌ సీనియర్‌ శాస్త్రవేత్త ఈవీఎస్‌ఎస్‌కే బాబు వారికి స్పష్టం చేశారు. యురేనియం కర్మాగార పరిసర గ్రామాల ప్రజల సమస్యలపై అధ్యయనం చేసిన అంశాలను నిష్పక్షపాతంగా ఏపీపీసీబీకి నివేదిస్తామని ఆయన తెలిపారు. రెండోరోజు గ్రామాల్లో పర్యటన సందర్భంగా ఈవీఎస్‌ఎస్‌కే బాబు కమిటీ సభ్యులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. యూసీఐఎల్‌ కర్మాగారం టెయిల్‌పాండ్‌లోకి వదిలే వ్యర్థాలతో భూగర్భజలాలు కలుషితం కావడం, పంటలు పండకపోవడం, ప్రజలకు వ్యాధులు ప్రబలడంపై సమాచారాన్ని సేకరించామన్నారు. యురేనియం ముడిఖనిజం వెలికితీత, మిల్లింగ్‌, శుద్ధి ప్రక్రియ, వినియోగించే రసాయనాలపై యూసీఐఎల్‌ అధికారులతో చర్చించినట్లు చెప్పారు. టెయిల్‌పాండ్‌ నిర్మాణ ఆకృతిపై తమ బృందంలోని సివిల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు నివేదిక తయారుచేస్తారన్నారు. సమాచారాన్ని క్రోడీకరించి బుధవారం మధ్యాహ్నంలోగా ఏపీపీసీబీకి సమగ్రనివేదికను సమర్పిస్తామని బాబు వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు