close

గ్రేటర్‌ హైదరాబాద్‌

కమల దళపతి అయ్యేదెవరు?

తెలంగాణలో పార్టీ సారథ్యానికి పోటాపోటీ
రెండోసారి అవకాశం వస్తుందని లక్ష్మణ్‌ ధీమా
రేసులో అరడజనుకుపైగా నేతలు
ఇంతమంది పోటీయా అంటూ అమిత్‌షా ఆశ్చర్యం!

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ భాజపాలో సంస్థాగత ఎన్నికల సందడి మొదలు కావడంతో రాష్ట్ర నాయకత్వ బాధ్యతల కోసం పార్టీ నేతల్లో పోటీ మొదలైంది. అరడజనుకుపైగా నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు. డిసెంబరులో జరిగే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటాపోటీ ఉండటంతో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మరోసారి తనకే అవకాశం వస్తుందన్న ధీమాతో ఉన్నారు.

కొనసాగింపా? మార్పా?
భాజపాకు కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక డిసెంబరు చివరలో జరగనుంది. ఈలోగా రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక పూర్తికావాల్సి ఉంది. రెండోసారి పదవి చేపట్టేందుకు లక్ష్మణ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్లుగా తాను చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి చేసిన కృషిని జాతీయ నాయకత్వానికి వివరించినట్లు తెలిసింది. అమిత్‌షా లక్ష్మణ్‌ను కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అభిప్రాయం కీలకం కానుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ వైపు ‘సంఘ్‌’ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దూకుడుగా వెళ్లడం, యువతలో ఆకర్షణ వంటి అంశాలు ఆయనకు అనుకూలిస్తాయని చెబుతున్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తొలి ప్రాధాన్యంగా కేంద్ర మంత్రి పదవి లేదంటే రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.

కొత్త నేతలకు అవకాశం?
లోక్‌సభ ఎన్నికల ముందు భాజపాలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిలు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తెరాస ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లడం, మహిళ కోటా, బలమైన సామాజికవర్గం వంటి అంశాలు అరుణకు అనుకూలిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి. జాతీయస్థాయిలో ముఖ్యహోదాలో, తెలంగాణలో పార్టీలోకి చేరికల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత ద్వారా ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బలమైన సామాజికవర్గ నేపథ్యంతోపాటు, రెండు సార్లు ఎంపీగా గెలిచిన నేపథ్యం తనకు కలిసివస్తాయని జితేందర్‌రెడ్డి భావిస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు ఇచ్చే అవకాశాల ఉండవని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. భాజపాలో ముందు నుంచి ఉన్న నేతల్లో ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు